Russia : ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా.. విదేశీయులను సైన్యంలోకి తీసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మాజీ అమెరికా సైనికులను కూడా రష్యా లక్ష్యంగా చేసుకుంటోందని, ఇప్పటివరకు కనీసం 18 మంది మాజీ అమెరికా సర్వీస్ సిబ్బంది రష్యా సైన్యంలో చేరినట్లు పేర్కొంది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దాడి మొదలుపెట్టినప్పటి నుంచి రష్యాకు భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పలు అంచనాలు చెబుతున్నాయి. సైనికుల కొరతను భర్తీ చేసుకునేందుకు రష్యా ఇతర దేశాల నుంచి కూడా సైనికులను నియమించుకుంటోందని సమాచారం. ఉత్తర కొరియా, భారత్, పలు ఆఫ్రికా దేశాలు, బ్రిటన్, అమెరికా సహా వివిధ దేశాలకు చెందిన వ్యక్తులు రష్యా సైన్యంలో చేరినట్లు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.

ఉక్రెయిన్ భద్రతా అధికారులు దాదాపు 29 వేల మంది విదేశీయులు 135 దేశాల నుంచి వచ్చి రష్యా తరఫున పోరాడుతున్నట్లు గుర్తించారు. అయితే అసలు సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. రష్యా సైన్యంలో చేరిన తర్వాత విదేశీయులను అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలకు పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ రక్షణ స్థావరాలపై జరిగే తీవ్ర దాడుల్లో వారిని ముందువరుసలోకి పంపుతున్నారని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. రష్యా సైనికుల కొరత కారణంగానే విదేశీయుల నియామకం పెరిగిందని ఉక్రెయిన్‌లో రష్యా సైనికుల లొంగుబాటుకు సంబంధించిన ప్రభుత్వ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్న విటాలీ మాట్వియెంకో అన్నారు. రష్యాకు ప్రతి నెలా 30 వేల నుంచి 40 వేల వరకు సైనిక నష్టం జరుగుతోందని, ఆ నష్టాన్ని భర్తీ చేయడం కష్టంగా మారడంతో విదేశీయులను నియమించుకుంటున్నారని ఆయన చెప్పారు.

Also Read : ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. త్వరలోనే అమెరికా విజయం

విదేశీ సైనికులు చనిపోయినా రష్యా సమాజంలో పెద్దగా వ్యతిరేకత రాదని మాట్వియెంకో ఆరోపించారు. అలాగే, చనిపోయిన విదేశీ సైనికుల కుటుంబాలకు వారికి రావాల్సిన పరిహారం కూడా చాలా సందర్భాల్లో అందడం లేదని పేర్కొన్నారు. విదేశీయులను ఆకర్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిక్రూటర్లు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారని సమాచారం. ఫేస్‌బుక్, టిక్‌టాక్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రకటనలు పెట్టి.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని, రష్యా అనుకూల భావజాలంతో ఉన్నవారిని, వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారిని టార్గెట్ చేస్తున్నారని కథనం పేర్కొంది. ఒక్క వ్యక్తిని రష్యా సైన్యంలో చేర్పించినందుకు రిక్రూటర్‌కు సుమారు 24 వేల డాలర్లు, ఆ వ్యక్తి జీతంలో కొంత భాగం కూడా అందుతుందని తెలిపింది.

అమెరికా సైన్యంలో చేరే వారికి సాధారణంగా 26 వేల డాలర్ల సైనింగ్ బోనస్‌తో పాటు నెలకు 2 వేల డాలర్ల జీతం ఉంటుందని కథనం పేర్కొంది. రష్యా సైన్యంలో చేరిన అమెరికన్లలో ఎక్కువగా చర్చకు వచ్చిన పేరు మైఖేల్ గ్లోస్. 21 ఏళ్ల గ్లోస్.. అప్పట్లో CIAలో ఉన్నత స్థాయిలో పనిచేసిన అధికారి జూలియానే గల్లినా కుమారుడు. ఆయన తండ్రి ల్యారీ గ్లోస్ మాజీ అమెరికా నేవీ సిబ్బంది. గ్లోస్ 2024లో రష్యా తరఫున ఉక్రెయిన్‌లో పోరాడుతూ మరణించాడు. రష్యా సైనికులతో కలిసి మిలిటరీ దుస్తుల్లో ఉన్న అతని ఫొటోలు బయటకు రావడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. గ్లోస్ వ్యక్తిDగత సమస్యలతో ఇబ్బంది పడుతూ కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉన్నాడని, ఆ తర్వాత రష్యా సైన్యంలో చేరినట్లు సమాచారం. డొనెట్స్క్‌లో రష్యా సైనికుడిపై ఆర్టిలరీ దాడి జరిగిన సమయంలో అతడిని కాపాడేందుకు ప్రయత్నిస్తూ గ్లోస్ మరణించినట్లు అతని తండ్రి తెలిపారు.

Also Read : చట్టాన్ని పక్కన పెట్టి చైనాకు ఆయుధాలు.. ట్రంప్ స్కెచ్ అదేనా?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.