ఈ ఏడాది ప్రారంభంలో ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఇప్పుడు భారీగా పతనమవుతున్నాయి. జనవరి నెలలో చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఆల్‌టైమ్ రికార్డు స్థాయిని తాకిన పసిడి ధరలు, నవంబర్ నాటికి భారీగా తగ్గాయి. ఒక వైపు భారత మార్కెట్‌లో ధరలు దాదాపు 23 నుండి 24 శాతం వరకు బంగారం ధరలు తగ్గగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో 31.5 శాతం వరకు కుప్పకూలాయి. అయితే ఈ ఏడాది జనవరి నెలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,80,000 వరకు చేరింది.

కొన్ని నగరాల్లో రూ.1,76,121 నుంచి రూ.1,83,050 మధ్య కూడా ట్రేడ్ అయింది. ఆ సమయంలో బంగారం కొనాలంటేనే సామాన్య, మధ్యతరగతి ప్రజలు హడలిపోయారు. కానీ నవంబర్ 2026 మధ్య నాటికి పరిస్థితి మొత్తం మారిపోయింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,000 నుంచి రూ.1,39,600 పరిధిలోకి పడిపోయింది. అంటే గరిష్ట స్థాయితో పోలిస్తే కేవలం పది గ్రాముల బంగారంపైనే ఏకంగా రూ.40 వేల నుంచి రూ.44 వేల వరకు తగ్గింది.

Also Read : బైక్, కారు ఉన్నవారికి బిగ్ షాక్.. డిసెంబర్ 15 నుంచి మారనున్న రూల్స్.. తెలుసుకోకపోతే మీ జేబుకు చిల్లే!

కేవలం భారత్‌లోనే కాదు.. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలకు బిగ్ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే జనవరి 2026లో అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ మార్కెట్‌లో ఒక ట్రాయ్ ఔన్స్ బంగారం ధర 5,594.82 డాలర్ల వద్ద ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే నవంబర్ నాటికి అది ఏకంగా 3,830.74 డాలర్ల స్థాయికి దిగజారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారంపై సుమారు 1,764 డాలర్ల మేర విలువ ఆవిరైపోయింది. శాతం పరంగా చూస్తే ఇది దాదాపు 31.5 శాతం భారీగా తగ్గింది.

అసలు ఇంత తక్కువ సమయంలో బంగారం ధరలు ఎందుకు ఇంతలా పడిపోయాయి అనే దాని వెనుక రెండు బలమైన కారణాలు ఉన్నాయి. మొదటిది అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న కఠిన నిర్ణయాలు. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతో పాటు.. అమెరికా బాండ్ ఈల్డ్స్ లాభదాయకంగా మారాయి. దీంతో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులను ఉపసంహరించుకుని, ఎక్కువ రాబడినిచ్చే బాండ్ల వైపు తమ డబ్బును మళ్లించారు. రెండవ ప్రధాన కారణం అమెరికన్ డాలర్ బలోపేతం కావడం. ప్రపంచంలోని ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ గత 19 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్ బలపడినప్పుడల్లా బంగారం ధరలపై తీవ్ర ఒత్తిడి పెరిగి, ధరలు కిందకు పడిపోయాయి.

అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఏకంగా 31.5 శాతం తగ్గితే.. మన దేశంలో మాత్రం 23 నుండి 24 శాతం మాత్రమే తగ్గింది. దీని వెనుక కూడా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది అమెరికన్ డాలర్‌తో పోలిస్తే మన భారత రూపాయి విలువ బాగా బలహీనపడటం. రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతి చేసుకునే బంగారం ఖర్చు పెరిగింది. రెండవది 2026లో ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుండి ఏకంగా 15 శాతానికి పెంచడం. ఈ పన్నుల భారం, రూపాయి క్షీణత కారణంగా అంతర్జాతీయ స్థాయిలో మన దేశంలో బంగారం ధరలు తగ్గకుండా కొంతవరకు నిలకడగా ఉండిపోయాయి.

Also Read : ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి షాకింగ్ న్యూస్.. జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఏంటంటే?