
China News:టిబెట్‌లోని యార్లుంగ్ త్సాంగ్పో (భారత్‌లో బ్రహ్మపుత్ర) నదిపై చైనా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద మెగా డ్యామ్ ప్రాజెక్టుకు ఊహించని అడ్డంకి ఎదురైంది. ఇంతకాలం అంతర్జాతీయంగా వస్తున్న అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ముందుకు సాగుతున్న చైనాకు, ఇప్పుడు స్వదేశీ భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలే దిగులు పుట్టిస్తున్నాయి. దాదాపు 147 బిలియన్ డాలర్ల (సుమారు ₹14 లక్షల కోట్ల కంటే ఎక్కువ) భారీ వ్యయంతో చేపడుతున్న ఈ మెగా జలవిద్యుత్ ప్రాజెక్ట్ భద్రతపై చైనాకు చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నివేదికలు సమర్పించారు.
చైనా ప్రభుత్వ అధికారిక సంస్థ ‘చైనా జియోలాజికల్ సర్వే’ పర్యవేక్షణలో జరిగిన ఈ తాజా భూగర్భ అధ్యయనంలో ఒక సంచలన విషయం వెల్లడైంది. ఈ మెగా డ్యామ్ నిర్మిస్తున్న ప్రాంతం కింద అత్యంత చురుకైన, ప్రమాదకరమైన ‘పైఝెన్ ఫాల్ట్’ (Paizhen Fault) లైన్ విస్తరించి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూగర్భ పొరల్లో ఏర్పడే ఇటువంటి పగుళ్లు లేదా ఫాల్ట్ లైన్స్ తీవ్రమైన భూకంపాలకు కేంద్రాలుగా మారుతుంటాయి. ఈ చురుకైన భూగర్భ పొరల కారణంగా డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని నివేదిక స్పష్టం చేసింది.
శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. ఈ ‘పైఝెన్ ఫాల్ట్’ అనేది ఈరోజు రాత్రికి రాత్రి ఏర్పడింది కాదు. హిమయుగం (ప్లీస్టోసీన్ కాలం) నాటి నుంచి ఈ ఫాల్ట్ లైన్ నిరంతరం కదులుతూనే ఉంది. ఈ నిరంతర భూగర్భ కదలికల వల్ల డ్యామ్ నిర్మించే చోట చుట్టుపక్కల ఉండే రాళ్ళు ,కొండలు క్రమంగా బలహీనపడి, వాటి సహజసిద్ధమైన పట్టును కోల్పోయాయి. దీనివల్ల డ్యామ్ పునాదుల సామర్థ్యం దెబ్బతినడమే కాకుండా, భవిష్యత్తులో ప్రాజెక్ట్ మౌలిక సదుపాయాల స్థిరత్వానికి కూడా తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నివేదికలోని అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. రాబోయే రోజుల్లో ఈ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యాక, రిజర్వాయర్‌లో భారీగా నీటిని నిల్వ ఉంచుతారు. అలా నింపినప్పుడు ఆ నీటి ద్వారా ఉత్పన్నమయ్యే అపారమైన పీడనం (Water Pressure), ఇప్పటికే బలహీనంగా ఉన్న భూగర్భ పొరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ కృత్రిమ పీడనం, పైఝెన్ ఫాల్ట్ కదలికలు ఒకేసారి తోడైతే, రిజర్వాయర్ ఇరువైపులా ఉన్న భారీ కొండలు ఒక్కసారిగా నీటిలోకి కూలిపోయే (Reservoir-Triggered Seismicity) ప్రమాదం ఉంది.
భౌగోళికంగా హిమాలయాల్లోని ఈ ప్రాంతం ఇండియన్, యురేసియన్ టెక్టోనిక్ ప్లేట్లు నిరంతరం ఒకదానికొకటి ఢీకొనే అత్యంత ప్రమాదకరమైన భూకంప జోన్-5 లో ఉంది. గతంలో కూడా ఈ ప్రాంతంలో ప్రకృతి తన ప్రతాపాన్ని చూపించింది. 2017 లో టిబెట్‌లోని మిలిన్ ప్రాంతంలో సంభవించిన 6.9 తీవ్రత కలిగిన భారీ భూకంపమే ఇక్కడి భూగర్భ అస్థిరతకు సజీవ సాక్ష్యమని పరిశోధకులు గుర్తుచేస్తున్నారు. ఇంతటి తీవ్రమైన భూకంప జోన్లో ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌ను నిర్మించడం అనేది పెను విపత్తును కొనితెచ్చుకోవడమేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
చైనాకు సాధారణంగా తన సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్ నైపుణ్యాలపై ఎనలేని అహంకారం ఉంటుంది. ఈ డ్యామ్‌ను చైనాలోని ప్రసిద్ధ ‘త్రీ గోర్జెస్ డ్యామ్’ కంటే మూడు రెట్లు ఎక్కువ విద్యుత్‌ను (దాదాపు 300 బిలియన్ కిలోవాట్ అవర్స్) ఉత్పత్తి చేసేలా, తమ వ్యూహాత్మక శక్తికి ప్రతీకగా డిజైన్ చేసుకుంది. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు కాకుండా, స్వయంగా చైనా శాస్త్రవేత్తలే ఈ ప్రాజెక్ట్ భద్రతను పచ్చిగా ప్రశ్నించడంతో, చైనా గర్వంగా చెప్పుకునే ఇంజనీరింగ్ సామర్థ్యం ప్రపంచం ముందు హాస్యాస్పదంగా మారింది. దీంతో పాటు చైనా ఖజానా నుంచి పెడుతున్న ₹14 లక్షల కోట్ల భారీ పెట్టుబడి కూడా బూడిదలో పోసిన పన్నీరు అయ్యేలా కనిపిస్తోంది.
ఈ భూగర్భ శాస్త్రవేత్తల నివేదిక దిగువన ఉన్న భారతదేశానికి అత్యంత కీలకమైనదిగా మారింది. ఎందుకంటే టిబెట్‌లో ప్రవహించే ఈ యార్లుంగ్ త్సాంగ్పో నదే అరుణాచల్ ప్రదేశ్ గుండా భారతదేశంలోకి ప్రవేశించి ‘బ్రహ్మపుత్ర’గా రూపాంతరం చెందుతుంది. చైనా ఈ నదిపై భారీ డ్యామ్ నిర్మించి నీటిని నియంత్రించడం వల్ల ఈశాన్య భారత నీటి భద్రత, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటాయని భారత్ మొదటి నుంచీ అంతర్జాతీయ వేదికలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. తాజాగా వెల్లడైన భూకంప ముప్పుల నేపథ్యంలో భారత ఆందోళనల్లోని వాస్తవికత ఇప్పుడు ప్రపంచానికి స్పష్టమైంది.
ఈ పరిశోధనల నేపథ్యంలో భవిష్యత్తులో ఏదైనా తీవ్ర భూకంపం సంభవించి చైనా కడుతున్న ఈ మెగా డ్యామ్ గనుక విఫలమైతే (Dam Failure), అది మానవ చరిత్రలోనే అతిపెద్ద జలప్రళయానికి దారితీస్తుంది. డ్యామ్ ఒక్కసారిగా కొట్టుకుపోతే వచ్చే లక్షలాది క్యూసెక్కుల నీటి ఉధృతికి దిగువన ఉన్న భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలతో పాటు పొరుగు దేశమైన బంగ్లాదేశ్ కూడా పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో చైనా తన మొండివైఖరిని వీడి, ఈ ₹14 లక్షల కోట్ల ప్రాజెక్టుపై పునరాలోచించాలని పర్యావరణ, భౌగోళిక నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.









