
H-1B వీసా ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. తాను ఉపయోగించిన ఇండెంచర్డ్ సర్వెంట్స్ అనే పదం సరైనది కాదని ఆయన అంగీకరించారు. తన విమర్శలు H-1B వీసా ఉద్యోగులపై కాదని, వారిని నియమించుకునే అమెరికా కంపెనీలు, అలాగే H-1B వీసా వ్యవస్థపైనే అని స్పష్టం చేశారు. H-1B వీసా ఉద్యోగులను ఇండెంచర్డ్ సర్వెంట్స్ గా వర్ణించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పదజాలం చాలా బాధాకరంగా ఉందని, దీనికి చారిత్రక, వలస పాలనకు సంబంధించిన తీవ్రమైన అర్థాలు ఉన్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
CBS నిర్వహించిన టౌన్ హాల్ కార్యక్రమంలో మాట్లాడిన జేడీ వాన్స్ తన వ్యాఖ్యలను వివరించారు. అమెరికాలో H-1B వీసాపై పనిచేసే వ్యక్తి ఉద్యోగం కోల్పోతే, ఆ వీసానే అమెరికాలో ఉండటానికి అతనికి ప్రధాన ఆధారంగా మారుతుందని చెప్పారు. కంపెనీతో సమస్య వచ్చినా, యజమానితో విభేదించినా ఉద్యోగం పోయే అవకాశం ఉండటంతో పాటు, వీసా రద్దు అయితే ఆ వ్యక్తిని తిరిగి తన దేశానికి పంపించే పరిస్థితి ఉంటుందని వివరించారు.
Also Read : సముద్రంలో ఐఫోన్లు.. ఇరాన్లో జనం పరుగులు? అసలు నిజం ఇదే!
తన వ్యాఖ్యలు సరిగ్గా లేకపోయి ఉంటే అందుకు తానే బాధ్యత వహిస్తానని వాన్స్ అన్నారు. H-1B వీసా ఉన్న ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో కంపెనీలు అమెరికాలో తగిన ఉద్యోగి దొరకలేదని చెప్పి H-1B వీసాపై విదేశీ ఉద్యోగులను తీసుకొస్తాయని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో ఉద్యోగం, వీసా రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటం వల్ల H-1B ఉద్యోగులపై కంపెనీలకు ఎక్కువ అధికారం ఉంటోందని వాన్స్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగం పోతే అమెరికాలో ఉండే అవకాశం కూడా కోల్పోయి, తమ దేశానికి తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఆయన అన్నారు. అందుకే తన విమర్శ కంపెనీలపై, అలాగే ఇలాంటి పరిస్థితులకు అవకాశం ఇస్తున్న వీసా విధానంపైనే అని మరోసారి స్పష్టం చేశారు.
అమెరికాలో H-1B వీసాపై పనిచేస్తున్న వ్యక్తికి అదే ఉద్యోగంలో పనిచేసే అమెరికన్ పౌరుడితో పోలిస్తే 20 వేల డాలర్లు తక్కువ జీతం వస్తోందని వాన్స్ అప్పట్లో చెప్పారు. విదేశీ ఔట్సోర్సింగ్ కంపెనీల ద్వారా వచ్చిన వారికి ఇదే తరహా ఉద్యోగం చేసే అమెరికన్ ఉద్యోగితో పోలిస్తే 48 వేల డాలర్లు తక్కువగా వస్తోందని ఆయన పేర్కొన్నారు. విదేశీ కంపెనీలు తక్కువ జీతాలకు ఉద్యోగులను తీసుకువచ్చి, అమెరికన్ ఉద్యోగులను తొలగించడం ద్వారా భారీగా లాభాలు పొందుతున్నాయని వాన్స్ ఆరోపించారు. అమెరికా ఉద్యోగుల స్థానంలో విదేశీ ఉద్యోగులను తీసుకురావడం వల్ల అమెరికన్ కార్మికులకు నష్టం జరుగుతోందని ఆయన అన్నారు. వాన్స్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ, అక్కడి కొత్త ఆవిష్కరణల రంగానికి భారతీయ నిపుణులు ఎంతో సహకరిస్తున్న విషయాన్ని ఈ వ్యాఖ్యలు పట్టించుకోలేదని MEA పేర్కొంది.
Also Read : బంగ్లాదేశ్లో ఘోర అగ్నిప్రమాదం : రిసార్ట్లో మంటలు, 10 మంది సజీవ దహనం!









