Hormuz strait : ఇరాన్‌, అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయో తప్ప తగ్గడం లేదు. ముఖ్యంగా హార్మూజ్‌ జలసంధి విషయంలో మరింత పట్టుదలగా వ్యవహారిస్తున్నాయి. ఈ క్రమంలో గతంలో శాంతి చర్చల పేరుతో రెండు దేశాలు యుద్ధాన్ని విరమించినట్లు ప్రకటించినప్పటికీ తిరిగి ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయంలో ఇరాన్ అమెరికాను ప్రతిసారి ఒక్కటే డిమాండ్‌ చేస్తూ వస్తున్నది. అదేంటంటే, అమెరికా ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ హోర్ముజ్ జలసంధిని తెరవబోమని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ ముహమ్మద్ బాఘెర్ గాలిబఫ్ ఇటీవల మరోసారి తేల్చి చెప్పారు. గతంలో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అనుసరించి యూఎస్ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన గట్టిగా అన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తాము చెప్పదలుచుకున్నది స్పష్టంగా అమెరికాకు మధ్యవర్తుల ద్వారా చేరవేశామని స్పష్టత నిచ్చారు. ‘మోసం, ఏకపక్ష ధోరణులతో ఎంతోకాలం రాణించలేదని వారి నిర్ణయాలకు కాలం చెల్లిందని శత్రువుకు అర్థమైపోయింది. కాబట్టి, మాకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండే వరకూ, ఇరాన్ హక్కులను గుర్తించే వరకూ హార్మూజ్ మూసే ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాక చర్చలకూ అవకాశం ఉండదు’ అని ఆయన స్పష్టం చేశారు.

కాగా అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, హార్మూజ్‌లో ఉద్రిక్తతలు తగ్గించడం కోసం ఇరాన్ అమెరికా ముందు పలు డిమాండ్స్ పెట్టిన విషయం తెలిసిందే. ఇరాన్ పోర్టుల చుట్టూ దిగ్బంధనం తొలగించడం, ఆంక్షల ఎత్తివేయడం, విదేశాల్లోని ఇరాన్ ఆస్తుల విడుదల చేయడం, ఇరాన్‌పై బెదిరింపులకు ముగింపు పలకడం, అన్ని రకాల మిలిటరీ చర్యలను కట్టిపెట్టడం వంటివి వీటిలో ఉన్నాయి. గత జూన్‌లో రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం మాట నిలబెట్టుకోవాలని యూఎస్‌ను ఇరాన్‌ డిమాండ్ చేసింది.

అయితే అణుకార్యక్రమం సహా పలు అంశాలపై కూలంకషంగా చర్చించేందుకు అమెరికా, ఇరాన్‌ మధ్య జూన్‌లో ఈ అవగాహన ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. రెండు దేశాలు కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ ఒప్పందానికి అంగీకరించాయి. ఇది జరిగిన తరువాత 60 రోజుల్లో పూర్తిస్థాయి శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. అయితే, హర్మూజ్‌పై భేదాభిప్రాయాల నెలకొన్న నేపథ్యంలో ఒప్పందం కథ ముగిసినట్టేనని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జులై 7న ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో ఇరాన్‌ కూడా ఈ ఒప్పందాన్ని పక్కన పెట్టేసినట్టు ప్రకటించింది. ఆ తరువాత ఇరాన్, అమెరికాలు పరస్పర దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పతాకస్థాయికి చేరుకున్న విషయం విధితమే.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.