
US C-17 Globe Master in Russia : ఉక్రెయిన్- రష్యాల మధ్య ఘర్షణలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన భారీ ఎయిర్‌ఫోర్స్ విమానం రష్యాలో దిగడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. రవాణా కార్యకలాపాలకు ఉపయోగించే బోయింగ్ సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానం మాస్కోకు సమీపంలో ఉన్న నుకోవో ఎయిర్‌పోర్టులో దిగినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లడించాయి. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం, ఆర్సీహెచ్4555, 07-7181 రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్నఈ విమానం రష్యాకు పొరుగుదేశమైన లాట్వియా నుంచి బయలు దేరింది. స్థానిక కాలమానం ప్రకారం మాస్కోలో మంగళవారం ఉదయం 10.00గలకు ల్యాండ్ అయింది. అంతే భానే ఉంది కానీ, అసలు ఆ విమానం రష్యాకు ఎందుకు వెళ్లిందనే దానిపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. విమానంలో ఎవరైనా కీలక అధికారులు ఉన్నారా? లేక కీలక పరికరాలు ఏమైనా రవాణా చేస్తున్నారా? అనే విషయాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసలు తమకు ఆ విమానం గురించి ఏమీ తెలియదని రష్యా వర్గాలు చెప్పడం ఉత్కంఠను పతాకస్థాయికి చేర్చింది ఈ వార్తలపై అటు యూఎస్, ఇటు రష్యా ఇప్పటివరకూ అధికారికంగా స్పందించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కాగా, అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ ఎయిర్‌ఫోర్స్ విమానం యూఎస్‌లోని క్యాంప్ స్ప్రింగ్స్ నుంచి బయలుదేరి వెళ్లింది. అమెరికాలోని ప్రధాన వైమానిక స్థావరమైన యూఎస్ ఆండ్రూస్ ఎయిర్‌ఫోర్స్ బేస్ క్యాంప్ స్ప్రింగ్స్లోనే ఉన్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్ ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్ విమానాన్ని ఈ స్థావరంలోనే ల్యాండ్ చేస్తారు. అమెరికా ప్రభుత్వ కీలక అధికారుల విదేశీ పర్యటనలన్నీ ఇక్కడి నుంచే మొదలవుతాయని కూడా చెప్తారు. ఈ నేపథ్యంలో అసలు రష్యాలో ఏం జరుగుతోందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్.. మాస్కోలో రహస్యంగా దౌత్య పర్యటన చేపట్టినట్లు ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. రష్యా లో అగ్రరాజ్య సైనిక విమానం ఒకటి ల్యాండ్ అవడం మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. ఆ విమానంలో వచ్చింది రాట్క్లిఫ్ అని తాజాగా బయటికొచ్చింది.
Also Read : ఇరాన్ వార్.. అమెరికా రైతులకు అంతులేని నష్టం.. అసలేం జరుగుతోంది?
కాగా, రాట్క్లిఫ్ రష్యా పర్యటనకు వెళ్లే ముందు మాస్కోపై డ్రోన్లు, క్షిపణి దాడులు ఆపాలని అమెరికా ఉక్రెయిన్ ను కోరినట్లు తెలిసింది. తమ సీనియర్ అధికారి ఒకరు రష్యాలో పర్యటించనున్నారని గత సోమవారం అగ్రరాజ్యం (USA) నుంచి తమకు సమాచారం వచ్చిందని కీవ్ వెల్లడించడం గమనార్హం. దాదాపు 8 గంటల పాటు సీఐఏ చీఫ్ మాస్కోలో ఉన్నట్లు విమానాల ట్రాకింగ్ డేటా స్పష్టం చేసింది. కాగా, అయితే, ఈ పర్యటనకు ఆయన సైనిక రవాణా విమానాన్ని ఎంచుకోవడం సర్వత్రా ప్రాధాన్యం సంతరించుకుంది. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే పలువురు అభిప్రాయపడుతున్నారు. అమెరికా మిలిటరీ విమానం బోయింగ్ సి-17 గ్లోబ్‌మాస్టర్-3.. వ్నూకోవ్ విమానాశ్రయంలో దిగి దిగగానే దౌత్య నంబరు ప్లేట్లతో ఉన్న కాన్వాయ్ అక్కడకు చేరుకుందని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ఈ పర్యటనలో రాట్క్లిఫ్ ఎవరిని కలిశారన్నది మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందించారు. ఆ విమానం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, క్రెమ్లిన్‌లో ఈ వారం అమెరికా ప్రతినిధులతో సమావేశాలకు సంబంధించి ప్రణాళికలు ఏవీ లేవని ఆయన పేర్కొన్నారు. అటు అమెరికా సీఏఐ కార్యాలయం కూడా ఈ కథనాలపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ఇరాన్‌ను ఒంటరి చేయడమే లక్ష్యంగా అమెరికా ‘ఆపరేషన్ ఎకనమిక్ అవుట్‌కాస్ట్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే టెహ్రాన్‌తో వ్యాపారం సాగించే సంస్థలు, దేశాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా పలు ఆంక్షలు విధించనుంది. ఈ క్రమంలో ఇరాన్‌కు రష్యా వ్యూహాత్మక వాణిజ్య భాగస్వామిగా ఉన్నట్లు అమెరకా భావిస్తోంది. మరోవైపు, నాటో సభ్య దేశంలో రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థ ఇటీవల సమాచారం అందించింది. నాటో దేశంపై రష్యా సైబర్ దాడులు, కోవర్ట్ ఆపరేషన్లు లేదా సైనిక దురాక్రమణ చేపట్టే ప్రమాదం ఉన్నట్లు నిఘా సంస్థ తెలిపింది. దాని గురించి చర్చించేందుకు సీఐఏ చీఫ్ వచ్చి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఉక్రెయిన్ తో రష్యా సాగిస్తోన్న యుద్ధానికి సంబంధించి యూఎస్, రష్యా మధ్య చర్చలు గతంలోనే నిలిచిపోయాయి. ఇరాన్ యుద్ధంతో ట్రంప్ బిజీగా ఉన్న నేపథ్యంలో రష్యాతో చర్చలకు సమయం ఇవ్వడం లేదు. ఈ చర్చలను మళ్లీ గాడీలో పెట్టేందుకు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ రష్యాకు వెళతారన్న వార్తలు గత కొన్ని రోజులుగా వెలువడుతున్నాయి. కీలక అధికారుల పర్యటనలకు ముందు అవసరమైన సామగ్రిని తరలించేందుకు కూడా సీ-17గ్లోబ్ మాస్టర్‌ను అమెరికా వినియోగిస్తుందని తెలియడంతో , తదుపరి ఏం జరగబోతోందో అన్న సస్పెన్స్ నెలకొంది. అమెరికా ప్రత్యేక ప్రతినిధులైన స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్ననర్ త్వరలో రష్యాకు వెళ్లనున్నారన్న వార్తలు కూడా జోరందుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో వారిద్దరూ రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే.
Also Read : కెనడాతో వాణిజ్య యుద్ధం: ట్రంప్ సంచలన నిర్ణయం









