ఆర్మేనియా పార్లమెంట్‌(Armenian Parliament Session) లైవ్‌లో ఎంపీలు కొట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు కనీస విలువలను మరచి వీధి రౌడీల్లా ప్రవర్తించారు. అధికారిక చర్చల కోసం సమావేశమైన ఎంపీలు ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండగానే ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడం, కుర్చీలు విసురుకోవడం, తన్నుకోవడంతో సభ రణరంగాన్ని తలపించింది. ఈ దాడిలో పలువురు ఎంపీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆర్మేనియా నేషనల్ అసెంబ్లీలో ఆడిట్ ఛాంబర్ సభ్యుడి ఎన్నిక ప్రక్రియపై చర్చ ప్రారంభమైంది.

ఈ సమయంలో ప్రధాని నికోల్ పషిన్యాన్ నేతృత్వంలోని అధికార సివిల్ కాంట్రాక్ట్ పార్టీకి చెందిన ఎంపీ టరాన్ చఖోయాన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష స్ట్రాంగ్ ఆర్మేనియా పార్టీపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నేత నరేక్ కారపెత్యాన్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటూ ఆయన బంధువులు గతంలో చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తుచేసి విమర్శించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అగ్రహంతో ఊగిపోయిన ప్రతిపక్ష నేత నరేక్ కారపెత్యాన్ వెంటనే పోడియం వైపు దూసుకువచ్చారు.

Also Read : ట్రంప్ మాస్టర్ మైండ్ ఏఐ గ్రోక్.. అమెరికా రాజకీయంలో మస్క్ చాట్‌బాట్ కలకలం!

ఈ క్రమంలోనే ప్రతిపక్ష ఎంపీ గార్నిక్ దావ్త్యాన్ తొలి పిడిగుద్దు విసరడంతో సభ ఒక్కసారిగా అదుపు తప్పి హింసాత్మకంగా మారింది. సభలోని సభ్యులు ఒకరిపై ఒకరు యుద్ధానికి దిగారు. ఈ క్రమంలో సభ డిప్యూటీ స్పీకర్ వాహగ్న్ అలెక్సాన్యన్ ఏకంగా ప్రతిపక్ష సభ్యులపైకి భారీ కుర్చీని విసిరేశారు. ఈ దాడిలో ప్రతిపక్ష ఎంపీ ఆండ్రానిక్ గెవోర్గ్యాన్ ముక్కు పగిలి రక్తం కారగా.. మరో ఎంపీ రూబెన్ ఖితార్యాన్ షర్ట్ పూర్తిగా చిరిగిపోయింది. క్షతగాత్రులకు తక్షణ వైద్యం కోసం అత్యవసరంగా అంబులెన్స్‌ను పార్లమెంట్‌కు పిలిపించాల్సి వచ్చింది. సాధారణంగా పార్లమెంట్‌లో గొడవలు జరిగినప్పుడు లైవ్ ప్రసారాన్ని నిలిపివేస్తారు.. కానీ ఇక్కడ స్పీకర్ రూబెన్ రూబిన్యాన్ భిన్నంగా వ్యవహరించారు.

ప్రజాప్రతినిధులుగా ఎంపీల నిజస్వరూపం, వారి అసభ్యకర ప్రవర్తన ప్రజలందరికీ స్పష్టంగా తెలియాలనే ఉద్దేశంతోనే తాను లైవ్ ఆపలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం పరిస్థితి చేయిదాటడంతో సభను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ హింసాత్మక ఘటనపై దేశ ప్రధాని నికోల్ పషిన్యాన్ స్పందిస్తూ.. ఈ గొడవకు సంపూర్ణ బాధ్యత ప్రతిపక్షాలదేనని స్పష్టం చేశారు. తమ పార్టీ డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాలపైకి కుర్చీ విసరడాన్ని ఆయన బహిరంగంగా సమర్థిస్తూ.. అది సరైన ప్రతిచర్య అని వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలు హద్దులు దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రధాని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read : అమెరికాలో అణు భయం.. సౌత్ కరోలినా ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటన!