
India power to Nepal :ఇటీవల నేపాల్‌లో సంభవించిన తీవ్ర వరదలు ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా నేపాల్‌లోని జలవిద్యుత్ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. దీంతో ఆ దేశంలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది. ఈ సంక్షోభం నుంచి ఆదేశాన్ని రక్షించడం కోసం పొరుగున ఉన్న భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (NEA) కి రోజుకు 18 గంటల పాటు (అర్థరాత్రి 00:00 గంటల నుంచి సాయంత్రం 18:00 గంటల వరకు) విద్యుత్‌ను ఎగుమతి చేయడానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారికంగా అనుమతి ఇచ్చి తన పెద్ద మనసును చాటుకుంది.
కాగా, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం 2026 సెప్టెంబర్ 13 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుందని సంబంధిత మంత్రిత్వశాఖ వెల్లడించింది. అందులో భాగంగా ముజఫ్ఫర్‌పూర్ – ధాల్కేబార్ డబుల్ సర్క్యూట్ లైన్ ద్వారా గరిష్ఠంగా 600 మెగావాట్లు, తనాక్‌పూర్ – మహేంద్రనగర్ సింగిల్ సర్క్యూట్ లైన్ ద్వారా 54 మెగావాట్ల వరకు విద్యుత్‌ను నేపాల్‌కు భారత్ ఎగుమతి చేయనున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత 2027 జనవరి నుంచి ఎంత పరిమాణంలో విద్యుత్‌ను ఆ దేశానికి అందించాలనే దానిపై 2026 డిసెంబర్‌లో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు.
నేపాల్ ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితుల్లో ఆ దేశ విద్యుత్ అవసరాలను తీర్చడం వల్ల రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ దౌత్య, ఇంధన సహకారం మరింత బలపడుతుందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, కష్టకాలంలో పొరుగు దేశాలకు అండగా నిలబడే భారత దౌత్య విధానానికి ఇది మరొక అద్భుత నిదర్శనంగా నిలిచిందని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి.









