
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ఇరాన్‌పై మళ్లీ దాడికి సంబంధించి కీలక చర్చలు జరుగుతున్న సమయంలో అమెరికా రక్షణ శాఖ బోర్డురూమ్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. సైన్యానికి, వైట్ హౌస్‌కు మధ్య వ్యూహాలను పర్యవేక్షించే అత్యున్నత అధికారిపై ప్రభుత్వం ఉన్నపలంగా వేటు వేసింది. దీంతో ట్రంప్‌కు సొంత సైనిక నాయకత్వంపైనే నమ్మకం లేదా అనే చర్చలు మళ్లీ మొదలయ్యాయి.
అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌లోని ‘స్ట్రాటజీ, ప్లాన్స్ అండ్ పాలసీ’ విభాగాధిపతి, లెఫ్టినెంట్ జనరల్ బ్రెట్ సిల్వియాను పదవి నుంచి తొలగించారు. గతంలో 101వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు కమాండర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. సైనిక చర్యల వ్యూహాలు రచించడంలో రక్షణ విధానాల రూపకల్పనలో J5 విభాగం అత్యంత కీలకమైనది. ఇరాన్‌తో ముప్పు పొంచి ఉన్న వేళ ఇటువంటి ముఖ్యమైన అధికారిని తప్పించడం సరైన నిర్ణయం కాదని మాజీ సైనిక అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : అమెరికాలో అణు భయం.. సౌత్ కరోలినా ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటన!
గత కొన్ని నెలలుగా అమెరికా-ఇరాన్ మధ్య పరిస్థితి కాస్త శాంతించినట్లు అనిపించినా.. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో బలగాలు ముఖాముఖి తలపడుతూనే ఉన్నాయి. ఇరాన్‌లోని అణు కేంద్రాలపై పరిమిత దాడులు చేయడం నుంచి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా సుదీర్ఘ సైనిక చర్యల వరకు అనేక ఆప్షన్లను అమెరికా సైన్యం సిద్ధం చేసి ఉంచింది. ట్రంప్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాగానే దాడులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రక్షణ శాఖలో తీవ్ర అస్థిరత నెలకొంది. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్, జనరల్ డేవిడ్ హోడ్నే, మేజర్ జనరల్ విలియం గ్రీన్ జూనియర్ వంటి దిగ్గజ అధికారులను ఇప్పటికే పదవుల నుంచి తీసేశారు. మంత్రి హెగ్సెత్తో విభేదాల వల్ల జనరల్ క్రిస్ డోనాహ్యూ రాజీనామా చేశారు. ఇప్పటివరకు కనీసం 26 మంది అగ్రశ్రేణి జనరల్స్, అడ్మిరల్స్ పదవులు కోల్పోవడం అమెరికా సైనిక వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది.
లెఫ్టినెంట్ జనరల్ సిల్వియాను ఎందుకు తొలగించారో పెంటగాన్ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఉన్నతాధికారుల నమ్మకాన్ని కోల్పోవడం, మాజీ సైనిక అధిపతులతో సన్నిహితంగా ఉండటం, రక్షణ శాఖ నుంచి రహస్య సమాచారం మీడియాకు లీక్ అయ్యిందనే అనుమానాలే ఈ చర్యలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ పరిణామాలు ఇరాన్‌తో పోరు వేళ అమెరికా సైనిక సంసిద్ధతపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.
Also Read : రైలు ప్రయాణికులకు అలర్ట్: రాత్రిపూట ఛార్జింగ్ బంద్









