భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది డెంగ్యూ బారిన పడుతున్నారు. వర్షాకాలంలో ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే డెంగ్యూ వ్యాక్సిన్ రాబోతుంది. జపాన్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ టకేడా డెంగ్యూ వ్యాక్సిన్ క్యూడెంగా(Qdenga Vaccine) ను అభివృద్ధి చేయనుంది. వచ్చే ఏడాది దీన్ని మార్కెట్‌లోకి తీసుకురావాలని సన్నహాలు చేస్తోంది. అయితే దేశంలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ దీనిని అభివృద్ధి చేయనుంది. ఈ వ్యాక్సిన్‌కు ఈ సంవత్సరం భారతదేశ ఔషధ నియంత్రణ సంస్థ అయిన సీడీఎస్సీఓ ఆమోదం లభించింది.

డెంగ్యూ ఒక సాధారణ వైరల్ జ్వరం కాదు. ఇది ఈడిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. కొందరు కోలుక్కుంటే మరికొందరిలో ప్లేట్‌లెట్లు వేగంగా తగ్గిపోతాయి. దీంతో అది ప్రాణాంతకంగా మారుతుంది. అయితే దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది డెంగ్యూ బారిన పడుతున్నారు. వర్షాకాలం తర్వాత కేసులు తీవ్రంగా పెరుగుతాయి. దీనికి కారణం డెంగ్యూ దోమలు శుభ్రమైన నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. వర్షాలు పడిన తర్వాత ఈ దోమలు ఇంటి పైకప్పులపై, మొక్కల కింద కుండీలలో మిగిలిపోయిన నీటిలో, కూలర్ల నుండి మిగిలిపోయిన నీటిలో వృద్ధి చెందుతాయి.

ప్రపంచంలో డెంగ్యూ వ్యాధికి వ్యతిరేకంగా అభివృద్ధి చేసిన అతికొద్ది టీకాలలో క్యూడెంగా ఒకటి. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది నాలుగు ప్రధాన డెంగ్యూ వైరస్ రకాల (DENV-1, DENV-2, DENV-3, DENV-4) నుంచి రక్షణ కల్పించేలా రూపొందించారు. అయితే ఈ డెంగ్యూ కేవలం ఒక రకం వైరస్ వల్ల కాకుండా.. నాలుగు వేర్వేరు రకాల వైరస్‌ల వల్ల వస్తుంది. ఒక వ్యక్తికి ఒకసారి డెంగ్యూ సోకిన తర్వాత, అతనికి మరో రకం డెంగ్యూ వైరస్ సోకే అవకాశం ఉంది. ఆ రెండో ఇన్ఫెక్షన్ తరచుగా మరింత తీవ్రంగా ఉండవచ్చు.

Also Read : యువతకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఒకే రోజు 51 వేల మందికి ఉద్యోగ పత్రాలు!

ఈ టీకా ఎలా పనిచేస్తుంది?

క్యూడెంగా మీ శరీరాన్ని డెంగ్యూ నుండి ముందుగానే కాపాడుతుంది. ఈ టీకాలో డెంగ్యూ వైరస్ బలహీనపరిచిన రూపాన్ని ఉపయోగిస్తారు. టీకా వేయించుకున్న తర్వాత శరీరం రోగనిరోధక వ్యవస్థ వైరస్‌ను గుర్తించడం నేర్చుకుని, దానికి వ్యతిరేకంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. దీని అర్థం భవిష్యత్తులో నిజమైన డెంగ్యూ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే శరీరం దానికి వ్యతిరేకంగా వేగంగా ప్రతిస్పందించగలదు. ఈ టీకా మీ శరీరానికి డెంగ్యూ నుండి ముందుగానే నెట్ ప్రాక్టీస్ ఇస్తుంది.

ఎన్ని డోసులు పడతాయి?

క్యూడెంగా అనేది రెండు డోసుల టీకా. ఒక డోసు, రెండవ డోసు మూడు నెలల తర్వాత తీసుకోవాలి. ఇది 4 నుండి 60 సంవత్సరాల వయస్సు గల వారికి ఆమోదించారు. అయితే ఇంతకు ముందు డెంగ్యూ వచ్చి ఉన్నా లేకపోయినా దీనిని వేయవచ్చు. కొన్ని పాత డెంగ్యూ టీకాలకు ముందుగా డెంగ్యూ పరీక్ష అవసరమయ్యేది. కాకపోతే ఇంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.

ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఏటా వేలాది డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. తొలిసారిగా ప్రజలకు దోమల నివారణ సలహాలతో పాటు ఈ వ్యాధిని నిరోధించే టీకా కూడా అందుబాటులోకి రానుంది. పోలియో, హెపటైటిస్ వంటి వ్యాధులపై టీకాలు ఎలాగైతే గణనీయమైన మార్పును తీసుకువచ్చాయో.. అదే విధంగా రాబోయే సంవత్సరాలలో తీవ్రమైన డెంగ్యూ సంబంధిత అనారోగ్యాలను, ఆసుపత్రి చేరికలను తగ్గించడంలో క్యూడెంగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండనివ్వవద్దు
కూలర్లు, కుండలలోని నీటిని క్రమం తప్పకుండా మార్చండి
పూర్తి చేతుల దుస్తులు ధరించండి
దోమల వలలు, నివారకాలను ఉపయోగించండి

Also Read : ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. వైట్‌హౌస్ నుంచి ఈ న్యూస్ ఛానెళ్లపై బ్యాన్.. ఎందుకో తెలుసా?