
Google Techie : అమెరికాలోని జార్జియాలో జరిగిన ఒక దారుణ ఘటనలో భారత సంతతికి చెందిన గూగుల్ సీనియర్ ఇంజనీర్ శీతల్ వ్రెసియెన్ (57) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో ఆమె భర్త కిర్క్ వ్రెసియెన్ (56) నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. వీరిద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగానే ఈ ఘోరం జరిగిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
మంగళవారం రాత్రి కోబ్ కౌంటీలోని వీరి నివాసంలో ఈ కాల్పులు జరిగాయి. ఇంట్లో నుంచి గొడవ జరుగుతున్న సమయంలో, వారి కుమారుడు జాసన్ వ్రెసియెన్ బయట తుపాకీ గాయాలతో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి చూడగా, శీతల్ వ్రెసియెన్ తుపాకీ గాయాలతో అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. వెంటనే నిందితుడు కిర్క్ వ్రెసియెన్ను పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడిపై హత్య, రెండు అగ్రవేటెడ్ అసాల్ట్ కేసులు చట్టవిరుద్ధంగా తుపాకీని కలిగి ఉండటం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అతడికి బెయిల్ నిరాకరించి, కోబ్ కౌంటీ జైలులో ఉంచారు. గొడవకు అసలు కారణం ఏంటనేది ఇంకా దర్యాప్తులో ఉంది. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం, కిర్క్ ఎంతో సామాజికంగా, అందరితో కలివిడిగా ఉండేవారని, ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఎవరీ శీతల్ వ్రెసియెన్?
టెక్ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న శీతల్, గూగుల్‌లో ఇంజనీరింగ్ లీడర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గూగుల్‌కు రాకముందు ఆమె హోమ్ డిపో సంస్థలో ఈ-కామర్స్ వ్యాపార విస్తరణలో కీలక పాత్ర పోషించారు. భారత్, ఇంగ్లాండ్, ఘనా దేశాల్లో పెరిగిన ఆమె, జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. మహిళలు టెక్నాలజీ రంగంలో రాణించేలా ఆమె ఎంతోమందికి మార్గదర్శిగా ఉండేవారని సహోద్యోగులు గుర్తుచేసుకుంటున్నారు.









