దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ వైపు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో గత వారం దాడి జరిగిన విషయం తెలిసిందే. కాక్‌పిట్‌‌లోనే ఒమన్ దేశానికి చెందిన సహ విమాన పైలట్ హమ్మామ్ అల్-హమ్మమీ విచక్షణారహితంగా దాడి చేసి భారతీయ ప్రధాన పైలట్ స్మిత్ మచ్ఛార్‌పై క్రాష్ గొడ్డలితో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన సమయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

విమానంలో 150 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ఉన్నప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా ఆ విమానాన్ని గాల్లోనే కూల్చేయడానికి ఇజ్రాయెల్ రక్షణ దళాలు రెడీ అయ్యాయి. విమానంలో కో-పైలట్ దాడి చేసిన వెంటనే ఆ విమానం ఒక్కసారిగా 14,000 అడుగుల కిందకు పడిపోయింది. ఆ సమయంలో ఇజ్రాయెల్ వైమానిక దళం కాక్‌పిట్‌ను సంప్రదించడానికి పలుమార్లు ప్రయత్నించినప్పటికీ.. లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో 9/11 తరహా తీవ్రవాద దాడి జరుగుతోందేమోనని అనుమానించిన ఇజ్రాయెల్ వెంటనే అత్యవసర కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి తమ ఆకాశమార్గాన్ని మూసివేసింది. అలాగే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యుద్ధ విమానాలను రంగంలోకి దించింది.

Also Read : రష్యా ల్యాబ్‌లో పగిలిన టెస్ట్ ట్యూబ్.. లీకైన ప్లేగు బ్యాక్టీరియా.. ఆందోళనలో ప్రజలు

అయితే గాయపడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ తీవ్ర చాకచక్యంతో వ్యవహరించి కాక్‌పిట్ తలుపులను అన్‌లాక్ చేయగలిగారు. వెంటనే విమానంలో ఉన్న ఇజ్రాయెలీ ప్రయాణికులు, ఫ్లైదుబాయ్ సిబ్బంది స్పందించి దాడులకు తెగబడ్డ ఒమన్ కో-పైలట్‌ను పట్టుకుని కట్టడి చేశారు. ఆ తర్వాత విమానం సౌదీ అరేబియా వైపునకు మళ్లడంతో ఇజ్రాయెల్ తమ యుద్ధ విమానాలను వెనక్కి పిలిపించింది. సౌదీ అరేబియా తమ జెట్‌లను పంపి, విమానాన్ని క్షేమంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించింది.

ఇజ్రాయెల్ రక్షణ విధానాల ప్రకారం ఏదైనా విమానం కంట్రోల్ తప్పి లేదా హైజాక్ అయి బెన్ గురియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా కీలక భవనాల వైపు దూసుకొస్తుంటే దాన్ని కూల్చివేసే అధికారం కేవలం దేశ ప్రధానికి మాత్రమే ఉంటుంది. ఈ ఘటనలో కూడా విమానం కనుక ఇజ్రాయెల్‌‌లోని అజ్రియేలీ టవర్లు లేదా ఇతర ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలపై పడిపోతే వందలాది మంది ప్రాణాలు పోతాయని.. అందుకే 150 మంది ఉన్న ఆ ప్యాసెంజర్ విమానాన్ని కూల్చేయడమే మేలని ఇజ్రాయెల్ అధికారులు భావించినట్లు తెలుస్తోంది.

దాడికి పాల్పడిన ఒమన్ కో-పైలట్ హమ్మామ్ అల్-హమ్మమీ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇజ్రాయెల్ విచారణాధికారులు కూడా ఈ విచారణలో పాల్గొంటున్నారు. విచారణలో ఆ నిందితుడు షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఇజ్రాయెల్‌కు విమానాలు నడిపే అన్ని ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం కోసం యత్నించాను, చివరకు ఫ్లైదుబాయ్‌ను ఎంచుకున్నాను. ఉద్యోగంలో చేరకముందే ఈ దాడికి ప్లాన్ చేశానని నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన తర్వాత పైలట్ భద్రత, పరిశీలనలో విఫలమయ్యారంటూ ఇజ్రాయెల్ నిఘా సంస్థలైన మొసాద్, షిన్ బెట్‌లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఆందోళన.. 500 స్కూళ్లు బంద్ 4,000 మంది అరెస్ట్.. కారణమిదే!