అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో అమెరికా ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్‌ను అంతం చేస్తామని బహిరంగంగానే అమెరికా హెచ్చరించింది. ఈ క్రమంలో ఇరాన్ పరోక్షంగా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్‌కు చెందిన అత్యున్నత సైనిక విభాగం ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అమెరికాకు ఊహించని రీతిలో వార్నింగ్ ఇచ్చింది. తమపై యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తే అమెరికా చరిత్రలోనే ఎన్నడూ చూడని రీతిలో భారీ విధ్వంసాన్ని రుచి చూపిస్తామని స్పష్టం చేసింది.

అమెరికాలో జాతీయ సంతాప దినాలు ప్రకటించే స్థాయి ఆపరేషన్లను చేపడతామని ఇరాన్ హెచ్చరించింది. చరిత్ర తిరగేస్తే.. అమెరికాలో చివరిసారిగా 2001 సెప్టెంబర్ 11 (9/11) వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన భీకర తీవ్రవాద దాడి తర్వాతే ప్రభుత్వం అధికారికంగా జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. ఇప్పుడు సరిగ్గా అదే తరహా సంకేతాలను ఇస్తూ IRGC వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. అంటే అమెరికా భూభాగంపైనే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఊహించని రీతిలో అతిపెద్ద విధ్వంసకర దాడులు చేయడానికి ఇరాన్ సీక్రెట్ స్కెచ్ వేస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి.

కేవలం సైనిక లేదా ప్రాణాంతక దాడులకే పరిమితం కాకుండా ఆర్థికంగా కూడా అమెరికా వెన్ను విరిచేందుకు ఇరాన్ వ్యూహాలు రచిస్తోంది. తమ దేశంలోని కీలకమైన వంతెనలు, మౌలిక వసతులు లేదా ఆయిల్ ప్లాంట్లపై గనుక అమెరికా ఒక్క దాడి చేసినా, దానికి ప్రతీకారంగా ఆ దేశానికి చెందిన అత్యంత ప్రధానమైన ఇంధన కేంద్రాలను ధ్వంసం చేస్తామని ఇరాన్ IRGC ప్రకటించింది. ప్రపంచ ఇంధన విపణిలో అమెరికా ఆధిక్యాన్ని దెబ్బతీయడం ద్వారా ఆ దేశంలో భారీ ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించడమే ఇరాన్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

ప్రపంచ వ్యాపార రంగానికి ముఖ్యంగా చమురు సరఫరాకు గుండెకాయ లాంటి ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధి వద్ద ఇరాన్ తన సైనిక పట్టును మరింత కఠినతరం చేసింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే చమురు రవాణాలో ఐదవ వంతు ఈ జలసంధి గుండానే సాగుతుంది. అలాంటి ప్రాంతంలో ఇరాన్ సైన్యం జారీ చేసిన ఆదేశాలు గ్లోబల్ మార్కెట్లను భయపెడుతున్నాయి. తమ సైన్యంతో ముందస్తుగా సమన్వయం చేసుకొని, అనుమతి పొందిన తర్వాత మాత్రమే హార్ముజ్ జలసంధి నుంచి కార్గో, చమురు నౌకలు ముందుకు వెళ్లాలని ఇరాన్ స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘించే నౌకలపై కఠిన చర్యలు ఉంటాయని పరోక్షంగా బెదిరించింది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా మండే ప్రమాదం కనిపిస్తోంది.