– RAVI PRAKASH

IRAN PRESIDENT : అమెరికా గడ్డపై అడుగు పెట్టిన ఇరాన్ అధ్యక్షుడు అదే అమెరికాపై ఐక్యరాజ్యసమితి వేదికగా విరుచుకుపడబోతున్నారా? అమెరికాలోకి వచ్చి…అమెరికానే ప్రపంచం ముందు నిలదీయబోతున్నారా? ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియన్ ఇవాళ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించబోతున్నారు. అసలు పేజెష్కియన్ ఏం మాట్లాడబోతున్నారు? అమెరికాపై ఏ ఆరోపణలు చేయ బోతున్నారు? ట్రంప్ ఒకవైపు ఇరాన్‌ను బెదిరిస్తూ ప్రసంగిస్తున్న సమయంలో…అమెరికా అధికారులు ఇరాన్ ప్రతినిధులతో మూడు గంటల పాటు ఏం మాట్లాడారు?

బయట యుద్ధం లోపల చర్చలు! అసలు ఏం జరుగుతోంది? అమెరికాలో ఇరాన్ అధ్యక్షుడు ఎందుకు? ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత. అలాంటి సమయంలో…ఇరాన్ అధ్యక్షుడు అమెరికా గడ్డపైకి రావడం అదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం కోసం రావడం చాలా పెద్ద దౌత్యపరమైన పరిణామం. మసూద్ పేజెష్కియన్ న్యూయార్క్ చేరుకున్నారు. అయితే అమెరికా మసూద్‌కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు. ఇరాన్ ప్రతినిధుల కదలికలపై ఆంక్షలు ఉన్నాయి. కొంతమంది ఇరాన్ అధికారులకు అధ్యక్షుడి మీడియా బృందంలోని కొందరికి వీసాలు కూడా ఇవ్వలేదు. అంటే ఐక్యరాజ్యసమితి వరకు రావచ్చు…కానీ అమెరికాలో స్వేచ్ఛగా తిరగలేరు! ఇదే సమయంలో ఇరాన్ అధ్యక్షుడు మాత్రం అమెరికా నేలపైనే నిలబడి అమెరికా విధానాలను ప్రశ్నించబోతున్నారు. అసలు ఐక్యరాజ్యసమితిలో పేజెష్కియన్ ఏం చెప్పబోతున్నారన్న ప్రశ్న ప్రపంచదేశాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే మసూద్ కొన్ని సంకేతాలు ఇచ్చారు.

ఇరాన్ ప్రజల బాధలు తమ దేశంపై జరిగిన సైనిక చర్యలు అంతర్జాతీయ ఒప్పందాలు దౌత్యం ఇవన్నీ ప్రసంగంలో కీలకంగా ఉండబోతున్నాయి. అంతేకాదు, ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు…తమ సైనిక, ఆర్థిక శక్తిని ఉపయోగించి…అంతర్జాతీయ నియమాలను పట్టించుకోకపోతే అది ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నను కూడా ఇరాన్ లేవనెత్తబోతోంది. అంటే ఒక దేశం శక్తివంతంగా ఉంటే…అంతర్జాతీయ చట్టాలకు అతీతంగా వ్యవహరించవచ్చా? అదే ఇరాన్ ప్రధాన ప్రశ్న.

ఇరాన్ అమెరికాపై ఏ ఆరోపణలు చేయబోతోంది? అమెరికా సైనిక చర్యలు ఇరాన్‌పై విధించిన ఆంక్షలు దౌత్యం విఫలమైందన్న వాదన ఇవన్నీ ఐక్యరాజ్యసమితి వేదికపై వినిపించబోతున్నాయి. మినాబ్ పాఠశాలపై బాంబు దాడి అంశాన్ని కూడా ఇరాన్ ప్రస్తావించబోతోంది. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో పిల్లలు మరణించారని ఇరాన్ ఆరోపిస్తోంది. అలాగేయుద్ధం ప్రారంభ దశలో తమ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యారని కూడా ఇరాన్ చెబుతోంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇరాన్ అధికారిక వాదనలు. ప్రతి ఆరోపణను స్వతంత్రంగా నిర్ధారించినా.. పూర్తిస్థాయి వాస్తవాలుగా పరిగణించలేం. ఇరాన్ ఈ అంశాలనే తన ప్రధాన కథనంగా ఐక్యరాజ్యసమితిలో తీసుకెళ్లబోతోంది.

Also Read : భారత్-పాక్ కాల్పుల విరమణ, ఇరాన్‌కు హెచ్చరిక, ఏఐకి కొత్త పేరు… ట్రంప్ ప్రసంగంలోని 10 కీలక అంశాలు

ఇక అసలు మలుపు ఇక్కడే ఉంది! అమెరికా మాపై దాడి చేసిందని ఇరాన్ అంటోంది.ఇరాన్‌కు అణ్వాయుధం ఇవ్వడం అస్సలు సాధ్యం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, అవసరమైతే సైనిక చర్యలకు కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. కానీ ఇదే సమయంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్‌లు ఇరాన్ ప్రతినిధులతో దాదాపు మూడు గంటల పాటు సమావేశమయ్యారు. ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న సమయంలోనే అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఇంత సుదీర్ఘంగా చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశాన్ని ట్రంప్ “చాలా మంచి, ఫలప్రదమైన సమావేశం”గా అభివర్ణించారు. అంటే బయట మాటల యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, తెరవెనుక దౌత్య చర్చలు జరుగుతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మూడు గంటల సమావేశంలో అసలు ఏ అంశాలపై చర్చించారన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఇరాన్ ఏదైనా ఒప్పందానికి సిద్ధమవుతోందా అన్న ఆసక్తి పెరుగుతోంది.

ఇదే సమయంలో మరో కీలక పరిణామం హోర్ముజ్ జలసంధి విషయంలో కనిపిస్తోంది. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ఇంధన రవాణా మార్గాల్లో ఇది ఒకటి. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే చమురు సరఫరా, చమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి, ఇరాన్ నౌకాశ్రయాలపై విధించిన దిగ్బంధాన్ని ఎత్తివేస్తే, ఏడు రోజుల్లో హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను ఇరాన్ ఇచ్చినట్లు సమాచారం. యుద్ధ పరిస్థితుల మధ్యే ఇలా చర్చలకు అవకాశం ఏర్పడటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మధ్య నేరుగా సమావేశం మాత్రం ఇంకా జరగలేదు. ట్రంప్ న్యూయార్క్‌లో పెజెష్కియన్‌తో సమావేశానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినా, ఇరాన్ మాత్రం అందుకు అంగీకరించలేదు. అయితే ఇరాన్, అమెరికా అధికారుల మధ్య చర్చలు కొనసాగుతుండటం మాత్రం దౌత్యానికి మార్గం పూర్తిగా మూసుకుపోలేదన్న సంకేతంగా కనిపిస్తోంది.

ఇక సెప్టెంబర్ 23న ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రసంగించనున్నారు. భారత కాలమానం ప్రకారం ఐక్యరాజ్యసమితి ఉదయం సమావేశం సాయంత్రం సుమారు 6:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే పెజెష్కియన్ ఖచ్చితంగా ఏ సమయంలో వేదికపైకి వస్తారో ముందుగానే చెప్పడం కష్టం. ఇతర దేశాల ప్రసంగాల సమయం మారే అవకాశం ఉండటంతో, సాయంత్రం 6:30 గంటల నుంచే ఐక్యరాజ్యసమితి ప్రత్యక్ష ప్రసారాన్ని గమనించడం మంచిది. అమెరికా గడ్డపై నిలబడి ఇరాన్ అధ్యక్షుడు అమెరికా విధానాలపై ఎలాంటి ఆరోపణలు చేస్తారు, ఏం డిమాండ్ చేస్తారు, ఇరాన్ వైఖరిని ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు ఎలా వివరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో అమెరికా కూడా తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేయనుంది.

అయితే అసలు ప్రశ్న ఒక్కటే ఇది కేవలం మాటల యుద్ధమా, లేక పెద్ద ఒప్పందానికి పునాది వేస్తున్న దౌత్య ప్రక్రియనా? ఒకవైపు ట్రంప్ నుంచి ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు వస్తుండగా, మరోవైపు మూడు గంటల అమెరికా–ఇరాన్ చర్చలు జరగడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు అమెరికాపై ఇరాన్ ఆరోపణలు చేస్తూనే, కొన్ని షరతులతో హర్మూజ్ జలసంధిని తెరవడానికి సిద్ధమన్న సంకేతాలు ఇస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు స్వయంగా అమెరికా వచ్చి ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించబోతున్నారు. దీంతో యుద్ధం, దౌత్యం రెండూ ఒకేసారి కొనసాగుతున్నాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. పెజెష్కియన్ ప్రసంగం కేవలం ఒక ప్రసంగంగా కాకుండా అమెరికా–ఇరాన్ వివాదంలో తదుపరి దౌత్య అడుగుకు సంకేతంగా మారుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఈ ప్రసంగం తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా, లేక దౌత్యానికి కొత్త మార్గం తెరుచుకుంటుందా అన్నది రాబోయే పరిణామాలే తేల్చనున్నాయి.

Also Read : హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన.. 7 రోజుల్లో తెరుస్తామంటూ సంచలన ఆఫర్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.