TGSRTC :  దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో చార్జీలు పెరగనున్నాయి. సాధారణ ఛార్జీ కంటే గరిష్ఠంగా 1.5 రెట్లు వసూలు చేయనున్నారు. 2003లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ పెంపు ఉంటుందని టీజీఎస్‌ఆర్టీసీ తెలిపింది. అక్టోబర్ 9, 10, 16, 17, 25, 26 తేదీల్లో నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే పెంచిన ఛార్జీలు వర్తిస్తాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లే స్పెషల్ బస్సులు కూడా ఇందులో ఉన్నాయి. సాధారణ బస్సుల్లో మాత్రం ఎప్పటిలాగే ఛార్జీలు ఉంటాయి.

ప్రత్యేక బస్సుల్లో కరీంనగర్ జోన్ నుంచి 3,533 బస్సులు, ఆదిలాబాద్ నుంచి 431, నిజామాబాద్ నుంచి 719, వరంగల్ నుంచి 530, ఖమ్మం నుంచి 678 బస్సులు నడపనున్నారు. హైదరాబాద్ జోన్ పరిధిలో మొత్తం 2,155 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. వీటిలో మహబూబ్‌నగర్ నుంచి 645, మెదక్ నుంచి 255, నల్గొండ నుంచి 815, రంగారెడ్డి నుంచి 440 బస్సులు ఉంటాయి. హైదరాబాద్ జోన్ పరిధిలో మరో 1,312 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అక్టోబర్ 9, 10, 16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ రోజుల్లో అదనపు బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. అలాగే పండుగ తర్వాత సొంతూళ్ల నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం అక్టోబర్ 25, 26 తేదీల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఆరాంఘర్, ఎల్‌బీనగర్ క్రాస్‌రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రధాన ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు నడవనున్నాయి. ప్రయాణికుల కోసం ఆయా ప్రాంతాల్లో టెంట్లు, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, తాగునీరు, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుందని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వై. నాగి రెడ్డి తెలిపారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సాధారణ, ప్రత్యేక బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని చెప్పారు. ప్రయాణికులు ముందుగానే టీజీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన వివరాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లకు కాల్ చేయవచ్చు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.