బ్రిటన్ దేశ ప్రజలకు అధికారులు హైఅలర్ట్ జారీ చేశారు. శీతాకాలం రావడంతో దేశంలో తీవ్ర విపత్తు సంభవించవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. వచ్చే 24 గంటల్లో బ్రిటన్‌లో పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీవ్ర చలి గాలులతో పాటు భారీగా మంచు కురిసే అవకాశం ఉండటంతో రోడ్లపై మంచు దట్టంగా పేరుకుపోయి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. చల్లని ఈదురు గాలుల ప్రభావం వల్ల చాలా చోట్ల వర్షం కాస్తా ఒక్కసారిగా హిమపాతంగా మారుతుంది. సముద్ర మట్టానికి 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలలో మంచు కురిసే ముప్పు ఎక్కువగా ఉంది. మైదాన ప్రాంతాలలో 1 నుంచి 5 సెంటీమీటర్ల వరకు పర్వత ప్రాంతాలలో 5 నుంచి 15 సెంటీమీటర్ల వరకు మంచు పేరుకుపోతుందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో అయితే ఏకంగా 10 అంగుళాల వరకు మంచు కురిసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వాతావరణ విపత్తు కేవలం మంచు కురవడంతోనే ఆగిపోదు. తూర్పు దిశ నుంచి వీచే బలమైన గాలులు గంటకు 50 నుంచి 60 మైళ్ల వేగంతో వీచనున్నాయి. ఈ విపరీతమైన చలి గాలుల తాకిడికి రోడ్లపై మంచు గడ్డకట్టుకుపోయి, వాహనాలు నడిపే వారికి ఇబ్బందిగా మారనుంది. రాబోయే 24 గంటలు వాతావరణం పరిస్థితి దారుణంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్త ఐడాన్ మెక్‌గివెర్న్ స్పష్టం చేశారు. ఈ హెచ్చరిక నవంబర్ 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తిగా అమల్లో ఉంటుంది.

ఈ భీకర శీతాకాల తుఫాను ప్రభావం ప్రధానంగా ఇంగ్లాండ్‌లోని ఈస్ట్ మిడ్‌లాండ్స్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, వెస్ట్ మిడ్‌లాండ్స్, అలాగే యార్క్‌షైర్, హంబర్ ప్రాంతాలపై తీవ్రంగా ఉండనుంది. వీటితో పాటు స్కాట్లాండ్‌లోని కొన్ని ప్రాంతాలు, వేల్స్ దేశంలోని పర్వత ప్రాంతాలలో కూడా భారీగా మంచు కురిసే సూచనలున్నాయి. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తక్షణమే అప్రమత్తమై, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

భారీ మంచు తుఫాను వల్ల విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, మొబైల్ నెట్‌వర్క్‌లు పనిచేయకపోవడం, అత్యవసర సరుకుల కోసం దుకాణాలకు వెళ్ల లేకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఎలాంటి చివరి నిమిషం తొందరపాట్లు లేకుండా.. ఇప్పుడే ఇళ్లలో నిత్యావసరాలను సిద్ధం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు చీకటి కోసం టార్చ్, బ్యాటరీలు ఉంచుకోవాలని తెలిపారు. అలాగే కరెంట్ లేని సమయంలో ప్రత్యామ్నాయ వెలుతురు కోసం కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలను సురక్షితమైన ప్రదేశంలో ఉంచుకోవాలి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయినప్పుడు శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి వెచ్చని బట్టలు, దుప్పట్లు మంచి రక్షణ కల్పిస్తాయి. ఫోన్ బ్యాటరీ అయిపోయినా వాతావరణ సమాచారం, అత్యవసర నంబర్లకు ఫోన్ చేయడానికి పవర్ బ్యాంక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో భయపడకుండా ప్రభుత్వం చెప్పే ముందస్తు జాగ్రత్తలను తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు.