గతేడాది నవంబర్‌లో ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2026 నవంబర్‌లో ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడికి ‘అల్-ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్’ (AQIS) హస్తం ఉందని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో AQIS ఒక ఉగ్రవాద సంస్థ నుండి ప్రాంతీయ ఉగ్రవాద సంస్థగా మారిందని నివేదికలు తెలిపాయి.

AQIS తన కార్యకలాపాల కోసం లాజిస్టికల్, ఆర్థిక నెట్‌వర్క్‌లను కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ నివేదిక ప్రత్యేకంగా బంగ్లాదేశ్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడ కొత్త ఉగ్రవాద సెల్‌లను ఏర్పాటు చేయడానికి AQIS బంగ్లాదేశ్‌ను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. భారత దర్యాప్తు సంస్థ అయిన జాతీయ దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ఛార్జిషీట్, ఏక్యూఐఎస్, దాని అనుబంధ సంస్థ అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ మధ్య ఉన్న సంబంధాన్ని కూడా వెల్లడించింది. 2026 మే నెలలో, ఎన్ఐఏ ఈ కేసులో పాటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక న్యాయస్థానంలో దాదాపు 7,500 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ ప్రధాన నిందితుడైన డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో సహా 10 మంది నిందితులకు ఏజీయూహెచ్‌తో సంబంధాలు ఉన్నాయని గుర్తించింది.

2025 నవంబర్‌లో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో 11 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ కేసును మొదట ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేయగా ఆ తర్వాత ఎన్ఐఏ (NIA) తీసుకుంది. దర్యాప్తులో ఎన్ఐఏ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ ద్వారా మృతుడైన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీని గుర్తించింది. ఉమర్ ఉన్ నబీ పుల్వామా నివాసి, హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో వైద్యశాస్త్ర సహాయ ఆచార్యునిగా పనిచేసేవారు.

ఎన్ఐఏ తన దర్యాప్తులో ఈ మొత్తం ముఠా పెద్ద జిహాదీ కుట్రలో భాగమని పేర్కొంది. నిందితులలో కొందరు వైద్య నిపుణులు ఉన్నారు. వీరు ఏక్యూఐఎస్, ఏజీయూహెచ్‌తో ప్రభావితులయ్యారు. 2022లో శ్రీనగర్‌లో ఒక రహస్య సమావేశం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో ఉపయోగించిన పేలుడు పదార్థం ట్రైఎసిటోన్ ట్రైపెరాక్సైడ్, లేదా టీఏటీపీ. ఈ పేలుడు మిశ్రమాన్ని తయారు చేయడానికి నిందితులు అవసరమైన సామగ్రిని సేకరించి, అనేక ప్రయోగాలు చేశారని దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు ఏకే-47లు, క్రింకోవ్ రైఫిళ్లు, దేశీయంగా తయారు చేసిన పిస్టళ్లతో సహా పలు ఆయుధాలను, సజీవ తూటాలను సమకూర్చుకున్నారు. రాకెట్లు, డ్రోన్ల ద్వారా ప్రయోగించగల ఐఈడీలతో నిందితులు ప్రయోగాలు చేస్తున్నట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. జమ్మూ కాశ్మీర్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని భద్రతా సంస్థలను లక్ష్యంగా చేసుకోవడమే వారి ఉద్దేశమని దర్యాప్తులో తేలింది.

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన దాడిపై ఎన్ఐఏ (NIA) దర్యాప్తును జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లకు విస్తరించింది. ఈ కేసులో 588 మంది సాక్షుల వాంగ్మూలాలు, వందలాది ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేయగా, ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేశారు. వైద్య నిపుణులు, విద్యార్థులను భావజాలంతో ప్రేరేపించి చిన్న సెల్స్‌గా ఏర్పరచడం, రాకెట్లు, డ్రోన్ల ఆధారిత పేలుడు పదార్థాలను తయారు చేయడం వంటి తీవ్ర కుట్రలు ఈ మాడ్యూల్ వెనుక ఉన్నట్లు తేలింది. బంగ్లాదేశ్ ద్వారా దక్షిణాసియాలో నెట్‌వర్క్ విస్తరించడానికి AQIS యత్నిస్తుండటంతో భారత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ‘రా’ (R&AW) కార్యదర్శి పరాగ్ జైన్ ఇటీవల బంగ్లాదేశ్‌లో పర్యటించారు. దర్యాప్తు సంస్థలు పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నాయి.