ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అవుట్‌లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ సహా పలు కీలక ప్లాట్‌ఫారమ్‌లు ఒక్కసారిగా నిలిచిపోవడంతో లక్షలాది మంది వినియోగదారులు, ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ ఈమెయిల్ ఖాతాలను యాక్సెస్ చేయలేకపోతున్నామని, మెయిల్స్ పంపడం, స్వీకరించడం సాధ్యం కావడం లేదని యూజర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ ఏఐ అసిస్టెంట్ కోపైలట్, ఇతర మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో కూడా సాంకేతిక లోపాలు తలెత్తాయి.

Also Read : 23 ఏళ్ల అమెరికా చరిత్రను తిరగరాసిన ట్రంప్.. ఏ విషయంలోనో తెలుసా?

వెబ్‌సైట్లు, యాప్‌ల అంతరాయాలను పర్యవేక్షించే డౌన్‌డిటెక్టర్ గణాంకాల ప్రకారం కేవలం అవుట్‌లుక్ సమస్యలపైనే దాదాపు 1,30,000 మందికి పైగా వినియోగదారులు నివేదికలు అందించారు. చాలా మందికి తమ ఇన్‌బాక్స్‌లు పూర్తిగా లోడ్ కాకపోవడం, వర్క్‌ప్లేస్ మెసేజింగ్ యాప్ ‘టీమ్స్’ పనిచేయకపోవడంతో కార్యాలయ పనులకు తీవ్ర ఆటంకం కలిగింది. ఉత్తర అమెరికా సహా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపించింది.

ఈ సాంకేతిక సమస్యపై మైక్రోసాఫ్ట్ వెంటనే స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది. తమ మౌలిక సదుపాయాలలోని ఒక కీలక భాగం ‘అధిక లోడ్’ను ఎదుర్కొంటోందని, దీనివల్లే కనెక్టివిటీ లోపాలు తలెత్తాయని సంస్థ తెలిపింది. ఆటోమేటెడ్ తనిఖీల సమయంలో తలెత్తిన ఒక సాంకేతిక సమస్య కారణంగా అనేక సర్వర్లు అనూహ్యంగా అందుబాటులో లేకుండా పోయాయని మైక్రోసాఫ్ట్ నిర్ధారించింది. ముఖ్యంగా ఎక్స్‌చేంజ్ ఆన్‌లైన్ మెయిల్‌ బాక్స్‌లను యాక్సెస్ చేయడంలో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది.

పరిస్థితిని చక్కదిద్దేందుకు తమ ఇంజనీరింగ్ బృందాలు పనిచేస్తున్నాయని.. సమస్యకు పరిష్కారాన్ని పరీక్షిస్తున్నామని మైక్రోసాఫ్ట్ 365 స్టేటస్ ఖాతా వెల్లడించింది. తాజా అప్‌డేట్ ప్రకారం ఉత్తర అమెరికాలో మైక్రోసాఫ్ట్ టీమ్స్‌కు సంబంధించిన సమస్యలను విజయవంతంగా పునరుద్ధరించినట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ఇంకా కొంతమంది వినియోగదారులు అక్కడక్కడా కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నివేదిస్తున్నారు.

Also Read : ఎన్వీడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా.. మరి తర్వాత బాస్ ఎవరంటే?