
గత కొద్ది రోజులుగా ఫ్రాన్స్‌లో ఎండల తీవ్రతకు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఫ్రాన్స్, జర్మనీలతో పాటు యూరప్‌లోని పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. భారత్‌తో సహా ఆసియా దేశాలలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు సర్వసాధారణమే అయినప్పటికీ, ఫ్రాన్స్ ప్రజలు మాత్రం ఈ వేడిని తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు, మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ అంశం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే, అమెరికన్ పర్యాటకులు కొందరు ఫ్రాన్స్‌లోని ఈ పరిస్థితిని చూసి సోషల్ మీడియాలో ఎగతాళి చేయడంతో, ఈ వివాదం మరింత ముదిరింది. ఆ విమర్శలపై ఫ్రాన్స్ ఘాటుగా స్పందిస్తూ.. యూరప్‌లో ఈ స్థాయి ఎండలకు అమెరికానే కారణమని నేరుగా ఆరోపించింది.
Also Read : బుర్రపాడు మావా: 1,000cc సామర్థ్యం.. 8 సిలిండర్లతో కొత్త బైక్.. ధర మామూలుగా లేదు..!
ఏసీలు లేవంటూ అమెరికా ఎగతాళి… ఫ్రాన్స్ సంస్కృతి ఏంటి?
ఫ్రాన్స్‌లో అసలు ఏసీలు ఎందుకు లేవంటూ అమెరికాకు చెందిన పలువురు విమర్శలు గుప్పించారు. వాస్తవానికి ఫ్రాన్స్‌లో ఏసీలను ఉపయోగించే వారి సంఖ్య సగటున 25 శాతం మాత్రమే కాగా, జర్మనీలో ఇది కేవలం 7 శాతంగానే ఉంది. ఫ్రాన్స్, జర్మనీలలోని అత్యధిక ఇళ్లు, కార్యాలయాలలో ఏసీలు ఉండవు. అంతెందుకు, అక్కడ కూలర్లు, ఫ్యాన్లు కూడా చాలా అరుదుగా వాడుతుంటారు. వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉండే ఆ దేశాలలో ఒక్కసారిగా ఎండలు మండటంతో ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికన్లు ఫ్రాన్స్‌ను ఎగతాళి చేయడంతో, ప్యారిస్ డిప్యూటీ మేయర్ ‘ఆడ్రీ పుల్వర్’ గట్టి కౌంటర్ ఇచ్చారు. యూరప్‌లో ఇంతటి తీవ్రమైన హీట్‌వేవ్ (వడగాల్పులు) రావడానికి అమెరికానే ప్రధాన కారణమని ఆమె మండిపడ్డారు. ప్రపంచంలో కార్బన్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేసే దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉందని, దాని వల్లే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి తాము ఈ దుష్పరిణామాలను అనుభవిస్తున్నామని ఆమె ఆరోపించారు.
ప్యారిస్ డిప్యూటీ మేయర్ సోషల్ మీడియాలో ఏమన్నారంటే?
“ప్రియమైన అమెరికన్ జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లారా… మా ఇళ్లలో, ప్రతి గదిలో ఏసీ ఎందుకు లేదంటూ మీలో చాలామంది ప్యారిస్ను ఎగతాళి చేశారు, విమర్శించారు. కానీ ప్రపంచంలో గ్రీన్హౌస్ వాయువులను అత్యధికంగా విడుదల చేస్తున్న దేశాల్లో మీది (అమెరికా) రెండో స్థానంలో ఉంది. కాబట్టి గ్లోబల్ వార్మింగ్‌కు చాలా వరకు మీరే బాధ్యులు. మీరు చేసిన తప్పుకు ఇప్పుడు ఫ్రాన్స్‌లో మేము అనుభవిస్తున్నాము. మీ నగరాల్లోని 90 శాతం ఇళ్లలో ఏసీలు ఉన్నాయి. కానీ మాది అలాంటి సంస్కృతి కాదు.” గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో అమెరికా తన వంతు పాత్రను పోషించాలని, అంతేకాని తమను చూసి ఎగతాళి చేయడం తగదని పుల్వర్ హితవు పలికారు.
Also Read : క్రికెట్ అభిమానులకు శుభవార్త.. టీమిండియా బెర్త్ ఖరారు!
మారుతున్న ప్రజల ఆలోచనలు
‘ఇప్సోస్’ (Ipsos) నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. ఫ్రాన్స్‌లో 78 శాతం మంది ప్రజలు ఏసీలను ఉపయోగించడం మంచి పద్ధతి కాదని నమ్ముతారు. ఆ సర్వేలో పాల్గొన్న ప్రతి ఆరుగురిలో ఒక్కరు మాత్రమే ఏసీల వాడకం సరైనదేనని అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణ కోసం కాస్త వేడిని భరించడమే మంచిదని, ఏసీలను వాడకూడదని అక్కడి ప్రజలు భావిస్తూ వచ్చారు. అయితే, గత వారం రోజులుగా నమోదవుతున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, హీట్‌వేవ్ మరణాలు వారి ఆలోచనలను మార్చేస్తున్నాయి. ప్రాణాలను కాపాడుకోవడానికి ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు దుకాణాలకు పరుగులు తీస్తూ ఏసీలను కొనుగోలు చేస్తున్నారు.









