
USA : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగర మేయర్ జాన్ విట్‌మైర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వలసదారుల విషయంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు పోలీసులు పూర్తిస్థాయిలో సహకరించకూడదని ఆదేశించారు. ఇటీవల జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో టెక్సాస్‌తో పాటు పలు ప్రాంతాల్లో డెమోక్రాట్లు గెలిచిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మీడియాతో మాట్లాడిన మేయర్.. ఎన్నికల ఫలితాలు చాలా ముఖ్యమని చెప్పారు. కొత్త ఆదేశాల ప్రకారం.. ఒక వ్యక్తిపై వేరే క్రిమినల్ కేసు ఉండి, జైలుకు పంపించే పరిస్థితి ఉంటేనే పోలీసులు ఐసీఈ అధికారులను సంప్రదించాలి. అంతేకాకుండా ఆ వ్యక్తిపై ఐసీఈ జారీ చేసిన వారెంట్ ఉందో లేదో కూడా ప్రభుత్వ డేటాబేస్‌లో పరిశీలించాలి.
కేవలం ఒక వ్యక్తి అక్రమంగా అమెరికాలో ఉంటున్నాడనే అనుమానంతో ఐసీఈ అధికారులకు సమాచారం ఇవ్వకూడదని మేయర్ స్పష్టం చేశారు. అలాగే వలస నిబంధనల పేరుతో మాత్రమే ఎవరినీ అరెస్టు చేయకూడదని, పోలీసుల అదుపులో ఎక్కువసేపు ఉంచకూడదని ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల హ్యూస్టన్‌లో నివసించే ప్రజల్లో భయం తగ్గుతుందని మేయర్ చెప్పారు. పోలీసులు వలసదారుల వెంట పడకుండా, నగరంలో నేరాలను అరికట్టడంపై దృష్టి పెట్టాలని అన్నారు. పోలీస్ చీఫ్ జె. నో డియాజ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. పోలీసులు నేరాలకు సంబంధించిన కేసులపైనే దృష్టి పెడతారని, వలస నిబంధనల ఉల్లంఘనలపై కాదని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా, చట్టపరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉందని మేయర్‌కు తెలుసు. అయినా ఈ నిర్ణయానికి తానే బాధ్యత తీసుకుంటానని చెప్పారు.
మరోవైపు, ఐసీఈకి సహకరించని నగరాలపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రభుత్వం గతంలోనే హెచ్చరించింది. ఐసీఈ అధికారులు హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. ఆ శాఖపై నియంత్రణ తీసుకువస్తామని చెబుతున్నారు. హ్యూస్టన్ నగరానికి, టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్‌కు మధ్య గత కొన్ని నెలలుగా ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అబాట్ ఓడిపోయారు. ఆయనతో పాటు రాష్ట్రంలోని పలువురు ముఖ్య నేతలు కూడా ఓటమి పాలయ్యారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన గినా హినోజోసా వచ్చే ఏడాది జనవరిలో కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.









