
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొంది. ఐరోపా నుంచి దక్షిణ అమెరికా వరకు పలు దేశాల్లో యువత వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపడుతోంది. ఆకాశాన్నంటుతున్న ధరలు, విద్యా రంగంలో బడ్జెట్ కోతలు, నిరుద్యోగం వంటి సమస్యలపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్, అర్జెంటీనా వంటి దేశాల్లో జరుగుతున్న ఈ నిరసనల కారణంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఇటలీ ప్రధాని మెలోని వంటి అగ్ర నాయకుల పదవులకు ముప్పు వాటిల్లుతోంది. ఫ్రాన్స్‌లో బడ్జెట్ కోతలపై పాఠశాలల్లో మొదలైన చిన్న నిరసన.. నేడు దేశవ్యాప్తంగా నిరసనలగా మారాయి.
Also Read : సముద్రంలో ఐఫోన్లు.. ఇరాన్లో జనం పరుగులు? అసలు నిజం ఇదే!
ఫ్రాన్స్
ఇక్కడ పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికలకు ముందు ధరలు పెరగడం, పాఠశాలల దుస్థితి, విద్యారంగ బడ్జెట్లో కోతలు విధించడంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. పారిస్‌లో లక్షకు పైగా జనం సహా దేశవ్యాప్తంగా 5.5 లక్షల మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. బస్సులు తగలబడుతుండటంతో దేశం అట్టుడుకుతోంది.
బెల్జియం
యూనివర్సిటీ ఫీజులు, ఇళ్ల ఖర్చులు విపరీతంగా పెరగడంతో విద్యార్థులు రోడ్డెక్కారు. బ్రస్సెల్స్ నగరంలో నిరసనకారులపై పోలీసులు వాటర్ క్యాన్సర్లు ప్రయోగించాల్సి వచ్చింది.
పోర్చుగల్
లిస్బన్ నగరంలో ఇళ్ల ధరలు, అద్దెలు 2017 నుంచి రెట్టింపు అయ్యాయి. దీంతో యువతకు ఇళ్లు దొరకడం కష్టమై, జీతాలు చాలక వేలాది మంది ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు.
ఇటలీ
మిలాన్ నగరంలో జీతాలు పెరగకపోవడం, రోజువారీ ఖర్చులు భరించలేకపోవడంతో ప్రజలు నిరసనలకు దిగారు. ఇక్కడ చిన్న స్థాయిలో ఘర్షణలు జరిగాయి.
Also Read : అందుకే ట్రంప్ టారిప్స్ రద్దు చేశారు : మార్కో రూబియో సంచలన కామెంట్స్
అల్బేనియా
యూనివర్సిటీల అధ్వాన్న పరిస్థితి, ఫీజుల మోత, చదువు తర్వాత ఉద్యోగాలు రాకపోవడంతో విద్యార్థులు రగిలిపోతున్నారు. విద్యా మంత్రిత్వ శాఖ భవనంపై ఆందోళనకారులు రాళ్లు, కాంక్రీట్ దిమ్మెలు విసరడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.
అర్జెంటీనా
బ్యూనస్ ఐర్స్‌లో ఉన్నత విద్య బడ్జెట్‌ను ప్రభుత్వం తగ్గించడంతో విద్యార్థులు, పోలీసులు వీధుల్లో కొట్టుకున్నారు. ప్రభుత్వం యూనివర్సిటీలకు సరిపడా నిధులు ఇవ్వాలని కోర్టులు చెప్పినా అమలు చేయకపోవడంతో ఈ గొడవలు జరుగుతున్నాయి.
టర్కీ
విపరీతమైన ద్రవ్యోల్బణం, పెన్షన్లు సరిపోకపోవడంతో వృద్ధులు, కార్మికులు ఆందోళనలు చేపట్టారు. ఈ ఆర్థిక ఇబ్బందులతో ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్నారంటే అక్కడి పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు.
భారత్
ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే భారత్‌లోనూ నీట్ పేపర్ లీక్ వివాదం పెద్ద నిరసనలకు దారితీసింది. అలాగే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.









