Bhutanese PM : భారత ప్రధాని నరేంద్ర మోదీని తన అన్నయ్యలా భావిస్తానని, ఆయనను విష్ణువు అవతారంగా కూడా చూస్తానని భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే అన్నారు. ఆయన మోదీపై రాసిన ఓ వ్యాసంలో ఈ విషయాలను వెల్లడించారు. ప్రభుత్వ అధినేతగా మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టోబ్గే ఆయనపై ప్రశంసలు కురిపించారు. మోదీ నాయకత్వంలో భారత్ తన పొరుగు దేశాలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. అలాగే గ్లోబల్ సౌత్ దేశాల గొంతును ప్రపంచం ముందు బలంగా వినిపించడంలో మోదీ కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20లో శాశ్వత సభ్యుడిగా చేర్చడంలోనూ భారత్‌ది ముఖ్యమైన పాత్ర అని పేర్కొన్నారు.

వికసిత్ భారత్ అనేది కేవలం భారతదేశానికే సంబంధించిన విషయం కాదని టోబ్గే అన్నారు. భారత్ మరింత అభివృద్ధి చెందితే పొరుగు దేశాలకు కూడా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పారు. పెద్ద మార్కెట్, పెట్టుబడులు, టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో పాటు ప్రపంచ వ్యవహారాల్లో భారత్ ప్రభావం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. మోదీ తనపై చూపిన వ్యక్తిగత ప్రభావాన్ని కూడా టోబ్గే గుర్తు చేసుకున్నారు. తాను చాలా కాలంగా మోదీని అన్నయ్యలా భావిస్తున్నానని, కాలం గడిచే కొద్దీ ఆయనను తనకు మార్గనిర్దేశం చేసే వ్యక్తిగా చూస్తున్నానని చెప్పారు.

Also Read : H-1B వీసాదారులకు బిగ్ షాక్.. ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం!

2019లో మోదీతో జరిగిన ఓ సంభాషణను టోబ్గే గుర్తు చేసుకున్నారు. అప్పుడు మోదీని విష్ణువు అవతారంగా చూస్తున్నానని చెప్పాను. ఆ తర్వాత 2024 మార్చి 14న ఢిల్లీలో మళ్లీ ఆయనను కలిశాను. అప్పటికి నేను మరోసారి భూటాన్ ప్రధానిని అయ్యాను అని తెలిపారు. భూటాన్ 11వ ఐదేళ్ల ప్రణాళికలో భారత్ అందించిన సాయం తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడిందని టోబ్గే చెప్పారు. ఆ తర్వాత 12వ ప్రణాళికలోనూ మోదీ ప్రభుత్వం భూటాన్‌కు సహకారం కొనసాగించిందన్నారు. 2024లో తాను మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భూటాన్ 13వ ప్రణాళిక కోసం భారత్ తన సాయాన్ని రెట్టింపు చేసి రూ.10 వేల కోట్లకు పెంచిందని తెలిపారు. B4B విధానంలో భారత్-భూటాన్ సహకారం ఇప్పుడు విద్య, వైద్యం, మౌలిక వసతులు, జలవిద్యుత్, టెక్నాలజీ, వ్యవసాయం, వ్యాపారం వంటి అనేక రంగాల్లో కనిపిస్తోందని టోబ్గే చెప్పారు.

భూటాన్ రాజు గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీ నిర్మాణానికి భారత్ అందిస్తున్న సాయం కూడా చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుకు భారత్ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. ఆ హామీకి అనుగుణంగా రైలు మార్గాలు, సరిహద్దు మౌలిక వసతులు, విమాన రవాణా, డిజిటల్ కనెక్టివిటీ వంటి రంగాల్లో పనులు జరుగుతున్నాయని టోబ్గే చెప్పారు. మోదీ మద్దతుతో భారత కంపెనీలు కూడా భూటాన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, కొన్ని ప్రముఖ భారత సంస్థలు GMCలో ఫౌండింగ్ మెంబర్లుగా చేరాయని ఆయన తెలిపారు.

Also Read : పక్షవాతానికి చెక్.. బ్రెయిన్ చిప్స్‌కు డెడ్ ఎండ్.. చైనా సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణ!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.