ఇజ్రాయెల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ ఉంది. అయితే ఈ క్రమంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ అనూహ్య నిర్ణయం తీసుకుంటూ మాజీ సైన్యాధిపతి గాడీ ఐజెన్‌కోట్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. అయితే ఈ బాధ్యత ఐజెన్‌కోట్‌కు పూలబాటేమీ కాదు. ఒకవేళ ఆయన 42 రోజుల్లో మెజారిటీ నిరూపించుకోవడంలో విఫలమైతే.. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మళ్లీ రేసులోకి వస్తారా అనే చర్చ నడుస్తోంది.

ఇజ్రాయెల్ పార్లమెంటులో మొత్తం 120 స్థానాలు ఉంటాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ కూటమికైనా కనీసం 61 మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. ఎన్నికల్లో ఐజెన్‌కోట్ నేతృత్వంలోని పార్టీకి 48 సీట్లు లభించాయి. సెంటర్-రైట్ టుగెదర్ పార్టీ, డెమోక్రాట్స్, అవిగ్డోర్ లీబర్‌మాన్‌కు చెందిన ఇజ్రాయెల్ అవర్ హోమ్ పార్టీలతో ఆయన మిత్రకూటమిగా ఉన్నారు. వీరికి తోడు పార్లమెంటులోని రెండు ప్రధాన అరబ్ పార్టీలైన రామ్, జాయింట్ లిస్ట్ బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే బలం 67 స్థానాలకు చేరుతుంది. కానీ ఈ అరబ్ పార్టీలను ప్రభుత్వంలో చేర్చుకోవడానికి గానీ, వారి మద్దతు తీసుకోడానికి గానీ ఐజెన్‌కోట్ కూటమిలోని కొందరు సభ్యులు సుముఖంగా లేరు.

Also Read : ప్రపంచాన్ని ఊపేస్తున్న ఎన్వీడియా సీఈఓ సీక్రెట్ ఎఫైర్.. నెట్టింట మార్మోగుతున్న కంపెనీ అసలు ఏం చేస్తుంది?

ఎన్నికల ప్రచార సమయంలో తమ ప్రభుత్వంలో అరబ్ పార్టీలకు స్థానం ఉండదని ఐజెన్‌కోట్ స్వయంగా హామీ ఇచ్చారు. 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన భయానక దాడుల తర్వాత ఇజ్రాయెల్‌లో అరబ్ వర్గాల పట్ల వైఖరి మరింత కఠినంగా మారింది. అంతేకాక లీబర్‌మాన్ కూడా అరబ్ పార్టీలతో కూడిన మైనారిటీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతం (2021) లో నఫ్తాలి బెన్నెట్ ప్రభుత్వం అరబ్ పార్టీ రామ్ మద్దతుతో నడిచినా.. వెస్ట్ బ్యాంక్ సమస్యలు, అంతర్గత విభేదాల కారణంగా 18 నెలలకే కూలిపోయింది. దీంతో ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రయోగం చేయడం ఐజెన్‌కోట్‌కు పెద్ద సవాలుగా మారింది.

ఇజ్రాయెల్‌లోని రెండు ప్రధాన అతి-ఆర్థడాక్స్ పార్టీల మద్దతు సంపాదిస్తే ఐజెన్‌కోట్‌కు 13 సీట్లు లభిస్తాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద చిక్కు ఉంది. ఈ పార్టీలకు చెందిన సెమినరీ విద్యార్థులకు సైనిక సేవ నుంచి మినహాయింపు ఇవ్వాలనేది వారి ప్రధాన డిమాండ్. అయితే ఐజెన్‌కోట్, లీబర్‌మాన్ ఈ మినహాయింపును ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వివాదాస్పద అంశంపై రాజీ కుదర్చడం అత్యంత సంక్లిష్టంగా మారింది.

ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడి నుంచి ఐజెన్‌కోట్‌కు 42 రోజుల గడువు లభించింది. ఒకవేళ ఈ నిర్ణీత సమయంలో ఆయన మెజారిటీ కూడగట్టడంలో విఫలమైతే, అధ్యక్షుడు హెర్జాగ్ మళ్లీ బెంజమిన్ నెతన్యాహును పిలిచే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి నెతన్యాహు బలం 64 స్థానాల నుంచి 53 కి పడిపోయింది. గతంలోలాగా ప్రతిపక్ష ఎంపీలను తమవైపు తిప్పుకోవడానికి ఆయన ప్రయత్నించవచ్చు. ఒకవేళ అది కూడా సాధ్యం కాకపోతే ‘యషార్’, ‘టుగెదర్’, ‘ఇజ్రాయెల్ అవర్ హోమ్’ నెతన్యాహు ‘లికుడ్’ పార్టీల కలయికతో ఒక ‘ఐక్య ప్రభుత్వం’ ఏర్పడవచ్చు. కానీ నెతన్యాహును అధికారం నుంచి దించడమే లక్ష్యంగా పోటీ చేసిన ప్రతిపక్షాలు దానికి అంగీకరించడం కష్టమే.

గాడీ ఐజెన్‌కోట్ గానీ, బెంజమిన్ నెతన్యాహు గానీ 100 రోజుల వ్యవధిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఇజ్రాయెల్ చట్టాల ప్రకారం పార్లమెంట్ రద్దయి మళ్లీ కొత్త ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. అయితే ఇప్పటికే వరుస ఎన్నికలతో విసిగిపోయిన ప్రజలపై మరో ఎన్నికల భారం మోపవద్దని అధ్యక్షుడు హెర్జాగ్ రాజకీయ పార్టీలను హెచ్చరించారు.

Also Read : టెహ్రాన్ కొండల కింద సీక్రెట్.. అమెరికా స్కెచ్‌కు ఇరాన్ మాస్టర్ ప్లాన్ తిరగబడుతుందా?