
స్క్రీన్‌పై కనిపిస్తే లక్షలాది మంది ఆమె మాటలకు ఫిదా అయ్యేవారు. నేరగాళ్ల గుండెల్లో భయం పుట్టించేలా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ షోస్ చేసేది. సమాజంలో భద్రత గురించి మాట్లాడేది. కానీ కెమెరా లైట్లు ఆరిపోయిన తర్వాత… ఆమె అసలు రూపం బయటపడింది. బయటికి గ్లామరస్ టీవీ యాంకర్.. కానీ తెరవెనుక ఇంటర్నేషనల్ డ్రగ్స్ సిండికేట్ సూత్రధారి. చివరకు నేరగాళ్లకు శిక్షలు పడాలని టీవీలో మాట్లాడిన ఆమెకే.. అదే కోర్టు మరణ శిక్ష విధించింది. అసలు ఎవరీ సారా ఖలీఫా? ఏం చేసింది? ఆమె వెనుక ఉన్న డ్రగ్స్ నెట్వర్క్ ఏంటి? ఇప్పుడు చూద్దాం.
39 ఏళ్ల సారా ఖలీఫా ఈజిప్టు రాజధాని కైరోలో ప్రముఖ టీవీ ప్రజెంటర్. ‘Mission Impossible’ అనే క్రైమ్ షోస్‌కు ఆమె యాంకర్‌గా పనిచేసేది. క్రైమ్, నేషనల్ సెక్యూరిటీ, అండర్‌వరల్డ్ మాఫియా వంటి అంశాలను తన షోలో ఎక్స్పోజ్ చేసేది. దీంతో ఆమెకు భారీగా పాపులారిటీ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లోనే 25 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. టీవీతో పాటు ఆమె హై-అండ్ కాస్మోటిక్ సర్జరీ క్లీనిక్ నడిపేది. VIP పార్టీస్, సెలబ్రిటీ ఈవెంట్స్ నిర్వహించే ప్రొడెక్షన్ కంపెనీ కూడా ఉండేది. లగ్జరీ లైఫ్‌స్టైల్, ఖరీదైన కార్లు, సెలబ్రిటీ పరిచయాలు.. చూస్తే ఆమెది ఒక పర్ఫెక్ట్ సక్సస్ఫుల్ లైఫ్‌లా కనిపించేది.
కానీ.. ఆ గ్లామర్ అంతా ఒక మాస్క్ మాత్రమే! ఆమె అసలు వ్యాపారం డ్రగ్స్ అని దర్యాప్తులో బయటపడింది. సారా ఖలీఫా సాధారణ డ్రగ్ పెడ్లర్ కాదు. ఒక ఆర్గనైజ్డ్ డ్రగ్ సిండికేట్‌ను నడిపిందని అధికారులు ఆరోపించారు. విదేశాల నుంచి సింథటిక్ డ్రగ్స్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను రహస్యంగా దిగుమతి చేసుకున్నారు. ఆ తర్వాత కైరోలోని ఖరీదైన రెసిడెన్సియల్ ప్రాంతాలలో రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ను అద్దెకు తీసుకున్నారు. బయటికి చూస్తే సాధారణ ఫ్లాట్లు… కానీ లోపల మాత్రం పూర్తి స్థాయి సీక్రెట్ డ్రగ్ ల్యాబ్స్. అక్కడే పెద్ద మొత్తంలో సింథటిక్ డ్రగ్స్ తయారు చేసి, లోకల్ మార్కెట్‌తో పాటు ఇతర ప్రాంతాలకు స్మగ్లింగ్ చేసేలా నెట్వర్క్ ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ముఠాలో ఒక్కొక్కరికి ఒక్కో పని. ఒకరు ముడి పదార్థాలు తెస్తారు.. మరొకరు డ్రగ్స్ తయారు చేస్తారు.. ఇంకొకరు సప్లై, స్మగ్లింగ్ చూసుకుంటారు. ఈ మొత్తం నెట్వర్క్ వెనుక ప్రధాన సూత్రధారి సారా ఖలీఫానే అని అధికారులు తేల్చారు. అయితే.. ఇంతకాలం సాగిన ఈ సీక్రెట్ ఆపరేషన్‌కు చివరకు బ్రేక్ పడింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఈజిప్షియన్ మాదకద్రవ్యాల నిరోధక అధికారులు ఈ రెండు అపార్ట్మెంట్స్పై రైడ్స్ చేశారు. లోపలికి వెళ్లిన పోలీసులకు భారీగా డ్రగ్స్, వాటి తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు కనిపించాయి. అధికారుల ప్రకారం.. 750 కిలోలకు పైగా సింథటిక్ డ్రగ్స్ బయటపడ్డాయి. అంతేకాదు, అక్రమంగా ఉన్న తుపాకులు, భారీగా మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో సారా ఖలీఫాతో పాటు ఈ నెట్‌వర్క్‌కు చెందిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
టీవీలో క్రైమ్‌ను ఇన్వెస్టిగేట్ చేసే స్టార్ యాంకర్.. రియల్ లైఫ్‌లోనే డ్రగ్ నెట్‌వర్క్‌లో చిక్కుకోవడం ఈజిప్ట్‌లో సంచలనంగా మారింది. కేసు కోర్టుకు వెళ్లిన తర్వాత అసలు హైడ్రామా మొదలైంది. ప్రాసిక్యూషన్ కేవలం ఆరోపణలతో ఆగిపోలేదు. దాదాపు 20 మంది సాక్షుల వాంగ్మూలాలు సేకరించారు. నిందితుల మొబైల్ ఫోన్స్ నుంచి వాట్సాప్ చాట్స్, డ్రగ్స్‌కు సంబంధించిన ఫొటోస్, వీడియోస్, ఫైనాన్సియల్ ట్రాన్షక్షన్స్ వంటి డిజిటల్ ఎవిడెన్స్‌ను కోర్టు ముందు పెట్టారు. అయితే సారా ఖలీఫా మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. “నేను ఎలాంటి తప్పు చేయలేదు.. జీవితంలో కనీసం ఒక్క సిగరెట్ కూడా కాల్చలేదు. నాకు డ్రగ్స్ గురించి కూడా తెలియదు” అంటూ కోర్టులో కన్నీళ్లు పెట్టుకుంది. తన కుటుంబం తనను క్రమశిక్షణతో పెంచిందని, తన సంపాదన తనకు సరిపోతుందని, డ్రగ్స్ అమ్మాల్సిన అవసరం తనకు లేదని కోర్టును వేడుకుంది. కానీ ప్రాసిక్యూషన్ సమర్పించిన ఎవిడెన్స్‌ను పరిశీలించిన కోర్టు ఆమె వాదనలను అంగీకరించలేదు.
అంతేకాదు.. సారా ఖలీఫాపై ఇది ఒక్కటే కేసు కాదని కూడా బయటపడింది. గతంలో ఒక యువకుడిని కిడ్నాప్ చేసి టార్చర్ చేసిన కేసులో ఆమెకు ఇప్పటికే ఐదేళ్ల జైలు శిక్ష పడినట్లు సమాచారం. చివరకు కైరో క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సారా ఖలీఫాతో పాటు మొత్తం 12 మంది నిందితులకు మరణ శిక్ష విధించింది. మరో 9 మందికి జీవిత ఖైదు ఖరారు చేసింది. సరైన సాక్ష్యాలు లేని ఏడుగురిని మాత్రం నిర్దోషిగా విడుదల చేసింది. ఇక్కడ మరో కీలక విషయం ఉంది. ఈజిప్టులో మరణశిక్ష అమలు చేయడానికి న్యాయస్థాన తీర్పు తర్వాత గ్రాండ్ ముఫ్తీ అభిప్రాయం కూడా కీలకం. మతపరమైన పరిశీలన పూర్తయ్యాకే శిక్షను ఫైనలైజ్ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సారా ఖలీఫా సహా నిందితులకు విధించిన మరణశిక్ష ఖరారు చేశారు. అయితే ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీల్ చేస్తామని ఆమె లాయర్స్ ప్రకటించారు. అంటే.. టీవీలో నేరగాళ్లకు శిక్షలు పడాలని మాట్లాడిన ఒక స్టార్ యాంకర్.. ఇప్పుడు తానే ఉరికొయ్య నీడలో నిలబడింది. ఈ కేసు మరో విషయాన్ని కూడా గుర్తుచేస్తోంది.
ఈజిప్టులో డ్రగ్ అక్రమ రవాణాను చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. హత్య, టెర్రరిజం వంటి తీవ్రమైన నేరాలతో పాటు కొన్ని డ్రగ్ రిలేటెడ్ నేరాలకు కూడా మరణశిక్ష విధించే అవకాశం ఉంది. సారా ఖలీఫా కేసులో కోర్టు ముందు ఉంచిన డిజిటల్ ఎవిడెన్స్, స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, సాక్షుల వాంగ్మూలాలు.. ఇవన్నీ కలిపి ఆమెకు వ్యతిరేకంగా బలమైన కేసును నిర్మించాయని ప్రాసిక్యూషన్ వాదించింది. ఒకప్పుడు క్రైమ్‌ను బయటపెట్టిన ఆమె.. ఇప్పుడు తన జీవితంలోనే అతిపెద్ద క్రైమ్ కేసుకు ప్రధాన నిందితురాలిగా మారింది. గ్లామర్‌తో సంపాదించిన పేరు.. ఒకవైపు. అదే గ్లామర్ వెనుక సాగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రగ్స్ నెట్వర్క్ మరోవైపు. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే.. టీవీలో నేరగాళ్లను ప్రశ్నించిన సారా ఖలీఫా నిజంగానే అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌కు మాస్టర్ మైండ్‌గా వ్యవహరించిందా? లేక ఆమె చెబుతున్నట్టుగా తాను ఈ కేసులో ఇరికించబడ్డారా? కోర్టు తీర్పు ఒక దిశలో వెళ్లింది. కానీ ఆమె లాయర్స్ మాత్రం అప్పీల్‌కు సిద్ధమవుతున్నారు.









