Russian Drone Attack : రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇదిలా ఉండగా రష్యా జరిపిన డ్రోన్‌ దాడి నుంచి బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఇతర అధికారులు త్రుటిలో తప్పించుకున్నారు. ఉక్రెయిన్‌ పర్యటనలో ఉన్న బోరిస్ జాన్సన్ తో పాటు ఇతర అధికారులు ప్రత్యేక రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో సమీపంలోని రైల్వే క్రాసింగ్‌పై రష్యా డ్రోన్‌ దాడులకు తెగపడింది. దీంతో అక్కడి ఇంధన స్టేషన్‌ దెబ్బతినగా.. పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన లోకోపైలట్లు వెంటనే రైలును ఆపారు. అందులోని ప్రయాణికులను దించేశారు. దీంతో అందరికీ ప్రాణాపాయం తప్పింది. ఆ రైలులో బోరిస్ జాన్సన్‌తో పాటు స్వీడన్ మాజీ ప్రధాన మంత్రి కార్ల్ బిల్ట్, పలువురు యూరోపియన్‌ నేతలు కూడా ఉండటం గమనార్హం. మరో విషయం ఏంటంటే అక్కడే ఉన్న మరో రైలులో అమెరికా సీఐఏ మాజీ చీఫ్‌ డేవిడ్‌ పేట్రియాస్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అక్కడే ఉన్న మరో రైలును పలు డ్రోన్లు ఢీకొట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే అప్పటికే అధికారులు ఆ రైలును ఖాళీ చేయించడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.

కాగా, ఈ దాడి అనంతరం బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ రష్యా చేసిన డ్రోన్‌ దాడులను అర్థరహితమైనవిగా పేర్కొన్నారు. క్రెమ్లిన్‌ దాడుల నుంచి తమ ప్రజలను రక్షించుకోవడానికి ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందించాలని బ్రిటన్‌ ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఉక్రెయిన్‌కు అవసరమైన గగనతల రక్షణ వ్యవస్థలను మనం ఎప్పుడు ఇవ్వబోతున్నామంటూ ఆయన బ్రిటన్‌ను ప్రశ్నించారు. మిత్రదేశాలు తగిన సాయం చేస్తే.. జెలెన్‌స్కీ ఆ యుద్ధాన్ని వేగంగా ముగించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పౌర రైల్వేలను కూడా రష్యా లక్ష్యంగా చేసుకోవడం సరికాదని, దీనివల్ల ఉక్రెయిన్‌ ప్రజలు ప్రతిరోజూ ఇటువంటి ప్రమాదాలను ఎదుర్కొంటూ, భయంభయంగా జీవించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్‌ ఎన్ని కుట్రలు పన్నినా విజయం ఉక్రెయిన్‌దేనని స్పష్టం చేశారు.

కొన్నేళ్లుగా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ విమాన సేవలను నిలిపివేసింది. డ్రోన్‌ దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆ దేశం తెలిపింది. దీంతో అక్కడి ప్రజలు బస్సులు, రైలు సర్వీసులనే ప్రయాణానికి వినియోగిస్తున్నారు. అధికారిక పర్యటనకు వచ్చిన విదేశీ నేతలు సైతం రైళ్లలోనే ప్రయాణించాల్సి వస్తోంది. ఇప్పుడు కీవ్‌లోని రైలు సర్వీసులను కూడా మాస్కో లక్ష్యంగా చేసుకుంటుండడంతో ఉక్రయిన్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.