
పశ్చిమాసియాలో రోజురోజుకూ ముదురుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా వ్యవస్థపై పడుతున్న తీవ్ర ఒత్తిడి గ్లోబల్ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. దీనికి తోడు అమెరికా, ఇరాన్ మధ్య ప్రతిపాదిత చర్చలు హఠాత్తుగా నిలిచిపోవడంతో ఇంధన లభ్యతపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 110 డాలర్ల సమీపానికి చేరాయి. ఒకవేళ పరిస్థితులు మరింత దిగజారితే ఈ ధర బ్యారెల్‌కు ఏకంగా 115 నుంచి 120 డాలర్ల మార్కును దాటిపోవచ్చని మార్కెట్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఈ మార్కెట్ అస్థిరతకు ప్రధాన కేంద్రబిందువుగా అంతర్జాతీయంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మారింది. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురులో సింహభాగం ఈ సముద్ర మార్గం గుండానే సాగుతుంది. ఈ కీలక మార్గంలో సరుకుల రవాణాకు ఏ చిన్న విఘాతం కలిగినా, అది ప్రపంచవ్యాప్తంగా చమురు కొరతకు దారితీసి ధరలు ఆకాశాన్నంటేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సముద్రంలో ఓడలపై జరుగుతున్న దాడులు, హౌతీ తిరుగుబాటుదారుల బెదిరింపులు కూడా ఈ రవాణా అంతరాయాలకు మరింత బలమైన కారణాలుగా మారుతున్నాయి.
ప్రస్తుతం గ్లోబల్ ఇన్వెస్టర్లు ప్రతీ వారంలో వెలువడే అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ గణాంకాలు, కుషింగ్ ఇన్వెంటరీలు, యూఎస్ చమురు నిల్వల డేటాను పరిశీలిస్తున్నారు. ఇటీవల యూఎస్ క్రూడ్ నిల్వల్లో ఏకంగా 8 మిలియన్ బ్యారెళ్ల అనూహ్య క్షీణత నమోదు కావడం చమురు ధరల పెరుగుదలకు అదనపు బలాన్ని ఇచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ నవనీత్ దమానీ అభిప్రాయం ప్రకారం.. అమెరికా-రష్యా ఒప్పందాలు లేదా ఆంక్షల సడలింపుల ప్రతిపాదనలు వచ్చినా కూడా క్షేత్రస్థాయిలోని భౌతిక సరఫరా పరిమితులే మార్కెట్‌ను శాసిస్తున్నాయి.
భారతీయ మార్కెట్లపై దీని ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్‌లో క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ వార వ్యవధిలోనే దాదాపు 6.4 శాతం మేర పెరిగి బ్యారెల్ ధర రూ. 9,394 స్థాయికి చేరుకుంది. పశ్చిమాసియాలో ముప్పు పెరిగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.









