
కాస్పియన్ సముద్రంలో కలకలం రేగింది. ఇరాన్‌కు చెందిన ఓ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ ఊహించని విధంగా దాడి చేసింది. ఈ దాడిలో ఓ నావికుడు అక్కడిక్కడే మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ సైనిక చర్యపై టెహ్రాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశ ప్రాదేశిక ఆస్తులు, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఎలాంటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడమని స్పష్టం చేసింది. ఈ దారుణ దాడికి ఒడిగట్టిన ఉక్రెయిన్ భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు, మూల్యం చెల్లించుకోక తప్పదని ఘాటుగా హెచ్చరించింది.
ఈ ప్రాంతంలో యుద్ధ జ్వాలలు మరింత విస్తరించకుండా ఉండాలంటే ఐరోపా దేశాలు వెంటనే జోక్యం చేసుకోవాలని ఇరాన్ విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. ఉక్రెయిన్ అగడాలను అరికట్టడంలో ఐరోపా సమాఖ్య బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే పరిస్థితులు చేయిదాటిపోతాయని హెచ్చరించింది. ఒకవైపు పశ్చిమాసియాలో ఇప్పటికే తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మరోవైపు రష్యా-ఉక్రెయిన్ పోరు కాస్పియన్ సముద్రానికి పాకింది. అయితే తమకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధమూ లేదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది.
Also Read : ట్రంప్ భార్య, కొడుకును లేపేస్తాం.. ఇరాన్ సంచలన వీడియో!
అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ మాత్రం ఈ విషయంలో తీవ్ర ఆరోపణలు చేశారు. రష్యా నుంచి ఇరాన్‌కు అత్యంత రహస్యమైన ఉపగ్రహ సమాచారం అందుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాలు, అక్కడ ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై రష్యా సేకరిస్తున్న శాటిలైట్ చిత్రాలను ఇరాన్ దాడుల కోసం ఉపయోగిస్తోంది. అందుకే తమ ఆత్మరక్షణలో భాగంగానే కౌంటర్ చర్యలు తీసుకుంటున్నామని సూచాయగా వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కాస్పియన్ సముద్ర మార్గం ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకంగా మారింది. అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ తన ఉత్తర సరిహద్దులోని ఈ సముద్ర మార్గం ద్వారానే చైనా సహా పలు ఆసియా, యూరోపియన్ దేశాల నుంచి నిత్యావసర వస్తువులను, వ్యాపార సరుకులను దిగుమతి చేసుకుంటోంది. ఇటువంటి వ్యూహాత్మక మార్గంలో వెళ్తున్న ఇరాన్ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ దాడి చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
ఒకవైపు హర్మూజ్ జలసంధిలో సీమైన్లను ఢీకొని ట్యాంకర్లు పేలిపోతున్నాయి. మరోవైపు కాస్పియన్ సముద్రంలో ఈ దాడులు జరగడం వల్ల రాబోయే రోజుల్లో రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం ఏ మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
Also Read : అమెరికా-సౌదీల బిగ్ డీల్.. తెరవెనుక ఇజ్రాయెల్ మైండ్ గేమ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!









