ఆస్ట్రేలియా భూభాగంలోని క్రిస్మస్ ద్వీపంలో ప్రకృతి అద్భుతం ఆవిష్కృతమైంది. సంతానోత్పత్తి కోసం లక్షలాది ఎర్ర పీతలు అడవుల నుంచి సముద్ర తీరం వైపు తమ వార్షిక సామూహిక వలసను ప్రారంభించాయి. దీంతో ద్వీపంలోని రోడ్లు, వీధులు, పొలాలు ఎక్కడ చూసినా ఎర్రటి తివాచీ పరిచినట్లుగా పీతలతో నిండిపోయాయి. ఇండోనేషియాలోని జావా ద్వీపానికి సుమారు 200 మైళ్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీపంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వర్షాకాలపు తొలి జల్లులు కురవగానే ఈ అద్భుత దృశ్యం కనిపిస్తుంది.

ఆస్ట్రేలియా జాతీయ ఉద్యానవనాల సంస్థ పార్క్స్ ఆస్ట్రేలియా విడుదల చేసిన తాజా వీడియోలు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోలలో లక్షలాది పీతలు గుంపులు గుంపులుగా కవాతు చేస్తూ రోడ్లను దాటుతున్నాయి. వాహనాల కింద పడి అవి ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు అధికారులు ద్వీపంలోని పలు రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. అంతేకాకుండా పీతలు సురక్షితంగా రోడ్లు దాటడానికి వీలుగా ప్రత్యేకంగా నిర్మించిన ‘పీతల వంతెనలను’ ఎక్కుతూ అవి ముందుకు సాగుతున్నాయి. ఈ లక్షలాది పీతలు నడుస్తున్నప్పుడు వాటి కాళ్ల నుండి వచ్చే శబ్దం, అచ్చం వర్షం కురుస్తున్నట్లుగా వినిపిస్తోంది.

Also Read : గొడ్డలితో రూ.560 కోట్ల మిలిటరీ విమానం ధ్వంసం

ఈ ఎర్ర పీతల వలస వెనుక ఒక అద్భుతమైన ప్రకృతి గణితం దాగి ఉంది. వీటి ప్రయాణం ప్రధానంగా వర్షపాతం, చంద్రుని దశ, సముద్రపు ఆటుపోట్ల చక్రం అనే మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా చంద్రుని చివరి పాదంలో, సముద్రపు పోటు తగ్గుతున్న సమయంలో తెల్లవారుజామున ఆడ పీతలు సముద్రంలోకి వెళ్లి గుడ్లు పెడతాయి. ఒకవేళ గుడ్లు పెట్టే సమయానికి దగ్గరలో వర్షాలు కురిస్తే ఆ సమయాన్ని అందుకోవడానికి ఈ పీతలు చాలా వేగంగా తీరం వైపు పరుగులు తీస్తాయి.

వాతావరణ మార్పులు ఈ పీతల వలసపై తీవ్ర ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2013లో ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనం ప్రకారం, వర్షాలు సరిగ్గా కురవకపోతే ఈ వలస ఆలస్యమవుతుంది లేదా పూర్తిగా రద్దవుతుంది. ఉదాహరణకు, 1997లో ‘ఎల్ నినో’ (El Nino) ప్రభావంతో తీవ్ర కరువు ఏర్పడినప్పుడు, ఈ పీతలు అసలు వలస వెళ్లలేదు. అయితే, ఈ ఏడాది ‘సూపర్ ఎల్ నినో’ పరిస్థితులు ఉన్నప్పటికీ.. వలసకు అవసరమైనంత వర్షం కురవడంతో పీతలు తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి.

సముద్ర తీరానికి చేరుకున్న తర్వాత మగ, ఆడ పీతలు జతకడతాయి. అనంతరం ఆడ పీతలు సముద్రపు నీటిలోకి వెళ్లి తమ గుడ్లను విడుదల చేస్తాయి. ఆ గుడ్లు నీటిలో పడగానే దాదాపు వెంటనే పొదుగుతాయి. సముద్రంలో ఉండే ఇతర జీవుల బారి నుండి తప్పించుకుని, దశాబ్దానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే భారీ సంఖ్యలో పీత పిల్లలు తిరిగి తీరానికి చేరుకుంటాయి. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రకృతి శాస్త్రవేత్తలను, పర్యాటకులను ఆశ్చర్య పరుస్తున్న ఈ ఎర్ర పీతల ప్రయాణం ఈ ఏడాది కూడా కనువిందు చేస్తోంది.

Also Read : డేటింగ్ కోసం వేల మంది బాయ్స్ రిక్వెస్ట్‌లు.. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్‌ అరెస్టు.. ఎందుకో తెలుసా?