దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఇటీవల జరిగిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే విమాన కాక్‌పిట్‌లో ఒమన్ దేశానికి చెందిన సహ పైలట్ ఉన్నట్టుండి భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై క్రాష్ గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్ఛార్ తన సమయస్ఫూర్తితో 174 మంది ప్రయాణికులను కాపాడారు. అయితే ఈ దాడి వెనుక ఏ దేశం కుట్ర ఉందనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా అమెరికా అగ్రనేతల మధ్యే ఈ విషయంలో తీవ్ర వ్యతిరేక అభిప్రాయాలు బయటపడుతున్నాయి.

ఈ విమాన దాడికి ఇరానే పూర్తి బాధ్యత వహించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఈ కుట్ర వెనుక ఇరాన్ హస్తం ఉందని ట్రంప్ అంటున్నారు. ఇలాంటి తీవ్రవాద చర్యలను ప్రోత్సహించడంలో ఇరాన్ పాత్ర ఉందన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ఫ్లైదుబాయ్ విమాన దాడి ఘటనకు, ఇరాన్‌కు ఎలాంటి సంబంధం ఉందో నిరూపించే స్పష్టమైన, నిర్దిష్టమైన ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు.

 

ఈ తీవ్రమైన సంఘటన నేపథ్యంలో అమెరికాలో విమానయాన భద్రతా విధానాలను తమ ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. అలాగే ఈ విమాన దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఒక ఉగ్రవాద యత్నంగా పరిగణించి విచారణ జరుపుతోందని వివరించారు. అయినప్పటికీ ఈ కుట్ర వెనుక ఇరాన్ ఉందనడానికి పక్కా ఆధారాలు ఏవీ తమకు లభించలేదని స్పష్టం చేశారు. ఇలా విమాన దాడి విషయంలో అమెరికా అధ్యక్షుడు ఒకలా, ఉపాధ్యక్షుడు మరొకలా మాట్లాడటంతో రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది.

మరోవైపు తమపై వస్తున్న ఈ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తూ ఇజ్రాయెల్‌పైనే తిరుగుబాణాన్ని విసిరింది. ఇరాన్ కాన్సుల్ జనరల్ సయీద్ రెజా మోసయెబ్ మోట్లాగ్ స్పందిస్తూ.. తమ దేశాన్ని ప్రపంచం ముందు ఇరికించడానికి ఇజ్రాయెల్ పన్నుతున్న కుట్రలో భాగమే ఇది అని ఆరోపించారు. ఇజ్రాయెల్‌లో త్వరలో జరగబోయే ప్రధానమంత్రి ఎన్నికల ముంగిట, కావాలనే రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రాంతీయ ఉద్రిక్తతలు పెంచడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వమే ఈ మొత్తం డ్రామాను నడిపించిందని విమర్శించారు. విమానంలో ఉన్న ప్రయాణికుల్లో అత్యధికులు ఇజ్రాయెల్ పౌరులే అయినప్పటికీ, తమ స్వార్థ రాజకీయాల కోసం సొంత పౌరుల ప్రాణాలను పణంగా పెట్టారని ఇరాన్ మండిపడింది.