పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న పరస్పర దాడులతో గల్ఫ్ దేశాల్లో ఎటు చూసినా సైరన్ల మోత మోగుతోంది. తమ దేశంలోని సైనిక స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేయడాన్ని ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలో ఊహించని రీతిలో అగ్రరాజ్యంపై ప్రతీకార దాడులకు దిగింది. బహ్రెయిన్‌, కువైట్‌ దేశాల్లో ఉన్న అమెరికాకు చెందిన ఏకంగా 85 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.

ఈ భీకర దాడులపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయనే నెపంతో.. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు దిగిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా చేసిన ఈ దాడులు రెండు దేశాల మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని ఐఆర్‌జీసీ మండిపడింది. అగ్రరాజ్యం చేసిన ఈ ఉల్లంఘనకు తగిన బుద్ధి చెప్పడానికే తాము ‘ప్రతీకార ఆపరేషన్’ ప్రారంభించామని స్పష్టం చేసింది.

ఇరాన్ సైన్యం ఈసారి అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన రక్షణ కేంద్రాలను దెబ్బకొట్టింది. బహ్రెయిన్‌లోని యూఎస్‌ ఫిఫ్త్‌ ఫ్లీట్‌, కువైట్‌లోని అలీ అల్‌ సలేమ్‌ ఎయిర్‌ బేస్‌ సహా పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన 85 కీలక మిలిటరీ క్యాంపులపై ఒకేసారి డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల వల్ల అమెరికా రక్షణ వ్యవస్థకు ఎంత నష్టం వాటిల్లిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ దాడుల పరంపరలో ఇరాన్ ఆర్మీ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. బుషెహర్ ప్రాంతంలో నిఘా పెట్టిన అమెరికాకు చెందిన అత్యాధునిక, అత్యంత ఖరీదైన ‘ఎంక్యూ-9’ రీపర్ డ్రోన్‌ను తమ క్షిపణుల ద్వారా విజయవంతంగా కూల్చివేసినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది. యుద్ధ రంగంలో అత్యంత శక్తిమంతమైనదిగా పేరున్న అమెరికా డ్రోన్ ఈ దాడుల్లో కూలిపోయింది.