Norway : స్మార్ట్ గ్లాసెస్.. ఇవి పెట్టుకుంటే చేతిలో ఫోన్ పట్టుకోకుండానే ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డ్ చేయొచ్చు. అయితే వీటితో ఇతరులకు తెలియకుండా రికార్డింగ్ చేసే అవకాశం ఉండటంతో ఇప్పుడు ప్రైవసీపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నార్వే ప్రభుత్వం స్మార్ట్ గ్లాసెస్‌పై తాత్కాలికంగా నిషేధం విధించాలని భావిస్తోంది. పార్కులు, బీచ్‌లు, షాపింగ్ మాల్స్, స్కూళ్లు, జిమ్‌లు, ఆసుపత్రులు వంటి చోట్ల స్మార్ట్ గ్లాసెస్ వాడకుండా నిషేధం పెట్టాలని నార్వే ప్రభుత్వం చూస్తోంది. ఎవరికీ తెలియకుండా వారి ఫొటోలు, వీడియోలు, మాటలు రికార్డ్ చేయొచ్చన్నదే దీనికి ప్రధాన కారణం.

ఈ విషయంలో భవిష్యత్తులో ఎలాంటి రూల్స్ పెట్టాలనే దానిపై పరిశీలించేందుకు నిపుణులతో ఒక టీమ్‌ను కూడా ఏర్పాటు చేయాలని నార్వే ప్రభుత్వం నిర్ణయించింది. స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకున్న వ్యక్తి ఫోన్ బయటకు తీయకుండానే రికార్డింగ్ చేయొచ్చు. మెటా కంపెనీకి చెందిన స్మార్ట్ గ్లాసెస్‌లో రికార్డింగ్ చేస్తున్నప్పుడు చిన్న LED లైట్ వెలుగుతుంది. దీని ద్వారా రికార్డింగ్ జరుగుతోందని ఎదుటివారికి తెలుస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే జనాలు ఎక్కువగా ఉన్న చోట ఆ చిన్న లైట్‌ను గమనించడం చాలా కష్టమని విమర్శలు ఉన్నాయి.

Also Read : అమెరికా మాట వినని ఇరాన్.. దాడులు చేసినా మళ్లీ అదే పని!

స్మార్ట్ గ్లాసెస్‌పై నిషేధం గురించి ఆలోచిస్తున్న దేశం నార్వే ఒక్కటే కాదు. ఇంగ్లాండ్, వేల్స్‌లోని కోర్టుల్లో స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకోవడంపై ఇప్పటికే నిషేధం ఉంది. వెదర్‌ స్పూన్ వంటి పబ్‌లు, కొన్ని థియేటర్లు, రెస్టారెంట్లు కూడా వీటిని వాడకుండా ఆంక్షలు పెట్టాయి. కస్టమర్లను ఎవరికీ తెలియకుండా రికార్డ్ చేయకుండా ఉండటం, సినిమాలను రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టకుండా చూడటం దీనికి కారణాలు.

అమెరికా లోని న్యూయార్క్ కోర్టులు, కొన్ని క్యాసినోలు, సినిమా థియేటర్లలో కూడా స్మార్ట్ గ్లాసెస్‌పై నిషేధం ఉంది. భారత్‌లో కూడా స్మార్ట్ గ్లాసెస్‌తో రహస్యంగా వీడియో తీసిన ఘటన ఒకటి చర్చకు వచ్చింది. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లోని ఓ కేఫ్‌లో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తిని అతని అనుమతి లేకుండా రే-బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్‌తో వీడియో తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌గా పెట్టారు.

ఆ వీడియోకు 4.19 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 15 వేల లైక్స్, వందల కామెంట్లు వచ్చాయి. దీంతో ఆ వ్యక్తి సోషల్ మీడియాలో ఎగతాళి, వేధింపులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. భారత్‌లో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 ఇప్పటికే ఉంది. అయితే స్మార్ట్ గ్లాసెస్ విషయంలో సమస్య కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే తమను ఎవరో వీడియో తీస్తున్నారనే విషయం కూడా ఎదుటివారికి తెలియకపోవచ్చు. అందుకే స్మార్ట్ గ్లాసెస్‌ను పూర్తిగా బ్యాన్ చేయకుండా.. వాటిని ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అనే విషయంలో స్పష్టమైన రూల్స్ తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read : పక్షవాతానికి చెక్.. బ్రెయిన్ చిప్స్‌కు డెడ్ ఎండ్.. చైనా సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణ!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.