Bangladesh :  బంగ్లాదేశ్ జైళ్లలో 15 దేశాలకు చెందిన 407 మంది విదేశీయులు ఉన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, బంగారం అక్రమంగా తరలించడం, అక్రమంగా వ్యాపారం చేయడం వంటి కేసుల్లో వీరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ 407 మంది విదేశీ ఖైదీల్లో 238 మంది భారతీయులు ఉన్నారు. అంటే, విదేశీ ఖైదీల్లో సగానికి పైగా భారతీయులే అన్నమాట. వీరిలో 168 మంది ఇప్పటికే తమ జైలు శిక్షను పూర్తి చేశారు. అయినా వారు ఇంకా బంగ్లాదేశ్ జైళ్లలోనే ఉన్నారు. వారిని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు పూర్తి కాకపోవడమే దీనికి కారణం.

Also Read : భారత్‌లో అల్లర్లకు అంతర్జాతీయంగా కుట్ర? 9 దేశాల్లో 101 నెట్‌వర్క్‌లు

అయితే, భారత హైకమిషన్ మరో విషయం చెబుతోంది. బంగ్లాదేశ్ జైళ్లలో శిక్ష పూర్తి చేసుకుని భారత్‌కు రావాల్సిన భారతీయులు 25 మంది మాత్రమే ఉన్నారని హైకమిషన్ అధికారి తెలిపారు. అసలు సమస్య వారి గుర్తింపు విషయంలోనే ఉంది. జైల్లో ఉన్న వ్యక్తులు నిజంగా భారతీయులేనా కాదా అనే విషయం ముందుగా తెలుసుకోవాల్సి ఉంది. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ 121 మంది భారతీయ ఖైదీల జాబితాను భారత హైకమిషన్‌కు పంపింది. వీరంతా జైలు శిక్ష పూర్తి చేసుకున్నారని బంగ్లాదేశ్ అధికారులు చెప్పారు. కానీ, ఈ 121 మందిలో చాలామంది గురించి పూర్తి వివరాలు లేవని భారత అధికారి తెలిపారు. దీంతో వారు భారతీయులే అని నిర్ధారించడం కష్టంగా మారింది.

ఈ ఖైదీలను కలుసుకుని వారి వివరాలు తెలుసుకునేందుకు భారత హైకమిషన్ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ నుంచి సమాధానం రావాల్సి ఉంది. కొన్ని కేసుల్లో ఖైదీల వివరాలు తెలుసుకునే పని ఇప్పటికే జరుగుతోంది. బంగ్లాదేశ్ జైళ్లలో శిక్ష పూర్తయి, తమ దేశాలకు వెళ్లాల్సిన 152 మంది విదేశీ ఖైదీల్లో 148 మంది భారతీయులేనని తెలిపింది. ఖైదీల అసలు వివరాలు తెలుసుకోవడంలో ఆలస్యం, ప్రభుత్వాల మధ్య జరిగే పనుల్లో ఆలస్యం కారణంగా శిక్ష పూర్తయిన తర్వాత కూడా వారు జైళ్లలోనే ఉండాల్సి వస్తోంది,

భారతీయుల తర్వాత బంగ్లాదేశ్ జైళ్లలో ఎక్కువ మంది మయన్మార్‌కు చెందినవారు ఉన్నారు. మయన్మార్‌కు చెందిన 133 మంది జైళ్లలో ఉన్నారు. వీరిలో ఒక్కరు మాత్రమే శిక్ష పూర్తి చేసుకుని తమ దేశానికి వెళ్లాల్సి ఉంది. ఇక నైజీరియాకు చెందిన ఆరుగురు, పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు, మలేషియాకు చెందిన ముగ్గురు కూడా బంగ్లాదేశ్ జైళ్లలో ఉన్నారు. భద్రత కోసం విదేశీ ఖైదీలను ప్రత్యేక గదుల్లో ఉంచుతున్నారు. వారు ఉండే ప్రాంతాల బయట సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. శిక్ష పూర్తయిన తర్వాత కూడా విదేశీ ఖైదీలను జైళ్లలో ఉంచడం వల్ల తమకు ఇబ్బందులు పెరుగుతున్నాయని బంగ్లాదేశ్ జైలు అధికారులు చెబుతున్నారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి రావడంతో ప్రభుత్వానికి అదనంగా ఖర్చు కూడా అవుతోందని అధికారులు తెలిపారు.

Also Read : పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. ఒక్కసారిగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. అసలు కారణం ఇదే!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.