
Lindsey O Graham : రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించేందుకు అమెరికా ప్రతినిధుల సభ సోమవారం ఓటింగ్ నిర్వహించడానికి సిద్ధమైంది. గత నెలలో అమెరికా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్‌లు విధించేలా ‘లిండ్సే గ్రాహం బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే యూఎస్ సెనెట్‌లో ఈ బిల్లు అత్యధిక మెజారిటీతో ఆమోదం పొందింది. అయితే ఈ బిల్లును డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ సోమవారం హౌస్ రూల్స్ కమిటీ ఓటింగ్ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ బిల్లు ఆమోదం పొందితే, రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై కఠిన ఆంక్షలు విధించడానికి ట్రంప్‌కు పూర్తి స్థాయి అధికారాలు లభిస్తాయి.
‘లిండ్సే గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ పేరుతో తీసుకువచ్చిన ఈ బిల్లును అమెరికా సెనెట్ గత నెలలో ఆమోదించింది. ఈ బిల్లు ట్రంప్‌కు విస్తృతమైన అధికారాలను ఇస్తుందనే ఉద్ధేశంతో డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు ఒకవేళ ఆమోదం పొందితే.. రష్యా నుంచి పెద్దఎత్తున ఇంధనం కొనుగోలు చేస్తున్నందున భారత్‌పై టారిఫ్‌ల భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. అంతేకాక భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : పుతిన్ ఆరస్ Vs జిన్‌పింగ్ హాంగ్చీ.. ఇద్దరిలో ఎవరి కార్ బెస్ట్? ఎవరి కారు ఎక్కువ సేఫ్?
ఈ బిల్లును వ్యతిరేకిస్తు్న్నప్పటికీ ఉక్రెయిన్‌కు తాము అందించే మద్దతు విషయంలో వెనకడుగు వేయబోమని డెమోక్రటిక్ నేతలు స్పష్టం చేశారు. అయితే ఈ బిల్లు మూలంగా మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని ఓ ప్రకటనలో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్లపైనా కూడా ధరల భారం పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రష్యా ఆంక్షల బిల్లును ఆమోదించాలని సెనెట్ డెమోక్రటిక్ సభ్యురాలు జీన్ షహీన్ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సాగిస్తున్న యుద్ధంతో ఉక్రెయిన్‌లోని అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్రెమ్లిన్ ఆదాయాన్ని దెబ్బతీసే ఈ బిల్లును ఆమోదించి, పుతిన్‌ను చర్చలకు రప్పించాలని ఆమె కోరారు. అందుకే ఈ బిల్లుపై సోమవారం హౌస్ రూల్స్ కమిటీ ఓటింగ్ చేపట్టనున్నట్ల సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా, ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడికి గణనీయమైన టారిఫ్ అధికారాలు లభించనున్నాయి. రష్యా ఇంధన రంగానికి కొనుగోళ్ల ద్వారా మద్దతు ఇస్తున్న దేశాలపై ఆర్థిక ఒత్తిడి పెంచడమే దీని ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. అయితే ఈ నిబంధనలపై అమెరికాలోనే కొంతమంది డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ట్రంప్ తన వాణిజ్య విధానంలో సుంకాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ బిల్లు ద్వారా ఇప్పుడు మరింత విస్తృతమైన టారిఫ్ అధికారాలను ఆయన చేతుల్లో పెట్టడం ప్రమాదకరమని డెమొక్రాట్లు హెచ్చరిస్తున్నారు.
ఇక ఈ బిల్లు కేవలం రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలకే పరిమితం కాదు. రష్యా ప్రభుత్వంపై కూడా కఠిన ఆంక్షలు విధించే ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆ దేశంలోని సంపన్న పారిశ్రామికవేత్తలు, ప్రముఖ అధికారులు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించే అవకాశం ఈ బిల్లుకు ఉందని తెలుస్తోంది. దీనిద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెంచవచ్చని, తద్వారా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యాన్ని దెబ్బతీయాలన్నది అమెరికా ఉద్దేశంగా తెలుస్తోంది.
Also Read : రష్యా ఆయిల్ టూ మిసైల్స్.. ఢిల్లీ వేదికగా మోదీ-పుతిన్ భేటీ.. ప్రపంచం కళ్లన్నీ భారత్ వైపే!









