Nepal Floods : నేపాల్‌ లో హిమానీనదం బద్దలై ఇప్పటికే పెద్ద ఎత్తున వరదలు వచ్చి తీవ్ర నష్టాన్ని కలిగించింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగగా, వందల మంది మరణించారు. వందలాది మంది గల్లంతయ్యారు. అయినా కూడా ముప్పు ఇంకా తొలిగిపోలేదు. చైనా-నేపాల్ సరిహద్దులోని ఎగువ ప్రాంతాలలో ఏర్పడిన ఒక తాత్కాలిక సరస్సు ఏక్షణంలోనైనా బస్ట్ (తెగిపోయే) అయ్యే ప్రమాదం ఉందని చైనా అధికారులు నేపాల్‌ను హెచ్చరించడం మరోసారి ఆందోళనకు గురి చేస్తోంది. ఆ విపత్తు వల్ల పేరుకుపోయిన పెద్ద రాళ్లు, బురద, మంచు, ఇతర శిథిలాలతో టిబెట్‌ వైపున లెందే నదీ వ్యవస్థకు ఎగువన కొత్తగా ఒక తాత్కాలిక సరస్సు ఏర్పడింది. ఈ సరస్సు ప్రస్తుతం ఉప్పొంగుతుంది. ఈ విషయమైనేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చైనా అధికారులు సమాచారం అందించారు. ఈ తాత్కాలిక సరస్సు నీటి రంగు నిరంతరం నల్లగా (గాఢంగా) మారుతోందని, ఇది సరస్సు ప్రాకృతిక గట్లు తెగిపోయే ప్రమాదాన్ని సూచిస్తుందని వారు తెలిపారు. ఏ క్షణాన అయినా ఆ సరస్సు ఉప్పొంగి, కిందికి దూసుకురావొచ్చని హెచ్చరించింది. నీటి రంగులో మార్పును అందుకు కారణంగా చెప్తోంది. నేపాల్ విదేశాంగశాఖకు ఈ సమాచారాన్ని చేరవేసింది. ‘‘విపత్తు తర్వాత ఏర్పడిన తాత్కాళిక సరస్సు రంగు మారుతోంది. అది ముదురురంగులోకి మారుతోంది. అంటే అది బద్దలయ్యేందుకు అవకాశం ఉంది’’ అని చైనా అధికారులు వెల్లడించారు.

Also Read : హర్మూజ్‌లో సీమైన్స్‌ను తొలగించేశాం: అమెరికా సంచలన ప్రకటన

అయితే ఈ సరస్సు బస్ట్ అయినప్పటికీ దాని ప్రభావం కొంత పరిమితంగానే ఉండవచ్చని కూడా చైనా తెలిపింది. ఈ సరస్సులో ఎక్కువ మొత్తంలో నీరు లేకపోవడమే దానికి కారణం. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ఆకస్మిక డ్యామ్ పాక్షికంగా తెగిపోయినా, నదీ వ్యవస్థలోకి వచ్చే గరిష్ఠ నీటి ప్రవాహం సెకనుకు 500 క్యూబిక్ మీటర్ల వరకు మాత్రమే ఉండవచ్చని చైనా అంచనా వేసింది. ఈ ప్రవాహం నదీ పరిధి హద్దుల లోపలే ఉంటుందని స్పష్టం చేశారు.

కాగా, చైనా వైపు ఉన్న ‘చోచెన్’ నది, నేపాల్ వైపు ఉన్న ‘పురేపు’ నది కలిసే ప్రదేశం వద్ద సంభవించిన హిమపాతం (గ్లేసియర్ కూలిపోవడం) వల్ల ఏర్పడిన శకలాలు నదికి అడ్డంగా పడి ఈ సహజ డ్యామ్ ఏర్పడింది. ఈ హిమపాతమే బుధవారం రోజున నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాలలో సంభవించిన విధ్వంసకర ఆకస్మిక వరదలకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. శుక్రవారం నాటికి ఈ సరస్సులో దాదాపు 25 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరిందని, రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం ఉందని చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. డ్రోన్లు, ఉపగ్రహాల ద్వారా చైనా ఈ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. శుక్రవారం నాటికి ఈ సరస్సు లెందే ఖోలా, త్రిశూలి నదుల్లోకి పొంగిపొర్లడం ప్రారంభించింది. అయితే దీని వల్ల ఉండే ప్రమాదం అదుపులోనే ఉందని చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సిసిటివి (CCTV) అంచనా వేసింది. అయినప్పటికీ దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చైనా సూచించింది. బుధవారం నాటి వరద విధ్వంసం నుంచి కోలుకోకముందే మరో వరద ముప్పు పొంచి ఉండటంతో నేపాల్ అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉండగా, నేపాల్ వరదల్లో చిక్కుకుని ఆచూకీ లేకుండా పోయిన అస్సాంకు చెందిన 12 మంది పౌరుల వివరాలను సేకరించినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.గల్లంతైన వారిలో రీతౌపోర్మో బ్రహ్మ, మోంత్రి బసుమతారీ, సోనేశ్వర్ నార్జారీ, రాహుల్ దైమారీ, శతదల్ నాథ్, పంకజ్ నౌగ్, పంకజ్ బర్మన్, అరుణ్ మహంత, సమర్ బెజ్ బరువా, డాక్టర్ దీపాలి సర్కార్, మానస్ కుమార్ ఘోష్, డాక్టర్ తీర్థ చాలిహా ఉన్నారు. వీరు అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్, గోలాఘాట్, హోజాయ్, కమ్రూప్ మెట్రోపాలిటన్, నల్బారీ జిల్లాలకు చెందినవారు.వరద బాధితుల రక్షణ కోసం అస్సాం ప్రభుత్వం నేపాల్ స్థానిక సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. రవాణా, సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు కొంత అంతరాయం ఏర్పడుతోందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

Also Read : పిల్లలకు రీల్స్ పిచ్చి.. మెటా కంపెనీకి బిగ్ షాక్.. ఒక్క దెబ్బతో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో రాబోతున్న మార్పులు

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.