
Australia Visa : వీసా నిబంధనలపై అమెరికా అనుసరిస్తున్న విధానాలనే ఆస్ట్రేలియా అనుసరిస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు, కార్మికులు, యోగా ఉపాధ్యాయుల వీసా రూల్స్‌లో మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్, అంతర్జాతీయ విద్యార్థులకు సంబంధించిన నిబంధనలపై చర్చ తీవ్రరూపం దాల్చింది. ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చే వలసలకే తమ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి టోని బర్క్ స్పష్టం చేయడం సంచలనంగా మారింది. అయితే, ఆస్ట్రేలియాలో కేవలం సుదీర్ఘకాలం నివసించడానికి ఒక మార్గంగా వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, అలా చేయకుండా ఉండడానికి దానిపై మరింత నియంత్రణ సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
నేషనల్ ప్రెస్ క్లబ్లో చేసిన ప్రసంగంలో మంత్రి ఈ విషయాలను వెల్లడించారు. అంతర్జాతీయ విద్యార్థుల వీసా మార్పిడి, నిర్మాణ రంగానికి చెందిన కార్మికుల (కన్స్ట్రక్షన్ వర్కర్స్) అవసరం, యోగా ఉపాధ్యాయులకు సంబంధించిన ఆరోపణలపై ఆయన ప్రభుత్వం వైఖరిని స్పష్టం చేశారు.
Also Read : శత్రువుల గోడను బద్దలు కొట్టిన పుతిన్.. పార్లమెంట్లో 355 సీట్లు.. కోలుకోని ట్రంప్!
కన్స్ట్రక్షన్ వర్కర్లు, యోగా ఉపాధ్యాయులపై మంత్రి ఏమన్నారంటే?
ఆస్ట్రేలియాలో నిర్మాణ రంగ కార్మికుల కంటే ఎక్కువ మంది యోగా ఉపాధ్యాయులను అనుమతిస్తున్నారనే వార్తలను టోని బర్క్ ఖండించారు. గత ఏడాది ఆస్ట్రేలియాకు వచ్చిన కన్స్ట్రక్షన్ వర్కర్ల సంఖ్య 15,000 కంటే కాస్త తక్కువగా ఉందని, గతంలో ఇది కేవలం 4,500 మాత్రమే ఉండేదని ఆయన తెలిపారు. అంటే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగ కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అదే సమయంలో తమ ప్రభుత్వ హయాంలో యోగా ఉపాధ్యాయులను పిలిపించిన సంఖ్య పూర్తిగా శూన్యమని ఆయన స్పష్టం చేశారు. యోగా ఉపాధ్యాయుల నిబంధన గత ప్రభుత్వ హయాంలో భారత్‌తో జరిగిన వాణిజ్య ఒప్పందం కింద వచ్చిందని గుర్తుచేశారు.
వాణిజ్య ఒప్పందంలో యోగా ఉపాధ్యాయుల నిబంధన
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ECTA) ఏప్రిల్ 2022లో సంతకమై, డిసెంబర్ 2022 నుండి అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం కింద ప్రతి ఏటా గరిష్టంగా 1,800 మంది అర్హులైన భారతీయ ప్రొఫెషనల్స్‌కు కొన్ని ప్రత్యేక విభాగాల్లో తాత్కాలికంగా ఆస్ట్రేలియా వచ్చేందుకు అనుమతి లభిస్తుంది. ఇందులో ఇండియన్ షెఫ్‌లు, యోగా ఇన్స్ట్రక్టర్లు కూడా ఉన్నారు. అయితే ప్రతి ఏటా 1,800 మంది యోగా ఉపాధ్యాయులు ఆస్ట్రేలియా చేరుకుంటారని దీని అర్థం కాదు. ఇది గరిష్ట పరిమితి మాత్రమేనని, వాస్తవ సంఖ్య భిన్నంగా ఉంటుందని టోని బర్క్ వివరించారు.
వీసా మార్పిడి అంతా ‘వీసా హాపింగ్’ కాదు
అంతర్జాతీయ విద్యార్థులు ఒక వీసా నుండి మరొక వీసాకు మారడంపై కూడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మాట్లాడారు. ప్రతి వీసా మార్పునూ ‘వీసా హాపింగ్’ (వీసా జంపింగ్) అనడం సరికాదన్నారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఉన్న రంగంలో ఆస్ట్రేలియాలో చదువు పూర్తి చేసి, ఆ తర్వాత గ్రాడ్యుయేట్ వీసా పొంది ఉద్యోగం చేస్తూ, యాజమాన్యం సహాయంతో శాశ్వత నివాస ప్రక్రియలోకి వెళ్తే దానిని చెల్లుబాటు అయ్యే మార్గంగా పరిగణించవచ్చని తెలిపారు. అయితే చదువుకోవడం పక్కన పెట్టి, కేవలం ఆస్ట్రేలియాలో ఎక్కువ కాలం ఉండడమే లక్ష్యంగా పదేపదే కోర్సులు లేదా వీసాలు మార్చే వారిపైనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని స్పష్టం చేశారు.
కోర్సుల మార్పుపైనా నిఘా
విద్యార్థులు తమ అవసరానికి అనుగుణంగా కోర్సును విస్తరించుకోవడానికి లేదా సరైన కారణంతో సంస్థను మార్చుకోవడానికి అనుమతి ఉంటుందని మంత్రి తెలిపారు. కానీ విద్యార్థులు తమ చదువులో పురోగతి సాధించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఉదాహరణకు బ్యాచిలర్ డిగ్రీ తర్వాత మాస్టర్స్ డిగ్రీ చేయడం సాధారణ పురోగతిగా పరిగణించబడుతుంది. కానీ భిన్నమైన స్థాయిల్లో ఉన్న కోర్సులకు పదేపదే మారితే అనుమానాలు వ్యక్తమవుతాయి. స్టూడెంట్ వీసా ప్రధాన ఉద్దేశం చదువు మాత్రమే కావాలని, ఇమ్మిగ్రేషన్ మార్గంగా మారకూడదని ప్రభుత్వం భావిస్తోంది.
ఆస్ట్రేలియాలో భారీగా భారతీయ విద్యార్థులు
అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, 2026 మొదటి ఐదు నెలల్లో ఆస్ట్రేలియాలోని అంతర్జాతీయ విద్యార్థులలో భారతీయ విద్యార్థుల వాటా దాదాపు 16 శాతంగా ఉంది. చైనా తర్వాత ఆస్ట్రేలియాకు అత్యధికంగా విద్యార్థులను పంపుతున్న రెండో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. ఈ సమయంలో భారతీయ విద్యార్థుల సంఖ్య లక్ష కంటే కాస్త ఎక్కువగా ఉండగా, చైనా విద్యార్థుల సంఖ్య దాదాపు 1.6 లక్షలుగా నమోదైంది. అందుకే ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ పాలసీలో వచ్చే మార్పులు భారతీయ విద్యార్థులకు ఎంతో కీలకమైనవిగా భావించబడుతున్నాయి.
Also Read : అమెరికా గడ్డపై ఇరాన్ అధ్యక్షుడు.. యూఎన్ వేదికగా ట్రంప్ పై ఫైర్ ?
కుటుంబ సభ్యులను తీసుకెళ్లే నిబంధనల్లో మార్పులు
ప్రతిపాదిత ఇమ్మిగ్రేషన్ మార్పులలో అంతర్జాతీయ విద్యార్థులు, గ్రాడ్యుయేట్ వీసా హోల్డర్లు తమ కుటుంబ సభ్యులను ఆస్ట్రేలియాకు తీసుకురావడానికి సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు, గ్రాడ్యుయేట్ వీసా హోల్డర్లకు తమ కుటుంబ సభ్యులను స్వయంచాలకంగా (ఆటోమేటిక్‌గా) వెంట తెచ్చుకునే అనుమతిని నిలిపివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే ఇప్పటికే ఆస్ట్రేలియాలో నివసిస్తున్న కుటుంబాలను విడదీయడం తమ ఉద్దేశం కాదని పేర్కొంది. కొన్ని పసిఫిక్, ఏసియన్ దేశాల విద్యార్థులతో పాటు, PhD వంటి ప్రత్యేక ప్రోగ్రామ్‌లు చదివే విద్యార్థులకు ఈ నిబంధనల నుండి మినహాయింపు లభించే అవకాశం ఉంది.









