
సౌదీ అరేబియాలో ప్రస్తుతం పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. నిరంతరం జరిగే హూతీ తిరుగుబాటుదారుల క్షిపణి, డ్రోన్ దాడులతో ఆ దేశం భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అసలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు కలిగిన సౌదీ అరేబియాలో హూతీ దాడులతో ఫెయిల్ అయ్యాయి. దాడులు జరుగుతున్నా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందడం లేదు. అసలు దీనికి గల కారణాలు ఏంటి? సౌదీలో ఏం జరుగుతోందనే వివరాలు చూద్దాం.
సౌదీ అరేబియాలో చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, పైప్‌లైన్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు లాంటి కీలక ప్రదేశాలు దేశమంతటా విస్తరించి ఉన్నాయి. హూతీలు జరుపుతున్న నిరంతర దాడుల వల్ల సౌదీ దగ్గర ఉన్న క్షిపణి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. దేశంలోని ప్రతి అంగుళాన్ని లేదా అన్ని ముఖ్య ప్రాంతాలను ఒకేసారి కాపాడటానికి అవసరమైనన్ని పేట్రియాట్ డిఫెన్స్ బ్యాటరీలు ఆ దేశం దగ్గర ప్రస్తుతం లేవు.
క్షిపణుల కొరత తీవ్రమవడంతో సౌదీ ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశంలోని సాధారణ పౌర ప్రాంతాలు, ఇతర స్థానాల నుంచి వాయు రక్షణ బ్యాటరీలను తొలగించి వాటిని కేవలం రెండు లేదా మూడు అత్యంత సున్నితమైన, వ్యూహాత్మక ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేసింది. దీనివల్ల మిగతా ప్రాంతాలు, విమానాశ్రయాలు దాడులకు సులభంగా బలైపోతున్నాయి.
గతంలో సౌదీ ప్రభుత్వం అత్యవసర సమయాల్లో ప్రజల మొబైల్ ఫోన్లకు హెచ్చరిక సందేశాలు పంపే వ్యవస్థను ప్రారంభించింది. కానీ ఇటీవల రియాద్ విమానాశ్రయంపై దాడులు జరిగినప్పుడు మాత్రం సౌదీ ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు కూడా జారీ చేయలేదు. రాత్రిపూట వచ్చే ఈ నోటిఫికేషన్ల వల్ల ప్రజలకు, వ్యాపారాలకు భయాందోళనలు కలుగుతున్నాయని కొందరు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం వీటిని నిలిపివేసింది. అంతేకాకుండా దేశం ప్రశాంతంగానే ఉందని పౌరులకు, విదేశీ పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతోనే సౌదీ ప్రభుత్వం ఈ హెచ్చరికలు ఆపేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సైలెన్స్ వల్ల దాడి జరుగుతున్న విషయం తెలియక ప్రజలు తీవ్రంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది.









