రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం దాలుస్తున్న వేళ.. ఉక్రెయిన్ భూభాగంలో ఉన్న ఒక భారతీయ ఔషధ తయారీ సంస్థపై దాడులు జరగడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో ఉన్న ప్రముఖ భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ ‘కుసుమ్‌’ ప్లాంట్‌పై రష్యా సైన్యం డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ ఆకస్మిక దాడుల్లో ఫార్మా ప్లాంట్ దారుణంగా దెబ్బతినడమే కాకుండా రూ.400 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.

ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో ఉన్న కుసుమ్ ఫార్మా ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ డ్రోన్లు నేరుగా ప్లాంట్ ప్రాంగణంలో పడటంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. కాసేపట్లోనే మంటలు వేగంగా విస్తరించి తయారీ విభాగం అత్యంత కీలకమైన మందుల నిల్వ గిడ్డంగులను పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడి జరిగిన సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రక్షణ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాయి.

ఈ ఘటనలో అత్యాధునిక ఉత్పత్తి యంత్రాలు, నిల్వ ఉంచిన అత్యవసర ప్రాణరక్షణ మందులు, ముడి పదార్థాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ దాడుల కారణంగా కంపెనీకి దాదాపు రూ.400 కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి అనేక పారిశ్రామిక ప్రాంగణాలు దెబ్బతిన్నప్పటికీ ఒక భారతీయ ఫార్మా దిగ్గజానికి ఈ స్థాయిలో భారీ నష్టం వాటిల్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ కుసుమ్ గ్రూప్‌‌ను భారతదేశానికి చెందిన రాజీవ్ గుప్తా నడుపుతున్నారు. దీనిని1994లో ప్రారంభించారు. మొదటి రోజుల్లో భారత్ నుంచి నాణ్యమైన మందులను ఉక్రెయిన్‌కు ఎగుమతి చేసే ఒక చిన్న పంపిణీ సంస్థగా వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత సొంతంగా ఔషధాలను తయారు చేయాలనే లక్ష్యంతో తయారీ రంగంలోకి ప్రవేశించారు. అందులో భాగంగా 2007లో భారతదేశంలో మొదటి ఫార్మా ప్లాంట్‌ను, 2009లో ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో రెండవ ప్లాంట్‌ను విజయవంతంగా స్థాపించారు.

గత కొన్నేళ్లుగా ఉక్రెయిన్ ప్రజలతో పాటు వివిధ యూరోపియన్ దేశాలకు అవసరమైన అనేక రకాల కీలక మందులను ఈ ప్లాంట్ ఉత్పత్తి చేస్తోంది. ఉక్రెయిన్ ఫార్మా మార్కెట్‌లో అత్యంత విశ్వసనీయమైన కంపెనీగా కుసుమ్ గ్రూప్ మంచి పేరు సంపాదించింది. అయితే రష్యా సరిహద్దుకు సమీపంలో ఉండే సుమీ ప్రాంతంపై రష్యా బలగాలు తరచూ దాడులు చేస్తూనే ఉన్నాయి.