
Nepal : నేపాల్‌లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు హెలికాప్టర్‌తో సహాయక చర్యలు చేపట్టారు అక్కడి సిబ్బంది. ఇందులో ప్రియ అధికారి అనే మహిళా పైలట్ కీలకంగా పనిచేశారు. ఈమె నేపాల్‌లో తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ . 41 ఏళ్ల ఆమె.. కేవలం ఆరు రోజుల్లో దాదాపు 100 రెస్క్యూ ఆపరేషన్లు చేశారు.
వరదలు ఎక్కువగా వచ్చిన రసువా జిల్లాలోని టిమురే ప్రాంతంలో కూడా ఆమె సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియ మాట్లాడుతూ.. ఈ రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టంగా ఉందని చెప్పారు. 2015లో నేపాల్‌లో వచ్చిన భారీ భూకంపం కంటే కూడా ఈసారి పరిస్థితులు మరింత కష్టంగా ఉన్నాయని తెలిపారు. వరదల వల్ల ఓ ఇరుకైన లోయలో చాలా ప్రాంతాలు ఒకేసారి దెబ్బతినడమే దీనికి కారణమని చెప్పారు.
ఇంతకు ఈమె ఎవరంటే?
ప్రియ అధికారి హిమాలయ ప్రాంతాల్లో హెలికాప్టర్ నడపడంలో మంచి అనుభవం ఉన్న పైలట్. కొండల్లో ప్రమాదాలకు గురైన వారిని హెలికాప్టర్లలో తీసుకురావడం, గాలించడం వంటి పనులు ఎన్నో చేశారు. కొన్ని రెస్క్యూ ఆపరేషన్లలో ఆమె దాదాపు 6,200 మీటర్ల ఎత్తు వరకు వెళ్లారు. అయితే ఆమె మొదటి నుంచీ పైలట్ కాదు. పర్యావరణ శాస్త్రం చదివిన ఆమె.. మొదట విమానంలో క్యాబిన్ సిబ్బందిగా పనిచేశారు. ఒకసారి సరదాగా హెలికాప్టర్లో ప్రయాణించడంతో ఆమెకు హెలికాప్టర్ నడపాలనే ఆసక్తి వచ్చింది. దీంతో హెలికాప్టర్ నడపడం నేర్చుకునేందుకు ఫిలిప్పీన్స్ వెళ్లారు. అవసరమైన శిక్షణ, విమాన ప్రయాణ గంటలు పూర్తి చేసిన తర్వాత 2017లో పూర్తిస్థాయి హెలికాప్టర్ పైలట్‌గా మారారు. ఆ తర్వాత కొండ ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లపై ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు.
టిమురే ప్రాంతంలో రెస్క్యూ పనుల కోసం దాదాపు 20 హెలికాప్టర్లు పనిచేశాయి. ఒకే చిన్న ప్రాంతంలో ఒకేసారి చాలా హెలికాప్టర్లు తిరగాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఐదు, ఆరు హెలికాప్టర్లు ఒకేసారి కిందకు దిగాల్సి వచ్చేదని ప్రియ చెప్పారు. ఎవరి హెలికాప్టర్ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునేందుకు పైలట్లు ఎప్పటికప్పుడు రేడియోలో మాట్లాడుకుంటూ ఉండేవారు. అలా చేయకపోతే రెండు హెలికాప్టర్లు ఒకే చోటుకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. వరదలు, కొండచరియల వల్ల చాలా చోట్ల నేల మొత్తం బురదగా మారిపోయింది. పై నుంచి చూస్తే నేల గట్టిగానే కనిపించినా.. హెలికాప్టర్ దిగిన తర్వాత దాని బరువును భరించగలదో లేదో చెప్పలేని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో నేల చాలా మెత్తగా ఉండటంతో హెలికాప్టర్‌ను పూర్తిగా ఆపలేకపోయేవారని ప్రియ చెప్పారు. ప్రయాణికులను ఎక్కించుకునేంత వరకు హెలికాప్టర్ ఇంజిన్‌ను ఆన్‌లోనే ఉంచాల్సి వచ్చేదని తెలిపారు.
వరుసగా చాలా గంటలు హెలికాప్టర్ నడపడంతో తాను, తనతో పనిచేస్తున్న ఇతర పైలట్లు చాలా అలసిపోయామని ప్రియ చెప్పారు. అయినా ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను కాపాడటానికే తమకు శిక్షణ ఇచ్చారని తెలిపారు. మేమంతా చాలా అలసిపోయాం. వరుసగా చాలా విమాన ప్రయాణాలు చేశాం. కానీ ఇలాంటి పరిస్థితుల కోసమే మాకు శిక్షణ ఇచ్చార ని ప్రియ అధికారి చెప్పారు.









