
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇరాన్‌తో జరిగిన ఘర్షణల్లో ఆ దేశ సైనిక శక్తి పూర్తిగా దెబ్బతిందని, తాము ఇప్పటికే విజయం సాధించామని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను నిజం కాదని నిరూపిస్తూ.. ఇరాన్ ఒక సంచలన వీడియోను విడుదల చేసింది. శాటిలైట్లకు, శత్రు దేశాల రాడార్లకు అంతుచిక్కకుండా భూగర్భంలో నిర్మించిన రహస్య సైనిక స్థావరాలను బయటపెట్టి అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించారు. ఇరాన్‌తో జరుగుతున్న పోరు సైనికపరంగా దాదాపు ముగింపు దశకు వచ్చిందని.. ఆ దేశ మిలిటరీ శక్తి తీవ్రంగా దెబ్బతిన్నదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి పెద్ద ఎత్తున దాడులు చేయాల్సిన అవసరం లేదనిపిస్తున్నప్పటికీ, పరిస్థితులు మారితే స్పందించేందుకు అమెరికా సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాల జోలికి వెళ్లకుండా కట్టిడి చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ఇరాన్-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం తుడిచిపెట్టుకుపోయిందని తరచూ చెబుతూ వస్తున్నారు. తాజాగా మధ్యంతర ఎన్నికల తర్వాత కూడా ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.
Also Read : ఎన్విడియాకు భారీ షాక్.. సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై వివాదాస్పద ఆరోపణలతోరూ.23 లక్షల కోట్లు స్వాహా!
ట్రంప్ వాదనలను పూర్తిగా పటాపంచలు చేస్తూ, ఇరాన్ రక్షణ శాఖ ఒక పవర్ ఫుల్ వీడియోను విడుదల చేసింది. తమ దేశ రక్షణ రంగం చెక్కుచెదరలేదని, అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కొంటూనే మరింత శక్తివంతంగా మారామని శత్రు దేశాలకు గట్టి సంకేతాలు పంపింది. ఇరాన్ స్టేట్ టీవీ, అధికారిక వార్తా సంస్థలు ప్రసారం చేసిన ఈ విజువల్స్‌లో కిలోమీటర్ల కొద్దీ విస్తరించి ఉన్న భారీ అండర్‌గ్రౌండ్ సొరంగ మార్గాలు కనిపించాయి. శత్రు దేశాల వైమానిక దాడులను, బంకర్ బస్టర్ బాంబులను సైతం తట్టుకునేలా పర్వతాలను తొలచి ఈ బంకర్లను నిర్మించారు.
వీటిలో అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు వరుస క్రమంలో మోహరించి ఉన్నాయి. అంతేకాకుండా ఆ ఆయుధాలను మోసుకెళ్లే హెవీ-డ్యూటీ మిలిటరీ ట్రక్కులు కూడా ఈ వీడియోలో స్పష్టంగా కనిపించాయి. భూగర్భంలోనే క్షిపణులను సురక్షితంగా నిల్వ చేయడమే కాకుండా.. క్షణాల వ్యవధిలో వాటిని శత్రువులపైకి ప్రయోగించేలా ఇరాన్ తన సైనిక వ్యవస్థను అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు ఈ వీడియో ద్వారా స్పష్టమైంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రతిష్టంభనకు గురైన తరుణంలో ఇరాన్ ఈ రకమైన శక్తి ప్రదర్శనకు దిగడం పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తోంది.
Also Read : చైనా గూఢచారితో ఎన్విడియా సీఈఓ హనీట్రాప్ వివాదం.. ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ కావాల్సిందే!









