
Nepal Floods : హిమాలయ దేశంగా పిలవబడే నేపాల్‌లో సంభవించిన మెరుపు వరదలు వందలాది కుటుంబాలను చిన్నాభిన్నం చేశాయి. ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపాయి. భోటే కోషి నది ఒక్కసారిగాఉప్పొంగడంతో నేపాల్ లోని అనేక జిల్లాలను వరద ముంచెత్తింది. ఈ జలప్రళయానికి మంచుకొండల్లో సంభవించిన భూకంపమే కారణమని అందరూ అనుకున్నారు. అయితే, హిమలయాల్లో ఉన్న హిమనీ సరస్సు బద్ధలవడం వల్లే ఈ విపత్తు సంభవించిందని తాజాగా అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది.
Also Read : అతిపెద్ద డ్యాం నిర్మిస్తున్న చైనా.. భారత్‌కు పొంచి ఉన్న మెగా ముప్పు
బుధవారం ఉదయం 8.37 గంటల ప్రాంతంలో టిబెట్‌లోని గోసాయిన్‌కుండ ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ముందుగా అమెరికా (USA) అధ్యయన సంస్థ అంచనా వేసింది. దాని ప్రభావంతో టిబెట్, నేపాల్ సరిహద్దులోని పర్వత సమూహం నుంచి భారీ కొండ చరియ విరిగిపడినట్లు తెలిపింది. అయితే, తాజాగా దీనిపై వివరణ ఇచ్చింది. ‘‘ నేపాల్‌లో సంభవించింది భూకంపం కాదు.. ఈ తరంగాలను దీర్ఘకాలికంగా మేం విశ్లేషించిన అనంతరం కొండచరియలు విరిగిపడటం వల్లే ఈ ప్రకంపనలు సంభవించినట్లు తేలింది. ఆ ప్రకంపనల వల్ల హిమనీ సరస్సు బద్ధలై భారీ మంచు చరియలు, రాళ్లు వచ్చి లిండే నదిలో పడ్డాయి. ఆ నది ఉప్పొంగి.. బోటే కోషి నదిలోకి వరద ఒక్కసారిగా దూసుకొచ్చింది’’ అని అమెరికా జియాలాజికల్ సర్వే తేల్చిచెప్పింది. పర్వత ప్రాంతాల నుంచి భారీ పరిమాణంలో ఉన్న మంచు, రాళ్ల చరియలు విరిగిపడుతున్నట్లు శాటిలైట్ దృశ్యాల ద్వారా తెలిసిందని అమెరికా నిపుణులు పేర్కొన్నారు.
మరోవైపు, ఈ వరదలను జర్మన్ రీసర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ కూడా విశ్లేషించింది. జల ప్రళయానికి దాదాపు 7 నిమిషాల ముందు 4.4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు తాము గుర్తించినట్లు తెలిపింది. ఆ వెంటనే భీకర వరద నేపాల్ జిల్లాలను ముంచెత్తినట్లు వివరించింది. కాగా, ఈ విపత్తులో ఇప్పటివరకు 157 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వందల మంది గల్లంతయ్యారు. వీరిలో అత్యధికులు విదేశీయులే. భారత్ నుంచి 140 మందికి పైగా వరదల్లో కొట్టుకుపోయినట్లు వెల్లడైంది. అటు టిబెట్‌లోనూ వరద తీవ్రత ఎక్కువగానే ఉంది. ఆ దేశంలో ముగ్గురు మరణించగా.. 553 మందికి పైగా గల్లంతయినట్లు ప్రకటించింది.
Also Read : పాక్ సంచలన నిర్ణయం.. నకిలీ నోట్లకు చెక్!









