భారత్‌తో చైనా ఓ వైపు దౌత్యపరమైన చర్చలు జరుపుతూనే.. మరోవైపు సైనిక ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇటీవల లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌ సరిహద్దుల సమీపంలోని రెండు కీలక చైనా వైమానిక స్థావరాలలో ఏకంగా 11 ‘జె-20 మైటీ డ్రాగన్’ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్‌లను మోహరించినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలిసింది. అయితే సరిహద్దుల్లో చైనా ఒకేసారి ఇన్ని అత్యాధునిక యుద్ధ విమానాలను రంగంలోకి దించడం ఇదే మొదటిసారి. దీంతో ఇండియా వెంటనే అలర్ట్ అయ్యింది. జిన్‌జియాంగ్‌లోని హోటాన్ ఎయిర్‌బేస్‌లో 7 జె-20 విమానాలు నిలిపి ఉంచగా.. టిబెట్‌లోని దమ్‌సంగ్ ఎయిర్‌బేస్‌లో మరొక 4 జె-20 జెట్‌లు ఉన్నాయి.

అయితే హోటాన్ ఎయిర్‌బేస్ లడఖ్‌లోని లేహ్ నుంచి కేవలం 389 కిలోమీటర్ల దూరంలో భారత వైమానిక దళానికి అత్యంత ప్రాముఖ్యమైన దౌలత్ బేగ్ ఓల్డి స్థావరం నుంచి కేవలం 245 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మరోవైపు దమ్‌సంగ్ స్థావరం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు వాయువ్యంగా కేవలం 344 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనివల్ల అత్యవసర సమయంలో భారత గగనతలంలోకి వెళ్లడానికి లేదా ఏదైనా జరిగితే స్పందించడానికి మన వైమానిక దళానికి చాలా తక్కువ సమయం లభిస్తుంది.

Also Read : చందమామను ఢీకొట్టబోతున్న రాకెట్ శకలం.. ఈ భారీ విధ్వంసంతో మనుషులకేమైనా ప్రమాదమా?

జె-20 అనేది చైనా సొంతంగా తయారు చేసుకున్న ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం. వీటిలోని స్టెల్త్ సాంకేతికత కారణంగా సాధారణ రాడార్లు సులభంగా గుర్తించలేవు. శత్రువుల గగనతలంలోకి రహస్యంగా చొరబడి దాడులు చేసే సామర్థ్యం వీటికి ఉంది. అలాగే విమానాల్లో అత్యాధునిక ఏఈఎస్ఏ రాడార్లు, PL-15 వంటి సుదూర లక్ష్యాలను ఛేదించే ఎయిర్-టు-ఎయిర్ మిస్సైళ్లు కూడా అమర్చి ఉంటాయి. ఇవి సుమారు 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రు విమానాలను రాడార్లకు దొరక్కుండానే ధ్వంసం చేయగలవు. భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం రాఫెల్, సుఖోయ్-30MKI, మిరాజ్-2000 వంటి శక్తివంతమైన విమానాలు ఉన్నప్పటికీ.. ఇవన్నీ 4.5 తరానికి చెందినవి మాత్రమే. భారత్ వద్ద ఇప్పటివరకు ఎలాంటి ఐదో తరం యుద్ధ విమానాలు లేవు.

2019 నాటికి చైనా వద్ద కేవలం 50 జె-20లు ఉండగా, 2022 నాటికి ఆ సంఖ్య 200కి చేరింది. 2026 నాటికి ఇవి 300 నుండి 500 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే 2030 నాటికి చైనా ఏకంగా 1,000 వరకు జె-20 విమానాలను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రకంగా సైనిక విమానాల పరిమాణంలో భారత్ కంటే చైనా చాలా వేగంగా దూసుకుపోతోంది. భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో తన మొదటి ఐదో తరం స్టెల్త్ ఫైటర్ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. అయితే ఇది పూర్తిస్థాయి పరీక్షలు పూర్తి చేసుకుని భారత వైమానిక దళంలో చేరడానికి కనీసం 10 ఏళ్లు సమయం పడుతుంది. ఈ సమయం చైనాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

చైనా చర్యలు భారత్‌కు పెద్ద ముప్పుగా ఉన్నాయి. అయితే వీటిని తిప్పికొట్టే కొన్ని రక్షణ వ్యవస్థలు భారత్ దగ్గర ఉన్నాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సరిహద్దు వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇవి స్టెల్త్ విమానాలను కూడా గుర్తించి నాశనం చేయగలవు. అలాగే మన రాఫెల్ విమానాల్లోని అత్యాధునిక స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్, మేటోర్ క్షిపణులు జె-20 విమానాలను నిరోధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

Also Read : కాస్పియన్ సముద్రంలో ఉక్రెయిన్ దాడి.. ఇరాన్ సీరియస్ వార్నింగ్