ఇరాన్‌లో కొత్త రక్షణ మంత్రి నియామకానికి సంబంధించి అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ క్లారిటీ ఇచ్చారు. ఏడు నెలల నుంచి ఖాళీగా ఉన్న రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలను స్వీకరించేందుకు మెహర్దాద్ అఖ్లాఘీ పేరును ఆయన అధికారికంగా ప్రతిపాదించారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన సమయంలో జరిగిన తొలి వైమానిక దాడుల్లో అప్పటి రక్షణ మంత్రి బ్రిగేడియర్ జనరల్ అజీజ్ నసిర్‌జాదే మరణించారు. అప్పటి నుంచి పలువురు సైనిక అధికారులు తాత్కాలికంగా ఈ శాఖ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు శాశ్వత అధిపతిగా మెహర్దాద్ అఖ్లాఘీ పేరును నామినేట్ చేశారు.

Also Read : నరేంద్ర మోదీ విష్ణువు అవతారం.. భూటాన్ ప్రధాని సంచలన కామెంట్స్ !

మెహర్దాద్ అఖ్లాఘీకి ఇరాన్ రక్షణ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన ఇటీవలి వరకు రక్షణ మంత్రిత్వ శాఖలోనే ఒక ఉన్నత కార్యనిర్వాహక పదవిలో బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా గతంలో ఇరాన్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా కూడా ఆయన పనిచేశారు. ప్రస్తుతం అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రతిపాదించిన అఖ్లాఘీ ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణను ఇరాన్ పార్లమెంటుకు చెందిన సంబంధిత కమిటీ కూలంకషంగా సమీక్షిస్తుంది. ఆ సమీక్ష పూర్తయిన తర్వాత పార్లమెంటులో విశ్వాస తీర్మానం నిర్వహించనున్నారు. అందులో ఆమోదం పొందితే అఖ్లాఘీ అధికారికంగా ఇరాన్ రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

మరొకవైపు యెమెన్‌లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వ దళాలు ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులపై యెమెన్ డాన్ పేరుతో భారీ సైనిక చర్యను ప్రారంభించాయి. ఎంతో ప్రాధాన్యం ఉన్న ధుబాబ్ జిల్లాతో పాటు బాబ్ అల్-మండేబ్ సముద్ర మార్గం సమీపంలోని కీలక ప్రాంతాలను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రభుత్వ సైన్యం ప్రకటించింది. అలాగే తైజ్ ప్రావిన్స్‌కు పశ్చిమాన ఉన్న మోఖా ఓడరేవు పట్టణాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలపగా.. ఈ వాదనలను హౌతీ తిరుగుబాటుదారులు ఖండించారు. బాబ్ అల్-మండేబ్ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఇరాన్ సైతం స్పందించింది. ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ సీనియర్ సలహాదారు మేజర్ జనరల్ యహ్యా రహీమ్ సఫవి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అమెరికాకు ఎదురుకానున్న మరో ప్రధాన ఓటమికి ఇవి సూచికలని వ్యాఖ్యానించారు. గల్ఫ్ ప్రాంతంలో బిలియన్ల డాలర్లు ఖర్చు చేసి సైనిక స్థావరాలు ఏర్పాటు చేసినప్పటికీ భద్రతను నిర్వహించడంలో అమెరికా పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. దీంతో మళ్లీ పశ్చిమాసిలో ఉద్రిక్తతలు పెరిగాయి.

Also Read : ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి.. ఫ్రాన్సిస్ హాల్జెన్‌కు అవార్డు!