
Chinna Reddy :తెలంగాణలో అధికార పార్టీలో కలకలం చెలరేగుతుంది. సొంత పార్టీ నేతలే సొంతపార్టీపై ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. పార్టీ సీనియర్లు ఒకరోకరుగా గళం విప్పుతున్నారు. పార్టీలో పరిస్థితుల పైన మండిపడుతున్నారు. ప్రభుత్వ అవినీతి పైన ఫైర్ అవుతున్నారు. భరిస్తున్నా అంతేకానీ సీనియర్ నేత జీవన్ రెడ్డిలా తాను ఓపిక నశిస్తే తిరగబతానని పార్టీ మరో సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి హెచ్చరించారు. పార్టీ నాయకులు కోట్ల రూపాయాలు తింటున్నారని ఆరోపించారు. ఒక వైపు కోమటిరెడ్ది రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలపై చేసిన ఆరోపణల సెగ చల్లారక ముందే ఇప్పుడు చిన్నారెడ్డి అవే వ్యాఖ్యలు చేయడం పార్టీలో సంచలనంగా మారాయి.
కాగా, సొంత పార్టీకే చెందిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చిన్నారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బులతో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని.. నియోజకవర్గంలో కాంగ్రెస్ను అవినీతి పార్టీగా మార్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన పనులకు అడ్డుపడుతూ.. తన కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశౄరు. తనకు ఓపిక నశిస్తే మరో జీవన్రెడ్డిలా మారి తిరగబడతానని ఈ సందర్భంగా చిన్నారెడ్డి హెచ్చరించారు.
ఇంకా మాట్లాడుతూ.. కాంగ్రెస్లో కొన్ని తప్పులు జరుగుతున్నాయన్నారు, పార్టీకి అన్యాయం చేస్తున్న వారిని బయటకు పంపించాల్సిన అవసరం ఉందని అన్నారు. వనపర్తిలో కొందరు పార్టీని సర్వనాశనం చేస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. గత ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. “డబ్బులకు ఆశపడి అధిష్ఠానం నాకు టికెట్ ఇవ్వలేదు” అంటూ తీవ్రంగా ఆరోపించారు. పార్టీలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం అవసరమని.. ఇందుకోసం సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని చిన్నారెడ్డి అధిష్టానికి సూచించారు. అంతేకాక స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
“నా సీటును డబ్బులకు అమ్మారు.డబ్బులు ఇచ్చి మేఘారెడ్డి టికెట్ కొనుక్కున్నాడు. రేవంత్ సీఎం అవుతారని చెప్పాక కూడా నా సీటును ఇతరులకు అమ్మేశారు.నేను ఎమ్మెల్యేగా ఉంటే మంత్రిని అయ్యేవాడిని.మేఘారెడ్డి వల్ల వనపర్తి అభివృద్ధి పనులు ఆగిపోయాయి-.కాంట్రాక్టులు తన మనుషులకు రాలేదని పనులు అడ్డుకుంటున్నారు.నా అనుచరులను కూడా మేఘారెడ్డి ఇబ్బంది పెడుతున్నారు.పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీపై తిరగబడతా. పార్టీని వదిలి వెళ్లను.. కానీ, మేఘారెడ్డిని మాత్రం వదలను.మేఘారెడ్డి లాంటి వాళ్లను పార్టీ నుంచి తరిమేస్తా’ అంటూ చిన్నారెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు.
సీఎం రేవంత్ స్వయంగా శంకుస్థాపన చేసిన ఐటీ టవర్ నిర్మాణం, నర్సింగాయిపల్లి వద్ద పీజీ కేంద్రంలో బాలికలకు రూ.9 కోట్లతో వసతిగృహం, బాలురకు రూ.15 కోట్లతో హాస్టల్ నిర్మాణానికి టెండరు పిలిచారని ఆయన వివరించారు, కానీ, ఆ పనులు జరగడం లేదని తెలిసి తాను స్వయంగా ఆయా శాఖల మంత్రి, అధికారులను ప్రశ్నించినట్లు చిన్నారెడ్డి వెల్లడించారు. అయితే.. పనులకు ఎమ్మెల్యేనే అడ్డు పడ్డారని, ఆ కాంట్రాక్టర్ తన మనిషి కాడంటూ కాంట్రాక్టు రద్దు చేయించారని చిన్నారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి కోట్టు కోట్లు తిని, ప్రజల నోట్లో డబ్బులు పెట్టి నా రాజకీయంపై దెబ్బ కొట్టారు” అని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, చిన్నారెడ్డి వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపడంతో అధిష్టానం చర్యలకు ఉపక్రమించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.









