
Pakistan: మనదేశంలో నిత్యం ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న పాకిస్థాన్ ఉగ్రదాడులకు బలికాక తప్పడం లేదు. ఆ దేశం అనుసరిస్తున్న విధానాలతో విసిగిపోయిన పలు ప్రాంతాలు తమకు పాక్ నుంచి విముక్తి కావాలని పోరాడుతున్నాయి. తమ ప్రాంతానికి స్వాంతంత్ర్యం సాధించడం కోసం పలువురు సాయుధులుగా మారి ప్రభుత్వంపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఆ దేశంలో మరో భారీ పేలుడు చోటు చేసుకోవడం కలకలం సృష్టించింది.. వాయువ్య పాకిస్థాన్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో ఈ రోజు (శనివారం) భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో సుమారు 11 మంది ప్రాణాలు కోల్పోయారు.. మరో 30 మందికి పైగా గాయపడినట్లు స్థానిక అత్యవసర సేవల విభాగం నిర్వహకులు వెల్లడించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అసోసియేటెడ్ ప్రెస్ (AP) తెలిపిన వివరాల ప్రకారం.. డేరా ఇస్మాయిల్ ఖాన్ లోని చెక్‌పోస్టు దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి పేల్చివేసినట్లు పోలీసులు, సహాయక సిబ్బంది గుర్తించారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.
కాగా, ఈ దాడి తామే చేసినట్లు తెహ్రీక్- ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) వెల్లడించినట్లు AP పేర్కొంది. TTP విడుదల చేసిన ప్రకటనలో ఈ పేలుడికి తామే బాధ్యులమని ప్రకటించినట్లు తెలిపింది. పేలుడు మూలంగా గాయపడిన పలువురు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో మరి కొందరి పరిస్థితి విషమంగా ఉందని ప్రావిన్షియల్ ఎమర్జెన్సీ సర్వీస్ ప్రతినిధి APకి వివరించారు. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి భారీగా బూడిద రంగు పొగ పైకి ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.









