నేపాల్‌లో సంభవించిన మెరుపు వరదల ఘటనలు మరువక ముందే హిమాలయ ప్రాంతంలో మరొక భారీ ప్రకృతి విపత్తు సంభవించింది. భూటాన్‌లోని వాయవ్య భాగంలో ఉన్న గాసా జిల్లాలో షింటాఫు అనే హిమానీనద సరస్సు ఒక్కసారిగా విస్ఫోటం చెంది ఉప్పొంగింది. దీనివల్ల మో చు నది పరివాహక ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్ధృతమైన వరదలు విరుచుకుపడ్డాయి. ఈ పరిణామంతో భూటాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న భారత్‌లోని పలు రాష్ట్రాలకు కూడా భారీ వరద ముప్పు పొంచి ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అప్రమత్తత ప్రకటించాయి.

Also Read : అమెరికా ఆర్మీ సంచలన నిర్ణయం.. యుద్ధం ముందే సామూహిక సమాధుల శిక్షణ.. కారణమిదే!

ఈ హిమానీనద సరస్సు విస్ఫోటం వల్ల మోచు నది పొంగిపొర్లుతూ దిగువ ప్రాంతాల వైపు ప్రవహిస్తోంది. మోచు నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం గాసా త్చాచు వద్ద ఉన్న వేడినీటి బుగ్గ సౌకర్యాలు, ఇతర నిర్మాణాలన్నీ ఉధృతమైన ప్రవాహంలో పూర్తిగా కొట్టుకుపోయాయి. అయితే ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ఆ ప్రాంతంలోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తపించుకోగలిగారు.

హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించిన 17 హిమానీనద సరస్సుల్లో ఈ షింటాఫు సరస్సు ఒకటి కావడం గమనార్హం. మోచు నది ప్రారంభమయ్యే చోటే ఉన్న ఈ సరస్సు ఉప్పొంగడం వల్ల వరద నీరు శ్రీగాంగ్ ప్రాంతాన్ని దాటుకుని దిగువకు వేగంగా ప్రవహిస్తోంది. ఇదివరకు 2021వ సంవత్సరంలో కూడా మోచు నది తన సహజ ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడంతో గాసా త్చాచు ప్రాంతంలో ఏర్పాటు చేసిన అనేక పర్యాటక సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

వరద నీరు వేగంగా కిందకు ప్రవహిస్తుండటంతో భారత సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, అస్సాం ప్రభుత్వాలను భూటాన్ యంత్రాంగం ముందస్తుగా అప్రమత్తం చేసింది. అస్సాంలోని ధుబ్రి జిల్లాతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండ ప్రాంతాలు, అలీపుర్‌దువార్, జల్‌పాయిగురి జిల్లాలకు మెరుపు వరదల ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. అంతేకాకుండా సకోశ్ నది పరివాహక ప్రాంత ప్రజలను కూచ్‌బెహార్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ రెండు రాష్ట్రాల్లో సహాయక చర్యలకు సంబంధిత విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

Also Read : ఇజ్రాయెల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. నెతన్యాహు మైండ్ గేమ్.. విపక్ష నేతకే బిగ్ ఆఫర్!