
Russian attack in Ukraine : రష్యా ఉక్రెయిన్ల మధ్య సాగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రెండు దేశాలు కూడా డ్రోన్ల దాడితో దద్దరిల్లుతున్నాయి. ఈ క్రమంలో రష్యా మరోసారి ఉక్రెయిన్ పై డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన ఈ డ్రోన్ దాడిలో ఏకంగా 37 మంది మరణించినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది రష్యా చేసిన అత్యంత భీకర దాడి ఇదేనని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. బుచా జిల్లాలోని మైలా ప్రాంతంలో ఆయుధాలను నిల్వ చేసిన గోదాముపై రష్యా ఈ దాడి జరిపింది. ఈ దాడిలో గోదాము లోపలి ఆయుధాలు పేలిపోయాయి. దీంతో మంటలు సమీపంలోని ఇళ్లు, భవనాలకు వ్యాపించి అనేక మంది దుర్మరణం పాలయ్యారు.
గురువారం నుంచి రష్యా ఉక్రెయిన్‌పై ఏకధాటిగా దాడులు కొనసాగిస్తోంది. రాజధాని కీవ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై వరుస దాడులకు దిగడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీగా మిసైల్స్‌ను సిద్ధం చేసిపెట్టుకున్న రష్యా క్రమం తప్పకుండా దాడులు చేస్తోంది. నిత్యం దాడులతో తమను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపిస్తున్నారు. వరుసపెట్టి జరుగుతున్న దాడులను ఎదుర్కొనే క్రమంలో ఉక్రెయిన్ ఆయుధ నిల్వలు అడుగంటిపోవాలనే లక్ష్యంతో రష్యా ముందుకెళుతోందని ఉక్రెయిన్ అధికారులు పేర్కొంటున్నారు. రష్యాతో నిరంతర యుద్ధం కారణంగా గగనతల రక్షణ వ్యవస్థకు కీలకమైన పాట్రియల్ మిసైల్స్ నిల్వలు తగ్గిపోతున్నాయని ఉక్రెయిన్ ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. దానికి అవసరమైన మిసైళ్ల సరఫరా పెంచాలని అమెరికాకు విజ్ఞప్తి చేసింది.
ఇక మైలాలో రష్యా జరిపిన దాడిలో దాదాపు 50 భవనాలు దెబ్బతిన్నాయి. అక్కడే ఉన్న ఓ వృద్ధాశ్రమం కూడా దాడిలో ధ్వంసం కాగా అందులో ఉన్న పలువురు వృద్దులు కూడా దుర్మరణం చెందారు. దాడుల నేపథ్యంలో దాదాపు 370 మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు స్థానిక అధికారులు తెలిపారు.కాగా, జనావాసాల మధ్య ఆయుధాలను ఎందుకు నిల్వ చేశారని స్థానికులు కొందరు అధికారులను ప్రశ్నించారు. కొందరి నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ సందర్భంగా అంగీకరించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చనిపోయిన బాధితులకు సానుభూతి తెలిపారు.









