
అమెరికాలో నివసిస్తున్న గ్రీన్‌కార్డ్ హోల్డర్లు, శాశ్వత నివాసితులకు యూఎస్ సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. నేరాలకు పాల్పడిన వారిని దేశం నుంచి బహిష్కరించే విషయంలో ఉన్న అధికారాలను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి కోర్టు సమర్థించింది. ట్రంప్ ప్రభుత్వ వలస విధానాలకు బలాన్ని చేకూరుస్తూ ఈ కీలక తీర్పునిచ్చింది.
Also Read : దూసుకొస్తున్న హీట్ డోమ్.. నిప్పుల కొలిమిలా మారనున్న భారత్.. వినాశనం తప్పదా?
ఈ తీర్పు ప్రకారం ఎవరైనా శాశ్వత నివాసితులు లేదా గ్రీన్‌కార్డ్ హోల్డర్లు నేరారోపణలు ఎదుర్కొంటుంటే.. వారు అమెరికా సరిహద్దుల్లోకి రాగానే దేశంలోకి రాకుండా అడ్డుకునే అధికారం అధికారులకు లభిస్తుంది. అయితే సదరు వ్యక్తి తప్పు చేశాడని నమ్మడానికి అధికారుల వద్ద బలమైన కారణాలు లేదా ఆధారాలు ఉండాలి. దేశం నుంచి వెళ్లగొట్టే విషయంలో బోర్డర్ ఏజెంట్ల అధికారాలను ఈ తీర్పు మరింత బలోపేతం చేసింది.
మక్ చోయ్ అనే చైనా జాతీయుడు అమెరికాలో గ్రీన్‌కార్డ్‌పై నివసిస్తున్నాడు. అతనిపై నకిలీ ట్రేడ్‌మార్క్ ఉపయోగించాడనే నేరారోపణలు వచ్చాయి. ఆ సమయంలో అతను చైనా నుంచి అమెరికాకు తిరిగి వస్తుండగా బోర్డర్ అధికారులు దేశంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత కొన్ని కఠినమైన షరతులతో లోపలికి అనుమతించారు. అనంతరం తాను తప్పు చేసినట్లు చోయ్ కోర్టులో అంగీకరించాడు.
దీంతో అమెరికా ప్రభుత్వం అతనిని దేశం నుండి బహిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తాను చేసిన తప్పు నైతిక దుష్ప్రవర్తన కిందికి రాదని, కాబట్టి తనను పంపించకూడదని మక్ చోయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కానీ సుప్రీంకోర్టు అతని వాదనను తోసిపుచ్చుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఇప్పటివరకు గ్రీన్‌కార్డ్ ఉంటే అమెరికాలో సురక్షితంగా ఉండవచ్చని భావించేవారు. కానీ తాజా తీర్పుతో నేరారోపణలు ఎదుర్కొనే గ్రీన్‌కార్డ్ హోల్డర్లు కూడా ఏ క్షణమైనా దేశం నుంచి బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.
Also Read : ఉగ్రవాదులతో దోస్తీ.. జేడీ వ్యాన్స్పై అమెరికన్లతో తిరుగుబాటు.. అసలేం జరుగుతోంది?









