
Iran-USA War : పశ్చిమాసియాలో ఘర్షణలు తగ్గినట్లే తగ్గి అంతలోనే తీవ్రరూపం దాల్చుతున్నాయి. హర్మూజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందనే విషయం ప్రపంచదేశాలకు చాటేందుకు నౌకలపై ఇరాన్ వరుస దాడులకు పాల్పడుతోంది. ఆ కారణాన్ని చూపుతూ టెహ్రాన్‌పై అమెరికా భీకరదాడులను తీవ్రతరం చేస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు గతంలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రస్తుతం పూర్తిగా అటకెక్కింది.
Also Read : ప్రపంచానికి మరో పెనుముప్పు: ‘సజీవ నోస్ట్రాడామస్’ అథోస్ సలోమ్ సంచలన హెచ్చరికలు
మరోవైపు ఇరాన్‌లోని విద్యుత్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా భీకర దాడులు చేయాలని అగ్రరాజ్యం యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తు న్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లు, చమురు రిఫైనరీలను టార్గెట్ చేయడం ద్వారా టెహ్రాన్ సైనిక కార్యకలాపాల సామర్థ్యాన్ని తగ్గించాలని అమెరికా భావిస్తోంది. ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ కూడా అమెరికాతో జతకలిసే అవకాశం ఉండగా, దీనికి ఇంకా అధ్యక్షుడు ట్రంప్ నుంచి తుది అనుమతి రావలసి ఉంది.
క్యాంప్ డేవిడ్‌లో నిర్వహించిన కేబినెట్ మీటింగ్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై యుద్ధాన్ని గెలవడమే తమ ప్రధాన లక్ష్యమని, అలాగే ఆ దేశాన్ని న్యూక్లియర్ ఆయుధాలకు దూరం చేయడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. ఇరాన్‌పై సాధించే విజయంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఆ దేశం ‘ఇక మా వల్ల కాదు’ అనేంతలా దాడులను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఇరాన్‌తో కాల్పుల విరమణ (సీజ్ఫైర్) ఒప్పందాన్ని పునరుద్ధరించడంపై తమకు ఎలాంటి ఆలోచన లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. ఇరాన్ పూర్తిగా తన అణ్వాయుధాలను విడిచిపెడితేనే సీజ్ఫైర్ గురించి ఆలోచిస్తామని, దాడుల ద్వారానే ఆ దేశం చర్చలకు వస్తుందని పేర్కొన్నారు. ఇరాన్ చర్చలు కావాలని కోరుతూనే ప్రతిసారీ సీజ్‌ఫైర్‌ను బ్రేక్ చేస్తోందని, దీంతో ఇరానియన్లపై తనకు సహనం నశించిందని మండిపడ్డారు.
ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. అమెరికా సైన్యం రక్షణగా ఉన్న వేళ హర్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేసింది. ఈ జలసంధిని తాము పూర్తిగా మూసివేస్తున్నామని ఇరాన్ స్పష్టం చేస్తుండగా, రవాణాకు మార్గం అందుబాటులోనే ఉందని అమెరికా ప్రకటిస్తోంది. ఇటు అమెరికా సైన్యం జరిపిన మెరుపు దాడులతో ఇరాన్ దద్దరిల్లింది. దక్షిణ ఇరాన్‌లోని రెవల్యూషనరీ గార్డ్‌కు చెందిన కీలక సైనిక స్థావరాలు, మిసైల్, డ్రోన్ కేంద్రాలు, తీర రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా సెంట్రల్ కమాండ్ దాడులకు తెగబడింది. ఈ దాడుల వల్ల అబాదాన్, బుషెహర్, కిష్, క్విష్మ్ దీవులు, ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లలో భారీ పేలుళ్లు సంభవించాయని, క్విష్మ్ దీవిలో కొన్ని నివాసాలు దెబ్బతిన్నాయని ఇరాన్ మీడియా వెల్లడించింది.
Also Read : అమెరికాలోని విదేశీ విద్యార్థులకు బిగ్ షాక్.. ఉద్యోగం చేయాలంటే రూ.95 లక్షల ఫీజు కట్టాల్సిందే…
ఈ వివాదం మరింత విస్తరించడానికి జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేయడమే కారణం. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా తాము ఈ దాడి చేశామని ఇరాన్ తెలపగా, దీనిపై అమెరికా తీవ్రంగా రగిలిపోయి ప్రతీకార వైమానిక దాడులు ప్రారంభించింది. అదే సమయంలో ఈజిప్ట్‌లోని డమియెట్టా పోర్ట్‌లో ఉన్న అమెరికా గ్యాస్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరగడంతో ఎల్ఎన్జీ లోడింగ్ సమయంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.అమెరికా బలగాలపై జరిగిన దాడులకు గట్టి సమాధానం ఇస్తామని, ఇరాన్‌కు కచ్చితంగా బుద్ధి చెబుతామని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా దాడుల వల్ల రోజురోజుకూ ఇరాన్ బలహీనపడుతున్నప్పటికీ, పోరాటాన్ని ఆపడం లేదని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య పరిమితంగా ఉన్న ఈ యుద్ధం గాలివానలా మారి కొత్త మలుపులు తిరుగుతుండటంతో గల్ఫ్ ప్రాంతమంతటా యుద్ధ మేఘాలు కమ్ముకుని తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.









