
Iran Kharg Island Explosions : పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి భీకర రూపం దాల్చాయి. ఇరాన్ పై అమెరికా తన దాడులను కొనసాగిస్తూనే ఉంది. దాడుల్లో భాగంగా పర్షియన్ గల్ఫ్‌లో అంత్యంత కీలక ఇంధన కేంద్రంగా పేర్కొనే ఇరాన్‌లోని ‘ఖర్గ్ ఐలాండ్’ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఖర్గ్ ఐలాండ్ సమీపంలో ఇరాన్‌కు చెందిన ఒక ఆయిల్ ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో స్థానికంగా పలు పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక ఫార్స్ (Fars) న్యూస్ ఏజెన్సీ తెలిపింది, అయితే ఆ పేలుళ్లకు గల స్పష్టమైన కారణాలు మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. అయితే, ఈ దాడులను ఇరాన్ అధికార వర్గాలు మాత్రం ఇంత వరకు అధికారికంగా ధ్రువీకరించక పోవడం గమనార్హం.
కాగా, ఇరాన్, అమెరికా యుద్దం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మూడు సార్లు ఖర్గ్ ఐలాండ్ పై దాడి జరిగింది. మొదటి సారి మార్చిలో ఇరాన్.. హోర్ముజ్ జలసంధిని మూసివేసి గ్లోబల్ ఆయిల్ సరఫరాకు ఆటంకం కలిగించిన సమయంలో జరిగింది. ఆ సమయంలో అమెరికా ఖర్గ్ ఐలాండ్‌పై దాడి చేసి మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే అప్పట్లో ఆయిల్ వంటి మౌలిక సదుపాయాలపై దాడి చేయకపోవడం గమనార్హం.
Also Read : విరిగిపడిన కొండ చరియలు.. మరోసారి నేపాల్‌కు వరద ముప్పు?
ఇక రెండో దాడి విషయానికి వస్తే ఇది ఏప్రిల్ 7న జరిగింది. అయినా ఇరాన్ వైఖరి మారకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల అనంతరం మరోసారి ఇరాన్ సైనిక స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగించాడు. ఇప్పుడు తాజాగా ఖర్గ్ ద్వీపం సమీపంలోని ఆయిల్ ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.తాజాగా జరిగిన దాడి మూడవది.
ఖర్గ్ ఐలాండ్ అనేది ఇరాన్ తీరానికి దాదాపు 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఆ దేశానికి అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రం. ఇరాన్ ఎగుమతి చేసే క్రూడ్ ఆయిల్లో అత్యధిక శాతం ఈ ద్వీపం ద్వారానే సరఫరా అవుతుందని తెలుస్తోంది. చైనా వంటి దేశాలకు ఇక్కడి నుంచే ప్రధానంగా ఆయిల్ రవాణా జరుగుతుందని చెబుతారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు, ప్రభుత్వ ఆదాయానికి ఈ ఐలాండ్ వెన్నుముక లాంటిదని భావిస్తారు. ఇక్కడ కేవలం చమురు నిల్వ కేంద్రాలు, రిఫైనరీలు మాత్రమే కాకుండా, ఈ ద్వీపంలో వేలాది మంది కార్మికుల నివాసాలు, చారిత్రక పోర్చుగీస్ కోట, పురాతన క్రైస్తవ మఠం వంటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలు కూడా అనేకం ఉన్నాయి. అలాంటి ముఖ్యమైన ఐలాండ్ పై దాడి జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Also Read : టిక్‌టాక్ ఫాలోవర్ల కోసం చెల్లితో గొడవ.. 15 ఏళ్ల చెల్లిని కత్తితో చంపిన అక్క!









