USA :  అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఎరీ నగరంలో శుక్రవారం సాయంత్రం దారుణం జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు చిన్నారులు, ఓ గర్భిణీ సహా కనీసం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా తనకు తానే కాల్చుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 9న సాయంత్రం 5 గంటల సమయంలో ఎరీ నగరంలోని పెర్రీ స్ట్రీట్‌లో ఉన్న ఓ ఇంట్లో కాల్పులు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇంటి బయట ఇద్దరు మహిళలు చనిపోయి ఉండగా, మరికొందరు ఇంటి లోపల ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు.

మొదట ఇంటి బయట ఉన్న ఇద్దరు మహిళలపై కాల్పులు జరిపిన దుండగుడు, ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి అక్కడ ఉన్న వారిపై కూడా కాల్పులు జరిపినట్లు సమాచారం. అనంతరం అతడు ఇంట్లోనే ఉండిపోవడంతో పోలీసులు, స్వాట్ బృందాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. ఈ ఘటనపై ఎరీ పోలీస్ చీఫ్ రిక్ లోరా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాము ఇప్పటివరకు చూసిన అత్యంత బాధాకరమైన ఘటనల్లో ఇదొకటని చెప్పారు. ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం తమను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి తనకు తానే తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్లు పోలీస్ చీఫ్ వెల్లడించారు. అయితే, అతడు ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడనే విషయం ఇంకా తెలియరాలేదు. మృతులకు, నిందితుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది కూడా పోలీసులు గుర్తించలేదు. మృతుల పేర్లను అధికారులు ఇంకా బయటపెట్టలేదు.

ఘటన జరిగిన సమయంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తుపాకీ శబ్దాలు వినిపించడంతో కొందరు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. మరోవైపు, ఇంటి బయటకు పెద్ద సంఖ్యలో పోలీసు వాహనాలు చేరుకున్నాయి. స్వాట్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని ఎరీ నగర అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు, ఈ ఘటనతో బాధపడుతున్న వారందరికీ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, సమాచారం నిర్ధారించుకున్న తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.